నాలుగు ప్యాకేజీలను తాజాగా రెండుగా మార్చిన కేంద్రం
నేటితో ముగియనున్న టెండర్ గడువు
రూ.30,491 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డు
ప్రాజెక్టులో రోడ్లు, సివిల్ పనులకే రూ.11,537.70 కోట్ల వ్యయం
భూసేకరణకు రూ.5,315 కోట్లు
సుమారు 7,400 ఎకరాల సేకరణ
ఐదు జిల్లాలు.. 97 గ్రామాల్లో భూముల సేకరణ
సాక్షి, అమరావతి: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణ టెండర్ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటి వరకు ప్రతిపాదన దశలోనే ఉన్న ఓఆర్‌ఆర్‌కు ఈ ఏడాది అక్టోబర్ 2న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్ పిలిచింది. 195.13 కి.మీ పొడవైన రహదారి, ఇతర సివిల్ వర్క్స్‌ను రూ.11,537.70 కోట్లతో నాలుగు ప్యాకేజీలుగా చేపట్టాలని భావించింది.
అయితే తాజాగా ఈ నాలుగు ప్యాకేజీలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటిని రెండు ప్యాకేజీలుగా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. కంచికచర్ల నుంచి కంకిపాడు వరకు సుమారు 86 కిలోమీటర్ల మేర ఒక ప్యాకేజీగా... కృష్ణానదిపై రెండు భారీ వంతెనలు కలుపుకొని మిగిలిన 109.13 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని మరొక ప్యాకేజీగా విభజించారు. ఇక గతంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్)లో ప్రభుత్వ పబ్లిక్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతి ద్వారా టెండర్లు పిలవగా తాజాగా దాన్ని రద్దు చేసి నిర్మాణం–నిర్వహణ–బదలాయింపు (బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్–బీఓటీ) పద్ధతికి మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) నిర్ణయం తీసుకుంది.
ఔటర్‌ను నిర్మించే కాంట్రాక్ట్ సంస్థ 15 నుంచి 20 ఏళ్ల పాటు టోల్ వసూలు చేసుకుని ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించాలి. కాగా, ఇప్పటికే నాలుగు ప్యాకేజీలతో ఓఆర్‌ఆర్ నిర్మాణానికి పిలిచిన టెండర్ గడువు బుధవారం (ఈ నెల 18) ఉదయం 11 గంటలతో ముగియనుంది. ఓఆర్‌ఆర్ నిర్మాణంలో కీలక మార్పులు చేస్తూ కేంద్ర సంస్థలు తీసుకున్న తాజా నిర్ణయాలతో టెండర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో టెండర్ గడువు పొడిగించడమా? లేక తాజాగా చేసిన మార్పులతో టెండర్ ప్రక్రియను సవరించి మళ్లీ పిలవడమా? అనేది ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకోనుంది.
రూ.30,491కోట్ల ‘రింగ్’..
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మొత్తానికి రూ.30,491 కోట్లు వ్యయం కానుందని అంచనాలు సిద్ధం చేశారు. దీనిలో రోడ్డు తదితర సివిల్ పనులకు రూ.11,537.70 కోట్లతో ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఓఆర్‌ఆర్ ప్రధాన మార్గం 189.93 కిలోమీటర్లు కాగా గుంటూరు శివారు నారాకోడూరు నుంచి బుడంపాడు వరకు నిర్మించే 5.2 కిలోమీటర్ల స్పర్ రోడ్డుతో కలిపి మొత్తం పొడవు 195.13 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
ఇక ఐదు జిల్లాల పరిధిలోని 97 గ్రామాల్లో భూ సేకరణ పెను సవాల్. సుమారు 7,400 ఎకరాల భూసేకరణకు రూ.5,315 కోట్లు ప్రతిపాదించారు. రాజధాని చుట్టూ ఆరు వరుసల రోడ్డుతో జాతీయ, రాష్ట్ర రహదారులను కలుపుతూ నిర్మించాలని ప్రతిపాదించారు. ఓఆర్‌ఆర్ భవిష్యత్‌లో 8–లేన్లగా విస్తరించాలంటే సొరంగాల విస్తరణ ఇబ్బందికరమేననే వాదన వినిపిస్తోంది. రింగ్ రోడ్డు మార్గంలో పలు జాతీయ రహదారులు క్రాస్ అవుతుండగా కీలక ప్రాంతాల వద్ద మొత్తం 17 ఇంటర్ ఛేంజ్‌ల (ప్రధానంగా డబుల్ ట్రంపెట్, రోటరీలు) ప్రతిపాదనపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి.
పెండింగ్‌లో సీసీఈఏ అనుమతి
2015లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది టెండర్ల దశకు వచ్చినప్పటికీ కాంట్రాక్ట్ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మార్పులు సవరణలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు పీపీపీఏసీ సవరణలతో ప్రాథమికంగా అనుమతి తెలిపినప్పటికీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) తదితర అత్యున్నత స్థాయి అనుమతుల ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఇలాంటి భారీ జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో ప్రక్రియను వేగవంతం చేయడానికి అనుమతులు వచ్చే లోపు ముందస్తుగా టెండర్లు ఆహ్వానించడం ఎన్‌హెచ్‌ఏఐ అనుసరించే పద్ధతుల్లో ఒకటని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: జనసేన ‘కోట’ రహస్యం!!.. రూ.7 కోట్ల గూడుపు‘ఠాణా’!


