బాబు అప్పుల చిట్టా రూ.4,00,613 కోట్లు | Chandrababu Creates Record in AP Debt: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాబు అప్పుల చిట్టా రూ.4,00,613 కోట్లు

Nov 18 2026 5:47 AM | Updated on Nov 18 2026 5:47 AM

Chandrababu Creates Record in AP Debt: Andhra Pradesh

అప్పుల్లో ఎప్పటికప్పుడు ఆల్‌టైమ్‌ రికార్డు  

నెలకు రూ.13,815 కోట్లు.. రోజుకు రూ.460.47 కోట్లు చొప్పున అప్పు

అప్పుల్లో ఎప్పటికప్పుడు ఆల్‌టైమ్‌ రికార్డు  

ఏడాదిలో 357 రోజులు చేబదుళ్లే దిక్కు 

సంక్షేమం, అభివృద్ధి అధపాతాళంలో.. 

మోసాలుగా సూపర్‌ సిక్స్‌లు.. ఉన్న సంపదే ఆవిరి  

రాష్ట్ర అప్పులను ఏకంగా రూ.11.22 లక్షల కోట్లకు చేర్చిన బాబు సర్కార్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో నిలబెట్టిన సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్దిలో అగాథంలోకి తోసేశారు. అప్పులు తేవడంలో చంద్రబాబు సర్కార్‌ తన రికార్డును తానే తిరగ రాస్తోంది. తాజాగా మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.1,000 కోట్లు బడ్జెట్‌ అప్పులు చేసింది. దీంతో బడ్జెట్‌ లోపల, బయట 29 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా రూ.4,00,613 కోట్లకు చేరాయి.

తద్వారా రాష్ట్ర అప్పులను ఏకంగా రూ.11.22 లక్షల కోట్లకు పెంచేశారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలో ఉండగా రూ.2.49 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు 29 నెలల్లోనే ఏకంగా రూ.4 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. బడ్జెట్‌ లోపల, బయట అనే తేడాలు లేకుండా ఎడాపెడా అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. అప్పు చేయనిదే పూట గడవడం లేదు.

రోజువారీ పాలనకు దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నారు. ఖజానా ఆదాయంతో పాటు ప్రభుత్వ ఆస్తులను సైతం తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు ఏడాదిలో 357 రోజులు చేబదుళ్ల అప్పులతోనే పాలన సాగిస్తున్నట్లు కాగ్‌ ఆక్షేపించినా ఖాతరు చేయడం లేదు. ఇలా అయితే ఏపీ భవిష్యత్తు అంధకారమేనని కాగ్‌ హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం చలించడం లేదు. సంపద సృష్టించడం, వనరులు పెంచడం దేవుడెరుగు అప్పులు చేయడంలో మాత్రం సూపర్‌ విజన్‌తో చంద్రబాబు పాలన సాగిస్తున్నారు.  

రోజుకు సగటున రూ.460.47 కోట్లు 
పాలన సాగించడానికి చంద్రబాబు ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడుతోంది. 29 నెలల్లో నెలకు సగటున రూ.13,815 కోట్ల చొప్పున అప్పులు చేసింది. రోజుకు సగటున రూ.460.47 కోట్లు అప్పు చేస్తోంది. ఇప్పటివరకు బడ్జెట్‌ లోపల చేసిన  అప్పులే రూ.2,30,537 కోట్లకు చేరాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీ జీవోలతో చేసిన అప్పులు రూ.1,22,389 కోట్లకు ఎగబాకాయి. రాజధాని అమరావతి పేరుతో చేసిన అప్పులు రూ.47,687 కోట్లకు చేరుకున్నాయి.

ఖజానా తాకట్టు పెట్టేసి అప్పులు 
తాకట్టు పెట్టెయ్‌.. అప్పులు తెచ్చేయ్‌! అన్నట్లుగా ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆస్తులను, ఆదాయాన్ని తాకట్టు పెట్టేసి చంద్రబాబు సర్కార్‌ చేయి చాస్తోంది. మద్యం ఆదాయాన్ని, గనులు ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఇప్పటికే రూ.5,900 కోట్లు అప్పులు చేయగా ఈ ఏడాది జనవరిలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మరో రూ.11,700 కోట్లు మద్యం ఆదాయం ద్వారా అప్పు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

మరోపక్క గనుల ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.10,021 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ఇంకోవైపు పట్టణ స్ధానిక సంస్ధల ఆస్తులను కూడా ప్రైవేట్‌ కంపెనీలకు తాకట్టు పెట్టేస్తున్నారు. రాష్ట్ర ఖజానానే తాకట్టు పెట్టేసి ఏపీ బ్రాండ్‌ను తాకట్టులోకి నెట్టేశారు. చేసిన అప్పులన్నీ ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుండటంతో ఆస్తులు తరిగిపోయి అప్పులు పెరిగిపోతున్నాయి. కొత్తగా కార్పొరేషన్లను, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ను నెలకొల్పి మరీ అప్పులు చేస్తున్నారు.

సంపద సృష్టి లేదు.. ఉన్నదే ఆవిరి 
వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసే అప్పులకు చంద్రబాబు సర్కార్‌ గ్యారెంటీలు ఇస్తూ ఏకంగా జీవోలను జారీ చేస్తోంది. ఇన్ని అప్పులు చేసినా కనీసం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలనైనా అమలు చేయడం లేదు. సూపర్‌ సిక్స్‌లు, సెవెన్లు ఉత్త మోసాలుగా మిగిలాయి. ఇక కొత్తగా సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులనే తెగనమ్ముతోంది.  వైఎస్సార్‌ సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో  చేపట్టిన కొత్త మెడికల్‌ కాలేజీలను పప్పు బెల్లాలకు ప్రైవేట్‌ పరం చేస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన పోర్టులను, ఫిషింగ్‌ హార్బర్లను సైతం ప్రైవేట్‌కు అప్పగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement