సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్ కోర్‌లో 22ఏ అంశం ఎంతో జఠిలంగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. 22A బాధితులకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో న్యాయం చేసి తీరుతుందన్నారు. హైదరాబాద్‌లో ఈ రోజు (సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అబద్ధాలతో ప్రతిపక్షం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని.. ఈ అంశంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి తేల్చిచెప్పారు.
మంత్రి మాట్లాడుతూ.. ప్లాట్ల బుకింగ్ కోసం డబ్బులు చెల్లించిన వారికి నగదు వెనక్కి ఇస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబరు పనిచేయడం లేదని బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఇప్పటివరకూ ఆ నంబర్‌కు వేలాదిగా కాల్స్ వచ్చాయి. క్యూర్ ప్రాంతంలోని రైతుల సమస్యలను చర్చించాం. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి రిజిష్ట్రేషన్లు చేస్తాం. ఫాస్ట్ ట్రాక్‌లో రిజిష్ట్రేషన్లు చేస్తాం. అని మంత్రి అన్నారు.
సెక్షన్ 22ఏ సమస్య ఏంటి?
రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22ఏ ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు, అసైన్డ్ భూములు, భూదాన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇటీవల ప్రభుత్వం తీసుకవచ్చిన 'భూ భారతి'లో 2026 ఏప్రిల్‌లో రెవెన్యూ శాఖ నిషేధిత ఆస్తుల జాబితాను నవీకరించింది. ఈ ప్రక్రియలో అధికారులు సరైన పరిశీలన లేకుండానే జాబితాలను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. ఒకే సర్వే నంబర్‌లో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్‌లోని మొత్తం ప్రైవేట్ పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ గందరగోళం తలెత్తింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రత అధికంగా ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాలతో పాటు, దశాబ్దాల క్రితం హుడా, హెచ్‌ఎండీఏ అనుమతులతో ఏర్పడిన కాలనీలు, అపార్ట్‌మెంట్లు కూడా ఈ జాబితాలో చేరాయి. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లినప్పుడే తమ ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయని యజమానులకు తెలియడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.


