ప్రభుత్వ ఉద్యోగాల పేరిట భారీ కుంభకోణం!
జనసేన కేంద్ర కార్యాలయంలో కీలక వ్యక్తులకు లింకులు
గుట్టురట్టవుతుందన్న భయంతో ఠాణా మెట్లెక్కిన జనసేన ముఖ్యులు?
ఐదో తేదీన మోసం బయటకు వస్తే 11న పోలీసు కేసు నమోదు
దళిత మహిళను బలి పశువును చేసే దిశగా కుట్రలకు పదును
పోలీసులపై ఒత్తిడి తెచ్చి స్టేషన్‌లోనే అక్రమ నిర్బంధం.. థర్డ్ డిగ్రీ
హైకోర్టులో బాధితురాలి తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్‌తో విడుదల
రూ.ఏడు కోట్లే కాదు.. భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడి ఉండొచ్చని ఆరోపణలు
మనీలాండరింగ్ వ్యవహారాలూ దాగి ఉండొచ్చని సందేహాలు
మోసపోయిన బాధితులు తెరపైకి రాకుండానే మొదలైన కేసు
కేసుపై జనసేనలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ
సాక్షి, అమరావతి: కైరన్ సంస్థ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్లు వసూలు చేసిన కుంభకోణం వెనుక అధికార కూటమిలో ఉన్న కొన్ని పెద్ద తలకాయలే ఉండొచ్చన్న అనుమానాలు పెరుగుతున్నాయి. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక స్థానంలో పనిచేసే కోట రుక్మిణి, కల్యాణం శివ శ్రీనివాసరావు(కేకే) ఫిర్యాదులతోనే మొదలైన ఈ కేసు అంతా ‘గూడుపుఠాణి’లా సాగుతోంది.
డబ్బులిచ్చి మోసపోయిన బాధితులు కనీసం బయటకు రాకముందే కైరన్ సంస్థ డైరెక్టర్ హోదాలో కోట రుక్మిణి మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ప్రమేయం బయట పడిపోతుందన్న భయంతోనే తన వద్ద ఉద్యోగిగా పనిచేసే దళిత మహిళ బోడపాటి ధరణి కృష్ణను బలిపశువు చేసేందుకే కోట రుక్మిణి ఈ ఫిర్యాదు చేసి ఉంటారన్న చర్చ సాగుతోంది.
రుక్మిణీ ఫిర్యాదుకు అరగంట ముందే జనసేన పార్టీలో మొదట నుంచి కీలక నేతగా వ్యవహరిస్తూ, ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కల్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) అదే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ కేసులో ధరణి కృష్ణను బలి చేసేందుకు చూస్తున్నారని ఆమె తల్లి నాగమణి హైకోర్టులో పిటిషన్ వేయడం కుట్ర కోణం ఉందన్న అంశానికి బలం చేకూరుస్తోంది.
మరోవైపు ఐదో తేదీన మోసం బట్టబయలైతే 11వ తేదీన కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఇప్పటి వరకు మోసపోయిన బాధితులను విచారణచేయకపోవడం, బాధితులెవరూ బయటకు రాకపోవడం వంటి పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయి. పెద్ద మనుషుల ప్రమేయం లేకుంటే డబ్బులిచ్చిన బాధితులు బయటకు రాకుండా ఉండరనే వాదన వినిపిస్తోంది. కైరన్ సంస్థ కార్యకలాపాలు మొత్తం జనసేన కార్యాలయం నుంచే సాగుతాయని ధరణి కృష్ణ ఇప్పటికే మీడియాకు చెప్పడంతో ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు గుట్టు బయటకు రావాల్సి ఉందన్న చర్చ సాగుతోంది.
సూత్రధారులెవరు? పాత్రధారులెవరో?
కైరన్ సంస్థ డైరెక్టర్ కోట రుక్మిణి తనకు తెలియకుండా తన సంస్థలో హెచ్‌ఆర్ అండ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ధరణి కృష్ణ సంస్థ పేరును వాడుకొని అక్రమాలకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. జనసేన నేత కేకే కూడా ఆమెపైనే ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లలోనూ ఏ–1గా ధరణి కృష్ణ పేరునే పేర్కొనడం గమనార్హం. ఈ ఫిర్యాదులతో నవంబర్ 13వ తేదీ ఉదయం 10:30 గంటలకు ధరణి కృష్ణను అదుపులోకి తీసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు.. అక్రమంగా నిర్బంధించారని, ఆచూకీ తెలపాలని «ఆమె తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత 15న విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది.
పోలీసులు ఈ కేసుకు సంబంధం లేనివారిని ఇరికించడానికి చూస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కొందరు కూటమి సర్కారు పెద్దల సూచనల మేరకు పోలీసులు ధరణి కృష్ణ, మరొకరిద్దరు చిన్న వాళ్ల చుట్టూత కేసును పరిమితం చేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
తనపై థర్డ్ డిగ్రీ జరిగిందని, ప్రైవేట్ పార్ట్స్‌పైనా కొట్టారని ధరణి కృష్ణ పోలీసులపై తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ పెద్దల ప్రమేయం ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. అందుకే హెబియస్ కార్పస్ పిటిషన్ తర్వాత ధరణి కృష్ణను కోర్టులో హాజరుపరిస్తే న్యాయస్థానం ముందు దోషిగా నిలబడాల్సి వస్తోందనే పోలీసులు ఆమెను మంగళగిరి ఎయిమ్స్ దగ్గర చిట్టడవి వద్ద వదిలిపెట్టినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కైరన్ సంస్థపై అనుమానాలెన్నో..!
కేసులో నిందితురాలిగా ఉన్న ధరణికృష్ణ దళిత మహిళ. ఆమె కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధరణికృష్ణది అతి సాధారణ కుటుంబం. ఆమె వయస్సు మూడేళ్లప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి ఇడ్లీ బండి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించారు. ధరణి కృష్ణ కొద్దినెలల క్రితమే కైరన్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఇలాంటి సాధారణ కుటుంబానికి చెందిన ధరణి కృష్ణ ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటే, నిరుద్యోగ యువత నమ్మి కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? అన్న చర్చ సాగుతోంది.
28 ఏప్రిల్ 2023న లండన్‌లో ’కైరన్ టెక్ లిమిటెడ్’ను రిజిస్టర్ చేసిన కోట రుక్మిణి అక్టోబర్ 10, 2024న దానిని క్లోజ్ చేసి, తర్వాత వారం రోజుల్లోనే మంగళగిరిలో అదే పేరుతో మరో కన్సల్టెన్సీని ప్రారంభించడం.. కేవలం 10 నెలల్లోనే రూ.10 కోట్ల రెవెన్యూగా ప్రకటించడం.. లండన్‌లో మూసివేసిన కైరన్ సంస్థను మళ్లీ ప్రారంభించడానికి తిరిగి నవంబర్ 12, 2024న బ్రిటిష్ ప్రభుత్వానికి రిస్టోరేషన్ అప్లికేషన్ పెట్టుకోవడం వంటి పరిణామాలపై అనుమానాలెన్నో తలెత్తుతున్నాయి.
పార్టీలో ఆధిపత్య పోరుతోనే కుంభకోణం వెలుగులోకి..?
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్ష కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతల్లో కొనసాగుతున్న కోట రుక్మిణి వ్యవహర శైలి నచ్చని మరో వర్గం ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిందని సమాచారం. అందువల్లే కోట రుక్మిణి ముందు జాగ్రత్తగా తనంతటతాను ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ధరణి కృష్ణ తరఫున బంధువులు, లాయర్లు కూడా ఇదే విషయం చెబుతున్నారు.
ఈ వ్యవహారంలో తాము అండగా ఉంటామని ముందు ధరణి కృష్ణను నమ్మబలికి, ఆమే ఈ డబ్బులు వసూలు చేసినట్టు ఒప్పుకుంటున్నట్టు రాతపూర్వకంగా రాయించి.. వీడియో చిత్రీకరించి ఆనక కోట రుక్మిణి ప్లేటు ఫిరాయించారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కుంభకోణం రూ.ఏడుకోట్లకే పరిమితమా? లేక అంతకుమించి వసూళ్లు జరిగి ఉండొచ్చన్న అనుమానాలూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కోణమూ దాగి ఉండొచ్చన్న వాదనా వినిపిస్తోంది.


