సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్ తగిలింది. మంత్రికి ముందస్తు సమాచారం లేకుండా, ఆమెకు తెలియకుండానే అటవీశాఖలో పలువురు అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) వినయ్ కుమార్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. ముగ్గురు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల డిప్యూటేషన్లను రద్దు చేశారు. డిప్యూటేషన్ రద్దయిన అధికారులు వెంటనే హెడ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని పీసీసీఎఫ్ ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా నేరుగా మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నందుకే సదరు అధికారులపై ఈ విధమైన చర్యలు తీసుకున్నట్లు అటవీశాఖ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.
తమ డిప్యూటేషన్ల రద్దు వ్యవహారంపై ఎఫ్‌ఆర్‌ఓ సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు వెంటనే మంత్రి కొండా సురేఖను కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండానే పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు అటవీశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి ఆదేశాలను అధిగమించి ఉన్నతాధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై రాజకీయ, అటవీశాఖ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవలే మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మంత్రి సురేఖకు టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ఆమెను మంత్రివర్గం నుండి తొలగించాలని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఈ రాజకీయ వివాదం ముదిరి, ఆమె మంత్రి పదవిపైనే ఊహాగానాలు నడుస్తున్న తరుణంలో.. అటవీశాఖలో మంత్రికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పీసీసీఎఫ్ వినయ్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి ప్రాధాన్యతను తగ్గించడానికే ఉన్నతాధికారులు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి


