సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరిలో ఘోర ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్‌తో సహా 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. పల్టీలు కొట్టింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణలో..
మరో ఘటనలో టైర్ పేలడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన అలంపూర్ చౌరస్తాలోని ఫ్‌లైఓవర్‌పై శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీఆర్‌ఎల్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అలంపూర్ చౌరస్తాకు రాగానే బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.
అనంతరం బస్సు హైదరబాదు నుంచి కర్నూల్ మార్గంలోకి దూసుకొచ్చి ఆగిపోయింది. ఫ్‌లైఓవర్ సైడ్ వాల్స్‌కు సమీపంలోనే ఆగిపోయి ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటికి వచ్చారు. అయితే ఈ ప్రమాదంతో ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మిదేవి అనే ఒక ప్రయాణికురాలు ఛాతిలో నొప్పితో ఇబ్బంది పడగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒస్సు ఒక మార్గం నుంచి వేరే మార్గంలోకి వెళ్లి నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతో రాకపోకలు కొనసాగాయి.
ఇదీ చదవండి: టికెట్ లేనివారికి షాక్.. రైల్వేకు జరిమానాల జాక్‌పాట్!


