వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక కొత్త PUC నిబంధనలు | PUC Certificate New Rules BS-I BS-III BS-VI Vehicles Check Validity | Sakshi
Sakshi News home page

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక కొత్త PUC నిబంధనలు

Nov 19 2026 9:20 PM | Updated on Nov 19 2026 9:24 PM

PUC Certificate New Rules BS-I BS-III BS-VI Vehicles Check Validity

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (PUC) సర్టిఫికెట్‌ గడువును వాహనం వయస్సు, ఉద్గార ప్రమాణాలు, వాహన రకాన్ని బట్టి సవరించింది. ముఖ్యంగా కొత్త BS-VI ప్రైవేట్ కార్లు, బైక్‌లకు ఇకపై ప్రతిసారీ ఏడాదికి ఒకసారి PUC పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆరేళ్లలోపు వాహనాలకు ఏకంగా మూడేళ్లపాటు చెల్లుబాటయ్యే సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌–1989లోని నిబంధన 115(7)కు సవరణలు చేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) రూల్స్‌–2026లో భాగంగా ఈ మార్పులు తీసుకొచ్చింది. కొత్త విధానం ప్రకారం PUC గడువు వాహనాల వయస్సుతోపాటు అవి ప్రైవేట్‌వా లేదా వాణిజ్య వాహనాలా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది.

వాహనాల వారీగా కొత్త PUC గడువులు

BS-I, BS-II, BS-III వాహనాలకు PUC చెల్లుబాటు 3 నెలలు  ఉంటుంది. BS-IV వాహనాలకు 6 నెలలు, BS-VI ప్రైవేట్ వాహనాలకు 6 ఏళ్లలోపువైతే 3 ఏళ్లు 6–10 ఏళ్లవైతే ఏడాది, 10 ఏళ్లు పైబడినవైతే 6 నెలలు PUC చెల్లుబాటు అవుతుంది. BS-VI వాణిజ్య వాహనాల విషయానికి వస్తే 6 ఏళ్లలోపువాటికైతే 2 ఏళ్లు,  6–10 ఏళ్లవి అయితే ఏడాది, అదే 10 ఏళ్లు పైబడినవైతే 6 నెలలు PUC చెల్లుబాటు ఉంటుంది.

పాత వాహనాలకు తరచూ పరీక్షలు

పాత ఉద్గార ప్రమాణాలతో నడిచే వాహనాలకు మాత్రం కొత్త నిబంధనలతో వెసులుబాటు ఉండదు. BS-I, BS-II, BS-III వాహనాలకు మూడు నెలలకోసారి, BS-IV వాహనాలకు ఆరు నెలలకోసారి కాలుష్య పరీక్షలు చేయించుకోవాలి. గతంలో ఈ వాహనాలకు వరుసగా ఆరు నెలలు, ఏడాది వరకు గడువు ఉండేది. కొత్త నిబంధనలతో దేశవ్యాప్తంగా ఒకే విధమైన గడువులు అమల్లోకి వచ్చాయి.

సర్టిఫికెట్ గడువు విషయంలో కీలక మార్పు

PUC సర్టిఫికెట్ గడువు ముగియడానికి ముందు చివరి 10 రోజుల్లోనే వాహనాన్ని పరీక్షించి పునరుద్ధరించుకుంటే, కొత్త సర్టిఫికెట్ పాత సర్టిఫికెట్ గడువు ముగిసిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత పరీక్ష చేయించుకుంటే, కొత్త సర్టిఫికెట్ పరీక్ష చేసిన తేదీ నుంచే చెల్లుబాటు అవుతుంది. అంటే గడువు ముగిసిన తర్వాత మధ్యలో ఉన్న రోజులకు అదనపు ప్రయోజనం ఉండదు.

ప్రస్తుత సర్టిఫికెట్ల సంగతేంటి?

కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందు జారీ చేసిన PUC సర్టిఫికెట్లను వెంటనే మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాటి ప్రస్తుత గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఆ తర్వాత తొలిసారి పునరుద్ధరించుకునే సమయంలోనే కొత్త గడువులు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన కేంద్రాల్లోనే PUC పరీక్షలు చేయించుకోవాలి. వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన PUC సర్టిఫికెట్‌ను ఎప్పుడూ చెల్లుబాటులో ఉంచుకోవడం తప్పనిసరి.

ఇదీ చదవండి: టోల్‌ గేట్‌ దాటితే చాలు.. రూ.10 వేలు జరిమానా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement