సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
అసెంబ్లీకి ఒక లెక్క.. ప్రజలకు మరో లెక్క.. కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా?.. వాటిలో ఏది నిజం బాబూ?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
సవరించిన బడ్జెట్ అంచనాలే మీ అబద్ధాలను స్పష్టం చేస్తున్నాయ్
అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసగించడంలో మీ సుపుత్రుడు లోకేశ్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
నాడు ఎన్నికల కోడ్‌తో 2023–24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి...
మరి 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
నాడు మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లను విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది
మీరు బకాయిలు పెట్టిన సంగతి.. మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
వసతి దీవెన పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు
వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్లం
పిల్లల భవిష్యత్తు పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజులు,వసతి దీవెన కాయిలు రూ. 9,600 కోట్లు చెల్లించండి
సాక్షి,అమరావతి: వెన్నుపోటు పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారని.. ఫీజులపై సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలకు ఏమాత్రం పొంతన లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న దుస్థితికి సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు? అని సూటిగా నిలదీశారు. ‘మీరు ఇచ్చిన లెక్కలతోనే.. మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.

2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో, మీరు బకాయి పెట్టిన సుమారు రూ.2,000 కోట్లను విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి, మీరే మీ మాటల్లో ఒప్పుకున్నమాట నిజం కాదా? ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడటం లేదు. వైఎస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు వసతి దీవెన కింద మేం ఇచ్చేవాళ్లం..’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
చదువుకుంటున్న పిల్లల భవిష్యత్తు పట్ల మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన కింద బాకీ పడిన రూ.9,600 కోట్లను తక్షణమే చెల్లించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను ట్యాగ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..

ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు..?
నారా చంద్రబాబునాయుడు గారూ..! అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ మీ రికార్డులను సైతం బ్రేక్ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు ఒకదానితో మరొకటి పొంతన ఉందా? ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?

అసెంబ్లీకి ఒక లెక్క.. ప్రజలకు మరో లెక్క.. కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా..?
2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద 2024 – 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024–25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క.. ప్రజలకు మరో లెక్క.. కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం?
సవరించిన బడ్జెట్ అంచనాలే మీ అబద్ధాలను స్పష్టం చేస్తున్నాయ్
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు? 2025–26 ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు. కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాల కంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి! అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు. మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే.. మీరు చెబుతున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
విద్యార్థుల సంఖ్య ఖరారు కాకముందే చెల్లింపులు ఎలా చేశారు..?
2026–27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు.. అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు. ఇంకా మూడో త్రైమాసికం పూర్తికాలేదు. డిసెంబర్ నెల కూడా రాలేదు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు? ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబి్ధదారులను ఎలా నిర్ధారించారు? వారికి చెల్లింపులు ఎలా చేశారు?
ఎన్నికల కోడ్‌తో 2023–24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి ...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023–24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి. 4వ త్రైమాసికానికి.. అంటే జనవరి – మార్చి వరకు చెల్లింపులు జరగాల్సిన సమయంలో.. ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేసేవాళ్లం.
మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మరి 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో, మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లను విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా? 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసన మండలికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం.. 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అదీ ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
వసతి దీవెన పేరెందుకు ఎత్తడం లేదు..?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడటం లేదు. గతంలో క్రమం తప్పకుండా వైఎస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం. మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు.. 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు.. 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీని గురించే మాట్లాడటం లేదు.
ఎందుకు? పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి? గతంలో మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతి దీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు?
ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.. ఇచ్చింది కేవలం రూ.2,800 కోట్లే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు.. ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024–25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి).. 2025–26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు.. 2026–27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు... మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతి దీవెన కింద ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు పథకాలకు కలిపి విద్యాదీవెన + వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు... మొత్తం రూ.12,400 కోట్లు అవసరం. కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్టు ప్రకారం సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు. ఈ లెక్కల ప్రకారం.. విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు.. ఇచ్చింది కేవలం రూ.2,800 కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు. చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.


