breaking news
Vehicle pollution Certificates
-
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక కొత్త PUC నిబంధనలు
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ గడువును వాహనం వయస్సు, ఉద్గార ప్రమాణాలు, వాహన రకాన్ని బట్టి సవరించింది. ముఖ్యంగా కొత్త BS-VI ప్రైవేట్ కార్లు, బైక్‌లకు ఇకపై ప్రతిసారీ ఏడాదికి ఒకసారి PUC పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆరేళ్లలోపు వాహనాలకు ఏకంగా మూడేళ్లపాటు చెల్లుబాటయ్యే సర్టిఫికెట్ జారీ చేస్తారు.రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్–1989లోని నిబంధన 115(7)కు సవరణలు చేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) రూల్స్–2026లో భాగంగా ఈ మార్పులు తీసుకొచ్చింది. కొత్త విధానం ప్రకారం PUC గడువు వాహనాల వయస్సుతోపాటు అవి ప్రైవేట్‌వా లేదా వాణిజ్య వాహనాలా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది.వాహనాల వారీగా కొత్త PUC గడువులుBS-I, BS-II, BS-III వాహనాలకు PUC చెల్లుబాటు 3 నెలలు ఉంటుంది. BS-IV వాహనాలకు 6 నెలలు, BS-VI ప్రైవేట్ వాహనాలకు 6 ఏళ్లలోపువైతే 3 ఏళ్లు 6–10 ఏళ్లవైతే ఏడాది, 10 ఏళ్లు పైబడినవైతే 6 నెలలు PUC చెల్లుబాటు అవుతుంది. BS-VI వాణిజ్య వాహనాల విషయానికి వస్తే 6 ఏళ్లలోపువాటికైతే 2 ఏళ్లు, 6–10 ఏళ్లవి అయితే ఏడాది, అదే 10 ఏళ్లు పైబడినవైతే 6 నెలలు PUC చెల్లుబాటు ఉంటుంది.పాత వాహనాలకు తరచూ పరీక్షలుపాత ఉద్గార ప్రమాణాలతో నడిచే వాహనాలకు మాత్రం కొత్త నిబంధనలతో వెసులుబాటు ఉండదు. BS-I, BS-II, BS-III వాహనాలకు మూడు నెలలకోసారి, BS-IV వాహనాలకు ఆరు నెలలకోసారి కాలుష్య పరీక్షలు చేయించుకోవాలి. గతంలో ఈ వాహనాలకు వరుసగా ఆరు నెలలు, ఏడాది వరకు గడువు ఉండేది. కొత్త నిబంధనలతో దేశవ్యాప్తంగా ఒకే విధమైన గడువులు అమల్లోకి వచ్చాయి.సర్టిఫికెట్ గడువు విషయంలో కీలక మార్పుPUC సర్టిఫికెట్ గడువు ముగియడానికి ముందు చివరి 10 రోజుల్లోనే వాహనాన్ని పరీక్షించి పునరుద్ధరించుకుంటే, కొత్త సర్టిఫికెట్ పాత సర్టిఫికెట్ గడువు ముగిసిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత పరీక్ష చేయించుకుంటే, కొత్త సర్టిఫికెట్ పరీక్ష చేసిన తేదీ నుంచే చెల్లుబాటు అవుతుంది. అంటే గడువు ముగిసిన తర్వాత మధ్యలో ఉన్న రోజులకు అదనపు ప్రయోజనం ఉండదు.ప్రస్తుత సర్టిఫికెట్ల సంగతేంటి?కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందు జారీ చేసిన PUC సర్టిఫికెట్లను వెంటనే మార్చుకోవాల్సిన అవసరం లేదు. వాటి ప్రస్తుత గడువు ముగిసే వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఆ తర్వాత తొలిసారి పునరుద్ధరించుకునే సమయంలోనే కొత్త గడువులు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించిన కేంద్రాల్లోనే PUC పరీక్షలు చేయించుకోవాలి. వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన PUC సర్టిఫికెట్‌ను ఎప్పుడూ చెల్లుబాటులో ఉంచుకోవడం తప్పనిసరి.ఇదీ చదవండి: టోల్ గేట్ దాటితే చాలు.. రూ.10 వేలు జరిమానా! -
ఉత్తుత్తి తనిఖీలపై కొరడా!
పొల్యూషన్ చెకప్ వాహనాలకు ఆర్టీఏ చెక్ ఇష్టారీతిలో పొల్యూషన్ ధృవీకరణ పత్రాల జారీపై సీరియస్ కమిషనర్ ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం ఒకే రోజు 24 వాహనాలు స్వాధీనం సిటీబ్యూరో వాహనాల కాలుష్యంపై ఉత్తుత్తి పరీక్షలు జరిపి ధృవీకరణ పత్రాలు ఇచ్చే కాలుష్య తనిఖీ వాహనాలపై రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా కొరడా ఝళిపించారు. విషం చిమ్మే వాహనాలకు సైతం రోడ్లపై తిరిగేందుకు అనుమతులిచ్చిన నకిలీ కాలుష్య తనిఖీ వాహనాలపై చర్యలకు ఉపక్రమించారు. కమిషనర్ ఆదేశాలతో అప్రమత్తమైన ఆర్టీఏ అధికారులు గురువారం ఒక్క రోజే 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యంపై భూరేలాల్ కమిటీ చాలా సంవత్సరాల క్రితమే హెచ్చరించింది. నగరంలో అలాంటి వాహనాలను నిలిపివేయాలని సూచించింది. 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలపై నిషేధం విధించాలని చెప్పింది. కానీ భూరేలాల్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలయ్యాయి. నగరంలో వాహనాల కాలుష్యాన్ని నిర్ధారించి, సర్టిఫికెట్లు అందజేసేందుకు రవాణాశాఖ అనుమతిచ్చిన కాలుష్య తనిఖీ మొబైల్ వాహనాల్లో చాలావరకు ఉత్తుత్తివే. వాహనాల నుంచి వెలువడే పొగను పరీక్షించి కాలుష్యకారక పదార్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ధారించవలసిన ఈ సంచార వాహనాలు చాలా ఏళ్ల క్రితమే లక్ష్యానికి దూరమయ్యాయి. ఎలాంటి పరీక్షలు జరుపకుండానే ఎడాపెడా ‘ఆర్టీఏ అనుమతి పత్రాలను’ ఇచ్చేస్తున్నాయి. మరోవైపు వీటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, లెసైన్సు ఇవ్వాల్సిన ఆర్టీఏ అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. తాజాగా రవాణా కమిషనర్ సందీప్ సుల్తానియా వాహనకాలుష్య నియంత్రణపై సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు పాతర నగరంలో ఆర్టీఏ అధికారుల లెక్కల ప్రకారం 153 మొబైల్ వాహనాలు కాలుష్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ అంతకు రెట్టింపు సంఖ్యలోనే ఎలాంటి అనుమతులు లేని వాహనాలు కాలుష్య తనిఖీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. గురువారం స్వాధీనం చేసుకున్న 24 వాహనాల్లో చాలా వరకు లెసైన్సు లేకుండా, ఫిట్నెస్ లేకుండా, నకిలీ పరికరాలతో పరీక్షలు నిర్వహిస్తూ పట్టుబడ్డాయి. ఆటోమోబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) గుర్తింపు పొందిన కాలుష్య తనిఖీ వాహనాలు మాత్రమే పరీక్షలు జరపాల్సి ఉంటుంది. కానీ నగరంలో ఉన్నవాటిలో చాలా వరకు ఏఆర్ఏఐ అనుమతి లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని పరీక్షించే గ్యాస్ అనలైజర్లు, స్మోక్ మీటర్లు సైతం ఉత్తుత్తివే కావడం గమనార్హం. నిజానికి వాహన కాలుష్యాన్ని పరీక్షించడంలో ఈ రెండు చాలా కీలకమైనవి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోరిక్షాల కాలుష్యాన్ని గ్యాస్ అనలైజర్ల ద్వారా పరీక్షిస్తారు. లారీలు, బస్సుల వంటి డీజిల్‌తో నడిచే వాహనాలను స్మోక్ మీటర్ల ద్వారా పరీక్షించాలి. కానీ నగరంలోని కాలుష్య తనిఖీ వాహనాల్లో చాలా వరకు ఈ పరికరాలు నకిలీవే . ఫిర్యాదు చేయండి : జేటీసీ, హైదరాబాద్ వాహన కాలుష్య తనిఖీ కేంద్రాలపై నగరవాసులు త మ ఫిర్యాదులను తెలియజేయవచ్చునని హైదరాబాద్ జేటీసీ రఘునాథ్ తెలిపారు. ఆర్టీఏ టోల్‌ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్‌చేసి సమాచారం అందజేయాలని కోరారు. జేబులు గుల్ల రవాణాశాఖ నిబంధనల మేరకు ద్విచక్ర వాహనాల నుంచి రూ.30, కార్లు, ఆటోరిక్షాల నుంచి రూ.50, లారీలు, బస్సులు తదితర డీజిల్ వాహనాల నుంచి రూ.60 చొప్పున ఫీజు తీసుకొని కాలుష్య పరీక్షలు జరిపి నిర్ధారణ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కానీ ఎలాంటి తనిఖీలు జరపకుండానే రూ.100 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు.


