2035కల్లా రోజుకి 1.3 మిలియన్ బ్యారళ్ల అదనపు డిమాండ్
న్యూఢిల్లీ: రానున్న దశాబ్ద కాలంలో వర్ధమాన మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలోకెల్లా భారత్ నుంచి ఇంధనానికి అత్యధిక డిమాండ్ నమోదుకానున్నట్లు అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ(ఐఈఏ) తాజాగా పేర్కొంది. రెన్యువబుల్ ఎనర్జీ, విద్యుదీకరణ, దేశీ బొగ్గు ఉత్పత్తి పుంజుకున్నప్పటికీ ఇంధన దిగుమతులపై ఆధారపడటం మరింత పెరుగుతుందని తెలియజేసింది.
ఐఈఏ రూపొందించిన స్టెప్స్ ప్రకారం 2035కల్లా వార్షికంగా భా రత్ ఎనర్జీ డిమాండ్ సగటున 2.5 శాతం చొప్పున పుంజుకోనున్నట్లు అంచనా వేసింది. ఇది ప్రపంచ డిమాండ్ రేటుతో పోలిస్తే మూడు రెట్లు అధికమని, ఇందుకు పెరుగుతున్న ఆదాయాలు, పారిశ్రామిక విస్తరణ, పట్టణీకరణ, రవాణా, శీతలీకర ణ ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. వెరసి 2035కల్లా రోజుకి 1.3 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ) అదనపు చమురుకు భారత్ నుంచి డిమాండ్ పుట్టనున్నట్లు అభిప్రాయపడింది. 2026 ప్రపంచ ఎనర్జీ ఔట్‌లుక్‌పై నివేదికలో ఈ అంశాలు పేర్కొంది.
గ్యాస్ వినియోగం సైతం..
2025లో నమోదైన 5.6 మిలియన్ బ్యారళ్ల డిమాండ్ నుంచి 2035కల్లా 7.5 మిలియన్ బ్యారళ్లకు బలపడనున్నట్లు స్టెప్స్ ప్రకారం ఐఈఏ అంచనా వేసింది. ఈ బాటలో నేచురల్ గ్యాస్ డిమాండ్ సైతం ఇదే సమయంలో 69 బిలియన్ ఘనపు మీటర్ల(బీసీఎం) నుంచి రెట్టింపై 137 బీసీఎంకు చేరే వీలున్నట్లు పేర్కొంది. ఓవైపు చమురు శుద్ధి(రిఫైనింగ్) సామర్థ్యాలు విస్తరించనున్నప్పటికీ మరోపక్క దేశీయంగా చమురు ఉత్పత్తి తగ్గనుండటంతో దిగుమతులపై ఆధారపడటం పెరగనున్నట్లు వివరించింది.
2025కల్లా భారత్ 6 మిలియన్ బీపీడీ రిఫైనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని, ఇది ప్రపంచంలోనే నాలుగో పెద్ద రిఫైనింగ్ వ్యవస్థ అని తెలియజేసింది. మరో 8,40,000 బీపీడీ రిఫైనింగ్ సామర్థ్యం నిర్మాణంలో ఉన్నదని, దీంతో ప్రపంచ పెట్రోలియం ప్రొడక్టుల సరఫరాదారు స్థానం మరింత పటిష్టంకానున్నట్లు వెల్లడించింది. అయితే 2035కల్లా దేశీయంగా చమురు ఉత్పత్తి దాదాపు 20 శాతం నీరసించనున్నదని, మరోపక్క రిఫైనరీ సామర్థ్యం మిలియన్ బీపీడీ పెరగనున్నట్లు పేర్కొంది.
దీంతో చమురు దిగుమతులు పెంచుకోవలసి ఉంటుందని తెలియజేసింది. దేశీయంగా 40 శాతం డిమాండుకు తగినట్లుగా 2025లో 4,50,000 బ్యారళ్ల ఎల్‌పీజీ ఉత్పత్తికాగా.. స్టెప్స్ అంచనాల ప్రకారం 2035కల్లా మరో లక్ష బ్యారళ్లమేర జత కలవనుంది. అయితే 4,00,000 బ్యారళ్లకు అదనంగా డిమాండ్ పుట్టనుంది. వెరసి రోజుకీ లక్ష మిలియన్ బ్యారళ్లను దిగుమతి చేసుకోవలసి ఉంటుందని ఐఈఏ మదింపు చేసింది. నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిక్ కుకింగ్ వినియోగం పెరగడంతోపాటు.. ఎల్‌పీజీ ఉత్పత్తి పుంజుకుంటే 2035కల్లా రోజుకి 7,50,000 బ్యారళ్లలోపు దిగుమతులకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది.


