బైక్‌ ట్యాక్సీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు | Supreme Court Clears Way for Bike Taxis in Karnataka | Sakshi
Sakshi News home page

బైక్‌ ట్యాక్సీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Nov 20 2026 9:14 PM | Updated on Nov 20 2026 9:19 PM

Supreme Court Clears Way for Bike Taxis in Karnataka

సాక్షి,న్యూఢిల్లీ: కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవల నిర్వహణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. బైక్‌ ట్యాక్సీలను అనుమతిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాపిడో, ఉబర్ మోటో, ఓలా వంటి అగ్రిగేటర్ సంస్థలతో పాటు లక్షలాది మంది ప్రయాణికులకు పెద్ద ఊరట లభించింది.

తీర్పు సందర్భంగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బైక్‌ ట్యాక్సీలను పూర్తిగా నిషేధించడం కంటే తగిన నిబంధనలతో నియంత్రించడమే సరైన మార్గమని స్పష్టం చేశారు.

‘నా కార్యాలయంలో పనిచేసే యువతులను మీరు ఆఫీసుకు ఎలా వస్తారని అడిగాను. క్యాబ్‌లు పెట్టుకునే స్థోమత లేక బైక్‌ ట్యాక్సీలపై వస్తున్నామని వారు చెప్పారు. ఆటోల్లో ఎందుకు రావడం లేదని అడిగితే.. ‘సార్, ఆటో ఛార్జీలు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి’ అని బదులిచ్చారు. జీపీఎస్ ట్రాకింగ్ సదుపాయం ఉన్నందున బైక్‌ ట్యాక్సీలు యువతులకు కూడా సురక్షితమే. ఇప్పటికే 25 రాష్ట్రాల్లో బైక్‌ ట్యాక్సీలు నడుస్తున్నాయి’అని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రద్దీగా ఉండే నగరాల్లో బైక్‌లు రోడ్డుపై చాలా తక్కువ స్థలాన్ని తీసుకుంటాయని, ట్రాఫిక్ రద్దీ ఆందోళనలను నిషేధంతో కాకుండా నియంత్రణ చర్యలతో పరిష్కరించుకోవాలని ధర్మాసనం అభిప్రాయపడింది. మోటార్‌సైకిళ్లను ట్యాక్సీగా ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం కూడా తమ నోటిఫికేషన్ల ద్వారా స్పష్టం చేసిందని కోర్టు దృష్టికి వచ్చింది.

బైక్‌ ట్యాక్సీల వల్ల కర్ణాటకలో సుమారు 4.5 లక్షల మంది ప్రయాణికులు లబ్ధి పొందుతున్నట్లు అగ్రిగేటర్ సంస్థలు కోర్టుకు వివరించాయి. ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఇవి చౌకైన, వేగవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. రాపిడో, ఉబర్, ఓలా సంస్థలు ఈ తీర్పును స్వాగతించాయి. సురక్షితమైన, బాధ్యతాయుతమైన, నియంత్రిత విధానంలో సేవలను ముందుకు తీసుకెళ్లడానికి కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని రాపిడో పేర్కొంది. రద్దీ నగరాల్లో ఇదొక ముఖ్యమైన ప్రయాణ సాధనమని ఉబర్ వ్యాఖ్యానించింది.

భద్రత, బీమా, ట్రాఫిక్ రద్దీ, ఆటో-ట్యాక్సీ యూనియన్ల అభ్యంతరాల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం బైక్‌ ట్యాక్సీలపై ఆంక్షలు,నిషేధం విధించింది. బెంగళూరు మినహా ఇతర ప్రాంతాల్లో పరిశీలించగలమని చెప్పినప్పటికీ, బెంగళూరులో బైక్‌ ట్యాక్సీలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.

అయితే, ఈ ఏడాది జనవరి 23న కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ బైక్‌ ట్యాక్సీల నిర్వహణకు అనుమతిస్తూ, వాణిజ్య రిజిస్ట్రేషన్లు,పర్మిట్ల దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించింది. ఆ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, నేడు అత్యున్నత న్యాయస్థానం ఆ అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో నిబంధనలకు లోబడి బైక్‌ ట్యాక్సీల నిర్వహణకు మార్గం సుగమమైంది.

ఇదీ చదవండి : Bike Taxi Ban: అవసరమైతే హైదరాబాద్‌కి పోతాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement