తాజ్‌ మహల్ సందర్శనకు అనుమతి కోరిన పాక్ మంత్రి.. నో చెప్పిన కేంద్రం | No Taj Mahal Visit for Pak Minister at SCO Event, Says Centre | Sakshi
Sakshi News home page

తాజ్‌ మహల్ సందర్శనకు అనుమతి కోరిన పాక్ మంత్రి.. నో చెప్పిన కేంద్రం

Nov 20 2026 7:50 PM | Updated on Nov 20 2026 7:50 PM

No Taj Mahal Visit for Pak Minister at SCO Event, Says Centre

సాక్షి,న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ పర్యావరణశాఖ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు భంగపాటు ఎదురైంది. తాజ్‌మహల్, నిజాముద్దీన్ దర్గాలను సందర్శించేందుకు అనుమతి కోరిన ఆయన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆయన పర్యటన కేవలం అధికారిక సదస్సు కార్యక్రమాలకు మాత్రమే పరిమితమని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం.

నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలోని చారిత్రాత్మక పురానా ఖిల్లా వేదికగా జరుగుతున్న తొలి  సివిలైజేషనల్ డైలాగ్ ఫోరంలో పాల్గొనడానికి మాత్రమే మాలిక్‌కు వీసా మంజూరైందని వర్గాలు తెలిపాయి. సదస్సు వేదిక మినహా ఇతర ప్రాంతాల సందర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

2023లో గోవాలో జరిగిన ఎస్‌సీవో సమావేశానికి నాటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరైన తర్వాత, ఒక పాకిస్థాన్ కేంద్ర మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి. 2025 పహల్గాం ఉగ్రదాడి,ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇటీవల జరిగిన ఓ జలవనరుల సమావేశంలో సింధూ జలాల ఒప్పందంపై మాలిక్ చేసిన కఠిన వ్యాఖ్యలు, పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న దౌత్యపరమైన చర్యల నేపథ్యంలో ఈ పర్యటనపై దేశీయంగా రాజకీయ చర్చలు నడుస్తున్నాయి.

మరోవైపు, ఢిల్లీలో జరుగుతున్న మూడు రోజుల ఎస్‌సీవో సివిలైజేషనల్ డైలాగ్ ఫోరంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పురాతన నాగరికతలు, సాంస్కృతిక అనుసంధానం, వారసత్వ సంపద పరిరక్షణ వంటి అంశాలపై సభ్య దేశాల ప్రతినిధులు చర్చిస్తున్నారు. ఈ వేదిక ద్వారా ప్రాంతీయ సంబంధాలు మెరుగుపడతాయని తాను ఆశిస్తున్నట్లు ముసాదిక్ మాలిక్ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement