రాజధాని పనుల్లో అంచనాలకు అందని బాబు సర్కార్ వంచన
అసెంబ్లీ శాశ్వత భవనంలో ఏంఈపీ పనులకు రూ.337.90 కోట్ల అంచనాతో టెండర్
ఏప్రిల్ 16న ఇదే పనులకు జారీచేసిన టెండర్‌లో కాంట్రాక్టు విలువ రూ.244.26 కోట్లే
హైకోర్టు శాశ్వత భవనంలో ఎంఈపీ పనులకు రూ.412.60 కోట్ల అంచనాతో టెండర్
ఏప్రిల్ 16న ఇదే పనులకు జారీచేసిన టెండర్‌లో కాంట్రాక్టు విలువ రూ.365.15 కోట్లే
అసెంబ్లీ భవనం పనుల్లో రూ.93.64 కోట్లు.. హైకోర్టు భవనం పనుల్లో రూ.47.45 కోట్లు పెంపు
యథావిధిగా సిండి‘కేటు’ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేసి.. దోచుకునేందుకు ముఖ్యనేత స్కెచ్!
సాక్షి, అమరావతి: అసెంబ్లీ శాశ్వత భవనంలో ఎంఈపీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్) పనులకు ఏప్రిల్ 16న రూ.244.26 కోట్ల అంచనాతో లంప్సమ్ విధానంలో టెండర్ పిలిచిన ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆ తర్వాత వాటిని రద్దు చేసింది. మళ్లీ అదే పనులకు సెప్టెంబరు 28న రూ.337.90 కోట్ల అంచనాతో టెండర్ పిలిచింది. హైకోర్టు శాశ్వత భవనంలో ఎంఈపీ పనులకు ఏప్రిల్ 16న రూ.365.15 కోట్ల అంచనాతో టెండర్ పిలిచిన ఏజీఐసీఎల్ ఆ తర్వాత వాటిని రద్దు చేసింది. అదే పనులకు గత నెల 28న రూ.412.60 కోట్ల అంచనాతో టెండర్ పిలిచింది.
రాజధాని పనుల్లో అక్రమాలకు ఇది మరో తార్కాణం! కేవలం ఐదు నెలల వ్యవధిలో అసెంబ్లీ భవనం ఎంఈపీ పనుల అంచనా వ్యయం రూ.93.64 కోట్లు, హైకోర్టు భవనం ఎంఈపీ పనుల అంచనా వ్యయాన్ని చంద్రబాబు సర్కార్ ఏకంగా రూ.47.45 కోట్లు పెంచేసింది. నిజానికి ఏప్రిల్ నాటికి.. నేటికీ వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయినా సరే రెండు భవనాల ఎంఈపీ పనుల అంచనా వ్యయం రూ.141.09 కోట్లు పెంచేసింది. యధావిధిగా వీటిని సిండికేట్ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టి దోచుతినేందుకు ముఖ్యనేత స్కెచ్ వేశారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
సిండికేట్ కాంట్రాక్టర్ల కోసమే..
అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల ఎంఈపీ పనులు అంటే.. హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ (హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), లిఫ్ట్‌లు, ఎలివేటర్లు అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్‌వీ(సీసీ టీవీ, ఫైర్ అలారమ్‌తో కూడిన భద్రత వ్యవస్థ) చేపట్టే పనులకు ఏప్రిల్ 16న రెండు ప్యాకేజీల కింద ఏజీఐసీఎల్ టెండర్లు పిలిచింది. సిండికేట్ కాంట్రాక్టర్లు బిడ్‌లు దాఖలు చేయకపోవడంతో ఏజీఐసీఎల్ ఈ టెండర్లను రద్దు చేసింది.
సిండికేట్ కాంట్రాక్టర్లకు వీటిని అప్పగించడం కోసమే అంచనా వ్యయాన్ని పెంచేయాలని అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో ఏప్రిల్‌తో పోలిస్తే ఎంఈపీ పనుల్లో వినియోగించే వస్తువుల ధరల్లో ఏమాత్రం మార్పు లేకున్నా.. పనుల పరిమాణంలో ఎలాంటి మార్పు లేనప్పటికీ అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. రాజధాని ముసుగులో అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి చేపట్టిన పనుల్లో అంచనా వ్యయాన్ని భారీ ఎత్తున పెంచేసి.. దోచుకుతింటూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికే రూ.353 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు భవనాలు..
రాజధాని అమరావతిలో 2019 నాటికే అసెంబ్లీ భవనాన్ని రూ.180 కోట్లతోనూ.. రూ.173 కోట్ల వ్యయంతో హైకోర్టు భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. చంద్రబాబు సర్కార్ వాటిని తాత్కాలిక భవనాలుగా పేర్కొంది. ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ)లో ఈ–బ్లాక్‌లో అసెంబ్లీ శాశ్వత భవనం.. ఎఫ్–బ్లాక్‌లో హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణాలను చేపట్టింది.
» అసెంబ్లీ భవనాన్ని బేస్‌మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్, 3 అంతస్తులు (బీ+జీ+3)లో 11,21,975 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్‌లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ పనులు చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు.
» హైకోర్టు భవనాన్ని బేస్‌మెంట్, గ్రౌండ్ ప్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో నిర్మిస్తోంది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలని షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్‌లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్ చేసిన ఎన్‌సీసీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్‌లో పేర్కొంది. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట.
» శాశ్వత భవనాలు పూర్తయితే తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు చంద్రబాబు సర్కార్ వెచ్చించిన రూ.353 కోట్లు వృథానే అని నిపుణులు పేర్కొంటున్నారు.


