(2025, జూలై 21న సాక్షి కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యం)
సాక్షి, విజయవాడ: విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి తెలుగు దినపత్రిక కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సాక్షి దినపత్రిక బ్రాంచి మేనేజర్ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను పటమట పోలీసులకు అప్పగిస్తూ విజయవాడ నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
2025 జూలై 21న సాక్షి కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి బ్రాంచి మేనేజర్ రామిశెట్టి యశోద రాజు నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు గద్దె అనురాధ, గద్దె క్రాంతి, రేపాకుల శ్రీనివాస్, ఎండీ ఫతావుల్లా, మల్పూరి సాయికళ్యాణి, చెన్నుపాటి గాంధీ, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మినేని ప్రసాద్, పొట్లూరి సాయిబాబుతో పాటు మరికొందరిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 210, 223 కింద ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన విజయవాడ నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్.. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 175(3) ప్రకారం దర్యాప్తు చేపట్టాలని పటమట పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు. సంబంధిత అంశాలపై విచారణ జరిపి త్వరితగతిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గూండాగిరి..


