టోల్‌ గేట్‌ దాటితే చాలు.. రూ.10 వేలు జరిమానా! | NHAI New Toll System Uninsured Vehicles Fine Rs 10000 | Sakshi
Sakshi News home page

టోల్‌ గేట్‌ దాటితే చాలు.. రూ.10 వేలు జరిమానా!

Nov 18 2026 5:58 PM | Updated on Nov 18 2026 6:06 PM

NHAI New Toll System Uninsured Vehicles Fine Rs 10000

ఇన్సూరెన్స్‌ లేని వాహనదారులకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) షాక్‌ ఇవ్వబోతోంది. చెల్లుబాటు అయ్యే థర్డ్‌ పార్టీ బీమా లేకుండా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు కొత్త వ్యవస్థను పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల బీమా వివరాలను తనిఖీ చేసి, పాలసీ గడువు ముగిసిన వాహనాల యజమానులకు SMS ద్వారా సమాచారం అందించనుంది.

ఢిల్లీలో పైలట్‌ ప్రాజెక్ట్‌

ప్రస్తుతం ఢిల్లీలోని అర్బన్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌-II (UER-II)పై ఉన్న ముండ్కా టోల్‌ ప్లాజా వద్ద ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. వాహనం టోల్‌ గేట్‌ దాటగానే దాని రిజిస్ట్రేషన్‌ వివరాలను వాహన్‌ డేటాబేస్‌తో అనుసంధానించి బీమా చెల్లుబాటును తనిఖీ చేస్తారు. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (NIC) నిర్వహించే ఈ డేటాబేస్‌లో బీమా వివరాలను పరిశీలిస్తారు.

ఒకవేళ వాహనానికి బీమా గడువు ముగిసినా లేదా చెల్లుబాటు అయ్యే పాలసీ లేకపోయినా కొన్ని నిమిషాల్లోనే యజమానికి SMS వస్తుంది. ఇందులో వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌, టోల్‌ ప్లాజా దాటిన తేదీ, సమయం, బీమా గడువు ముగిసిన వివరాలు ఉంటాయి. వెంటనే పాలసీని పునరుద్ధరించుకోవాలని సూచిస్తారు.

జరిమానా ఎంతంటే..

మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రజా రహదారులపై తిరిగే ప్రతి వాహనానికి థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పుడు ఇతరులకు కలిగే గాయాలు, మరణం, ఆస్తి నష్టానికి సంబంధించిన క్లెయిమ్‌లకు ఈ బీమా రక్షణ కల్పిస్తుంది.

చెల్లుబాటు అయ్యే బీమా లేకుండా వాహనం నడిపితే మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 196 ప్రకారం జరిమానా విధిస్తారు. 2026 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన సవరణ ప్రకారం.. మొదటిసారి పట్టుబడితే వాహనం బేస్‌ ప్రీమియంపై మూడు రెట్లు లేదా రూ.5,000.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అంత జరిమానా చెల్లించాలి. రెండోసారి లేదా ఆ తర్వాత పట్టుబడితే బేస్‌ ప్రీమియంపై ఐదు రెట్లు లేదా రూ.10,000.. ఏది ఎక్కువైతే అంత జరిమానా విధిస్తారు.

దేశవ్యాప్తంగా అమలవుతుందా?

ప్రస్తుతం ఈ వ్యవస్థ ముండ్కా టోల్‌ ప్లాజాకే పరిమితమైంది. పైలట్‌ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత ఇతర ప్రాంతాలకూ విస్తరించే అంశాన్ని ఎన్‌హెచ్‌ఏఐ పరిశీలించనుంది. దేశవ్యాప్తంగా అమలు చేసే తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి వాహనదారులు తమ బీమా గడువును ముందుగానే తనిఖీ చేసుకుని, అవసరమైతే పునరుద్ధరించుకోవడం మంచిది.

ఇదీ చదవండి: UPI యూజర్లకు అలర్ట్‌.. కాసేపు లావాదేవీల నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement