శ్రమను మించిన దైవం లేదని, చేసే వృత్తి ఏదైనా దానికి ఇచ్చే గౌరవం ఒక్కటేనని నిరూపించారు. ఒక సాధారణ పారిశుద్ధ్య కార్మికుడు. కష్టపడే మనస్తత్వం, శ్రమకు ఇచ్చే గౌరవం మనిషి హోదాను ఎలా పెంచుతుంది అనడానికి ఆయన జీవితమే గొప్ప ఉదాహరణ. ఎంత ఎదిగినా ఒదిగా ఉండే లక్షణం ఆయనకు ఆభరణం. లక్షల విలువైన ఫార్చ్యూనర్ (Fortuner) కారులో వచ్చి, రోడ్లను ఊడ్చి తాపీగా వెళ్లిపోతుంటారు. పదండి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, బిస్రోడికి చెందిన శేషప్ప (Sesappa) అనే పారిశుద్ధ్య కార్మికుడి స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుంది.
ప్రతిరోజూ ఉదయం, శేషప్ప అందరి దృష్టిని ఆకర్షించే 'టయోటా ఫార్చ్యూనర్' వాహనంలో తన పనికి చేరుకుంటారు. కానీ అక్కడికి రాగానే, ఆయనలో ఎలాంటి హోదా లేదా ప్రత్యేక అధికారాల ప్రదర్శన ఉండదు. వాహనం దిగి, చీపురు పట్టుకుని రోడ్లను ఊడ్చడం ప్రారంభిస్తారు.మంగళూరు శివార్లలోని బంట్వాల్ తాలూకాలో ఉన్న నావూర్ గ్రామానికి చెందిన శేషప్ప జీవితం పూల పాన్పేమీ కాదు. ఎన్నో కష్టాలు, ఎదురుదెబ్బలు, మద్యం మత్తు,పరివర్తన ఇలా అనేక బాధల భావోద్వేగాల అవిశ్రాంత శ్రమల కలయిక.
1996లో శేషప్ప ప్రభుత్వ సేవలో చేరారు. రోజుకు కేవలం రూ.50 జీతంతో శేషప్ప తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. ఆర్థిక సమస్యలు, కష్టాల వల్ల ఒక దశలో మద్యపానానికి బానిసయ్యారు. 2005లో ఆయన జీవితంలో ఒక కీలక మలుపు వచ్చింది. అప్పటి బంట్వాళ్ సబ్-ఇన్‌స్పెక్టర్ బెల్లియప్ప మాటలు ఆయనను తీవ్రంగా ఆలోచింపజేశాయి. దాంతో మద్యం పూర్తిగా మానేసి, క్రమశిక్షణతో జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు.
తండ్రి అంత్యక్రియలకు డబ్బుల్లేక
తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా శేషప్ప వద్ద డబ్బులు లేవు. ఎవరూ సహాయం చేయకపోవడంతో, తండ్రి మృతదేహాన్ని నెత్రావతి నది ఒడ్డుకు తీసుకెళ్లి స్వయంగా దహన సంస్కారాలు చేశారు. ఈ ఘటనే ఆయనను ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా పట్టుదలను పెంచింది.ఆయన దృష్టిలో ఏ పనీ చిన్నది కాదు. అది నిజాయితీతో కూడిన పని అయితే చాలు, చేయడానికి ఆయన సిద్ధంగా ఉండేవారు.
ఇదీ చదవండి: మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీ
ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం వరకు వీధులు ఊడ్చడం, చెత్త తరలించే వాహనాన్ని నడపడం వంటి పనులు చేస్తారు. మధ్యాహ్నం తర్వాత వ్యవసాయం, పాడి పరిశ్రమ (డైరీ ఫార్మింగ్) , ఇతర కూలీ పనులు చేస్తూ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకున్నారు. ఇలా ఎక్కువ పనిగంటలు పనిచేయడం ద్వారా నెలకు మరో రూ.40వేలు ఆర్జించేవారు. తన కష్టార్జితంతో తొలుత ఆల్టో కారు కొన్నారు. పారిశుధ్య కార్మికుడికి కారా అని చాలామంది ఎగతాళి చేశారు. అయినా పట్టించుకోలేదు. ఆ తరువాత కొన్నాళ్లకు స్పార్పియో కొన్నారు. పాత కారును విక్రయించి మళ్లీ లోన్ తీసుకుని కొత్త కారు కొనడం అలవాటుగా మారింది. అలా ఎన్నో అవమానాలు, అవహేళనలు, క్రమం కఠోర శ్రమ తరువాత ఆయన ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేసే స్థాయికి అతని జీవితం ఆర్థిక పరిణతిని సాధించింది.
పనే దైవం (Work is Worship)
ఎంతటి ఖరీదైన కారు ఉన్నప్పటికీ, శేషప్ప తన మూలాలను మర్చిపోలేదు. 'ఫార్చ్యూనర్' కారులో రాగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, అతను స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేయడానికే మొగ్గు చూపుతారు. రోజూ ఫార్చ్యూనర్ కారులో వచ్చి, తన చేతితో చీపురు పట్టి వీధులను శుభ్రం చేస్తూనే ఉన్నారు. అతను ఇప్పటికీ వీధులను ఊడ్చుతారు.అతను ఇప్పటికీ చెత్తను తరలించే వాహనాన్ని నడుపుతారు అంతేనా ఇప్పటికీ వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ పనుల్లో నిమగ్నమై ఉంటారు.
ఇదీ చదవండి: బిడ్డకు మేనమామ ఉంగరం : బిడ్డింగ్ దక్కించుకున్న జ్యుయల్లర్స్ ఇవే!


