సచివాలయ భవనాలకు అద్దాలు అమర్చే పనుల్లో బాబు సర్కార్ మరో స్కామ్!
అంచనా వ్యయం తాజాగా రూ.4,830 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు
గతంలో రూ.2,540 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు
కేవలం ఐదు నెలల్లోనే అంచనా వ్యయం ఏకంగా రూ.2,290 కోట్లు పెంచేసిన వైనం
జీఏడీ టవర్ అద్దాలకు రూ.1,094.60 కోట్లు.. 1, 2 టవర్లకు రూ.1,945.20 కోట్లు.. 3, 4 టవర్లకు రూ.1,790.20 కోట్లు
అద్దాలు బిగించే పనులకు గతంలో జీఎస్టీతో కలిపి చదరపు మీటరుకు రూ.80,892 చొప్పున ఖరారు
ఈ లెక్కన ఐదు టవర్లకు 2,35,092.75 మీటర్ల మేర అద్దాలు బిగించే పనుల వ్యయం రూ.1901.71 కోట్లే
కానీ.. జీఎస్టీతో కలిపి రూ.2455.22 కోట్ల అంచనాతో మూడు సార్లు టెండర్లు పిలిచిన ఏజీఐసీఎల్
అప్పటి ధరల ప్రకారమే అద్దాల మాటున రూ.553.51 కోట్ల దోపిడీకి ముఖ్యనేత స్కెచ్
మూడు సార్లు పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనకపోవడంతో వాటిని రద్దు చేసిన ఏజీఐసీఎల్
మే 1 నాటితో పోల్చితే అల్యూమినియం ధరలు.. లేబర్ ఛార్జీలు.. రవాణా ఖర్చులు పెరిగాయంటూ అద్దాల పనుల అంచనా వ్యయం పెంచేసిన వైనం
తాజా ధరల ప్రకారం అద్దాలు బిగించే పనులకు జీఎస్టీతో కలిపి చ.మీటరుకు ఏకంగా రూ.2,05450.82 వ్యయం
సిండి‘కేటు’ సంస్థలతో కలిసి భారీ దోపిడీకి ముఖ్యనేత స్కెచ్ వేశారంటున్న ఇంజనీరింగ్ నిపుణులు
మొత్తమ్మీద సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం ఇప్పటికే రూ.13,294.87 కోట్లకు చేరిన వైనం
ఈ లెక్కన చదరపు అడుగుకు ఏకంగా రూ.25,466.68 చొప్పున వ్యయం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్లకు అద్దాలు అమర్చే పనుల అంచనా వ్యయాన్ని చంద్రబాబు సర్కార్ తాజాగా ఏకంగా రూ.4,830 కోట్లకు పెంచేసింది. గతంలో సచివాలయం ఐదు టవర్లకు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ల (బీఎంయూ) ఏర్పాటు పనులు చేపట్టేందుకు రూ.2,540 కోట్లతో అనుమతి ఇస్తూ మే 1న ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ.. అల్యూమినియం ధరలు, లేబర్, ఇన్‌స్టలేషన్ ఛార్జీలు, రవాణా ఖర్చులు పెరిగాయని.. 6 మీటర్ల పొడవైన స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యానళ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని సాకులు చెబుతూ అంచనా వ్యయాన్ని రూ.4,830 కోట్లకు పెంచేందుకు అనుమతించాలంటూ సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) చేసిన ప్రతిపాదనకు అక్టోబర్ 28న జరిగిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని అథారిటీ ఆమోద ముద్ర వేసింది.
దాంతో ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.2,540 కోట్ల నుంచి రూ.4,830 కోట్లకు పెంచేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నాటితో పోల్చితే అల్యూమినియం ధరలు, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చుల్లో ఎలాంటి మార్పు లేదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. దీన్ని బట్టి సచివాలయానికి అద్దాలు అమర్చే పనుల మాటున సిండికేట్ సంస్థలతో కలిసి ముఖ్యనేత భారీ దోపిడీకి స్కెచ్ వేశారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
చ.మీటరుకు రూ.80,892 చొప్పున ఎస్‌ఎస్‌ఆర్ ఖరారు..
శాశ్వత సచివాలయం ఐదు టవర్లను డయాగ్రిడ్ విధానంలో నిర్మిస్తున్నారు. టవర్లకు నలువైపులా అద్దాలు అమర్చుతారు. అందులో భాగంగా టవర్లకు గ్లాసింగ్, క్లాడింగ్ (అత్యధిక ఉష్ణోగ్రత, శబ్ద కాలుష్యాన్ని తట్టుకునే డబుల్–గ్లేజ్డ్ అద్దాలను అమర్చడం).. క్రౌన్, ఆట్రియం (భవనాల పైభాగంలో ఉండే శిఖరం నిర్మాణం, విశాలమైన గ్లాస్–రూఫ్ సెంట్రల్ అట్రియమ్).. కానోపి, స్కైలైట్ (ప్రధాన ప్రవేశ ద్వారాల వద్ద టెన్షన్–రాడ్ స్టీల్ కానోపిలు, సహజ వెలుతురు కోసం స్కైలైట్లు).. పీవీ ప్యానెల్స్(భవనం వెలుపల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పర్యావరణ అనుకూల ఐజీబీసీ ప్లాటినమ్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల ప్యానెళ్లు), బీఎమ్‌యూ(ఎత్తైన టవర్ల గ్లాస్‌ను శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి ఉపయోగించే ఆటోమేటెడ్, రూఫ్–మౌంటెడ్ టెలిస్కోపిక్ క్రేన్ సిస్టమ్స్ ఏర్పాటు) పనులు చేయాలి.
ఈ పనులకు అంచనా వ్యయం రూపొందించడానికి ఇప్పటిదాకా ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు)ను ప్రభుత్వం ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఆర్ ఖరారు చేయడంలో భాగంగా అనుభవం ఉన్న సంస్థల నుంచి సీఆర్‌డీఏ కొటేషన్‌లు ఆహ్వానించింది. ముంబైకి చెందిన ఆల్మెక్ ఫెసాడ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన టీమ్ వర్క్ గ్లాస్ అండ్ అల్యూమినియమ్, బెంగళూరుకు చెందిన ఇంటెర్ని ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సీఆర్‌డీఏకు కొటేషన్‌లు ఇచ్చాయి. అందులో ఆల్మెక్ ఫెసాడ్ సంస్థ తక్కువ ధరకు కోట్ చేసినట్లు సీఆర్‌డీఏ పేర్కొంది.
శాశ్వత సచివాలయం ఐదు టవర్లకు డిజైన్‌లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థే.. చైనా షెన్‌జెన్‌లోని మర్చంట్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ భవనాలను డిజైన్ చేసింది. ఆ భవనాలకు అద్దాలు అమర్చడానికి చేసిన వ్యయాన్ని.. ఆల్మెక్ ఫెసాడ్ కొటేషన్‌లో పేర్కొన్న ధరను పరిగణలోకి తీసుకుని గ్లాసింగ్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కానోపి, స్కైలైట్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ లాంటి పనులకు జీఎస్టీతో కలిపి చదరపు మీటరుకు సగటున రూ.80,892 చొప్పున మే 19న జరిగిన సమావేశంలో బీవోసీఈ (బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజినీర్స్) ఖరారు చేసింది.
అప్పట్లోనే రూ.553.51 కోట్ల దోపిడీకి స్కెచ్..
డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న సచివాలయం నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న జీఏడీ టవర్‌కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ల (బీఎంయూ) ఏర్పాటు పనులకు ఏజీఐసీఎల్ ద్వారా మూడు ప్యాకేజీల కింద ఆగస్టు 4 నుంచి 26 తేదీల మధ్య మొదటి సారి టెండర్లు పిలిచారు. జీఏడీ టవర్‌కు రూ.522.15 కోట్లు (అంచనా వ్యయం రూ.442.06 కోట్లు + రూ.80.09 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 1, 2 టవర్లకు రూ.1,073.82 కోట్లు (అంచనా వ్యయం రూ.909.88 కోట్లు + రూ.163.94 కోట్లు జీఎస్టీ రీయింబర్స్).. 3, 4 టవర్లకు రూ.859.25 కోట్లు (అంచనా వ్యయం రూ.727.45 కోట్లు + రూ.131.79 కోట్లు జీఎస్టీ రీయింబర్స్) వెరసి రూ.2,455.22 కోట్లను కాంట్రాక్టు వ్యయంగా నిర్ణయించారు.
ఐదు టవర్లకు 2,35,092.75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అద్దాలు బిగించాలి. ఈ లెక్కన వాటి అంచనా వ్యయం రూ.1,901.71 కోట్లే. కానీ.. ఆ పనులకు రూ.2,455.22 కోట్ల వ్యయంతో మూడు ప్యాకేజీలు కింద ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు పిలిచింది. అంటే కేవలం అంచనాలు పెంచడం ద్వారానే కాంట్రాక్టర్‌కు ఏకంగా రూ.553.51 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చడానికి రంగం సిద్దం చేశారని అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపించారు. టెండర్లలో బిడ్‌లు దాఖలు చేసేందుకు ఏజీఐసీఎల్ పెట్టిన నిబంధనలు చూసి ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు. జాయింట్ వెంచర్లు (ఒకటి కంటే ఎక్కువ సంస్థలు కలిపి జట్టుగా ఏర్పడటం) బిడ్‌లు దాఖలు చేయడానికి అర్హత లేదని నిబంధన విధించారు.
కానీ.. టెండర్‌లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజనీర్ అనుమతితో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్‌కు ఇచ్చుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. పరస్పర విరుద్ధమైన ఈ నిబంధనలను పెట్టడం వెనుక లోగుట్టు ముఖ్యనేతకే ఎరుక! సీఆర్‌డీఏ కొటేషన్లు ఆహ్వానించిన సంస్థల్లో ఎవరు ఎక్కువ కమీషన్ ఇస్తే వారికి పనులు అప్పగించడానికే ఇలాంటి విచిత్రమైన నిబంధనలు పెట్టారంటూ ఇంజనీరింగ్ నిపుణులు ఆరోపించారు. జాయింట్ వెంచర్‌లకు టెండర్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తే అనుభవం ఉన్న రెండు మూడు సంస్థలు కలిసి బిడ్‌లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఎక్కువ సంస్థలు పోటీ పడితే అంచనా విలువ కంటే తక్కువ ధరకే కోట్ చేస్తూ బిడ్‌లు దాఖలు అవుతాయి.
అదే జరిగితే తమకు అధికంగా కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచి్చన సంస్థకు ఆ పనులు దక్కే అవకాశం ఉండదు. అందుకే ముఖ్యనేత సూచన మేరకు పరస్పర విరుద్ధమైన నిబంధనలు పెట్టారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కానీ.. ఆ టెండర్లలో ఎవరూ పాల్గొనకపోవడంతో వాటిని రద్దు చేశారు. మళ్లీ ఆగస్టు 31 నుంచి సెపె్టంబరు 7 మధ్య రెండో సారి.. సెప్టెంబర్ 15 నుంచి 22 మధ్య మూడో సారి టెండర్లు పిలిచారు. కానీ.. టెండర్లలో ఏ సంస్థ కూడా పాల్గొకపోవడంతో వాటిని రద్దు చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యనేత చక్రం తిప్పారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు.
భారీగా దోచేసేందుకే..
సచివాలయ టవర్లకు అద్దాలు అమర్చేందుకు వినియోగించే అల్యూమినియం ధరలతోపాటు లేబర్ ఛార్జీలు, రవాణా వ్యయం పెరిగిందని.. అవసరమైన సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని.. దీని వల్ల వ్యయం పెరుగుతుందని కాంట్రాక్టు సంస్థలు పేర్కొన్నట్లు ఏజీఐసీఎల్ అధికారులు సీఆర్‌డీఏ, ప్రభుత్వానికి నివేదించారు.
ఈ క్రమంలో పనుల అంచనా వ్యయాన్ని సవరించే ప్రతిపాదనను గత నెల 24న జరిగిన బీవోసీఈ సమావేశం ముందు సీఆర్‌డీఏ పెట్టింది. అల్యూమినియం ధర కేజీ రూ.280 నుంచి రూ.375కు పెరిగిందని.. అద్దాలు అమర్చేందుకు లేబర్ ఛార్జీలు చదరపు మీటరుకు రూ.3,500 చొప్పున ఇవ్వాల్సి వస్తుందని.. రవాణా వ్యయం కూడా పెరిగిందని.. ఆరు మీటర్ల పొడవైన స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యానళ్లు లాంటివి దేశీయంగా లభ్యం కావని, చైనా నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల వ్యయం పెరిగిందని సీఆర్‌డీఏ, ఏజీఐసీఎల్ అధికారులు పేర్కొన్నారు.
దీంతో అద్దాలు అమర్చే పనుల అంచనా వ్యయాన్ని రూ.2,540 కోట్ల నుంచి రూ.4,830 కోట్లకు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనిపై బీవోసీఈ స్పందిస్తూ.. కేవలం రేఖాచిత్రం (స్కీమాటిక్ డయాగ్రామ్)తో ఆ పనులకు తొలుత రూ.2,540 కోట్లతో పరిపాలనా అనుమతి ఎలా ఇచ్చారంటూ నిలదీసింది. డిజైన్ పూర్తి కాకుండానే అంత భారీ బడ్జెట్‌ను ఎలా ఆమోదించారని ప్రశ్నించింది.
ఈ పనుల్లో చాలా వరకు ’నాన్–షెడ్యూల్డ్ రేట్స్’ (నాన్ ఎస్‌ఎస్‌ఆర్) కింద ఉన్నాయని.. వాటికి ప్రభుత్వ ప్రామాణిక ధరలు లేవని.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరల విషయంలో భవిష్యత్తులో తీవ్రమైన ఆడిట్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని థర్డ్ పార్టీతో మదింపు చేయించాలని సూచించింది. అంచనా వ్యయాన్ని రూ.4,830 కోట్లకు పెంచేందుకు ఆమోదిస్తామని.. కానీ పూర్తి బాధ్యత సీఆర్‌డీఏ అధికారులదేనని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అంచనా వ్యయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పెంచకూడదని స్పష్టం చేసింది. భారీగా దోచేయడానికే అంచనా వ్యయాన్ని పెంచేసేలా ముఖ్యనేత చక్రం తిప్పారని ఇంజనీరింగ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
చ.అడుగు వ్యయం ఏకంగా రూ.25,466.68
శాశ్వత సచివాలయం ఐదు టవర్ల నిర్మాణ పనులను రూ.4,688.83 కోట్లతో 2024 డిసెంబరు 20న చంద్రబాబు సర్కార్ చేపట్టింది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్‌వీఏసీ (వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్‌లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేఅవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ లాంటి కనీస మౌలిక సదుపాయాల పనులను రూ.1,057.62 కోట్లతో చేపట్టింది.
ఆ టవర్లకు అద్దాలను అమర్చే పనులను రూ.4,830 కోట్లతో చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఇక టవర్ల డిజైన్‌ల పనులను రూ.401.54 కోట్లకు ఫోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్‌కు అప్పగించారు. మొత్తమ్మీద సచివాలయం టవర్ల అంచనా వ్యయం ఇప్పటికే రూ.13,294.87 కోట్లకు చేరుకుంది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగుకు ఏకంగా రూ.25,466.68కు చేరుకుంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్‌తో చేపట్టే నిర్మాణాల వ్యయం సైతం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నారు.
సంప్రదాయ పద్దతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో కట్టినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం ఇంతింతై.. అన్నట్లుగా కొండవీటి చేంతాడులా పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


