ఫొటోలకు పోజులిస్తున్న సీఎం చంద్రబాబు
ఆదుకోకుండా చంద్రబాబు ‘నీతి చంద్రిక’పై రైతుల మండిపాటు
వరుస తుపానులతో కుదేలైన అన్నదాతలు
దాదాపు 15 లక్షల ఎకరాలకు పైగా దెబ్బతిన్న పంటలు
పైసా సాయం చేయకుండా ఈవెంట్ మేనేజ్‌మెంట్లతో చంద్రబాబు కాలక్షేపం
ఉచిత పంటల బీమా ఎత్తేసి.. బీమా పరిహారాన్ని ఎగ్గొట్టిన బాబు
ఇప్పుడేమో ‘ప్రీమియం కట్టని మీకు పరిహారం ఎలా వస్తుందంటూ’ కౌలు రైతులపై ఎదురుదాడి
ప్రీమియం చెల్లించిన వారికి మూడేళ్లుగా అందని బీమా
పరిహారం.. ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్లే పరిహారం ఇవ్వలేదంటున్న కంపెనీలు
సాక్షి, అమరావతి: ఈవెంట్ మేనేజ్‌మెంట్లు చేయడంలో సీఎం చంద్రబాబును మించిన వారు లేరని వరుస తుపాన్లతో తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏ చిన్న సంక్షోభాన్ని వదిలి పెట్టకుండా ప్రతీ దాంట్లోనూ వ్యక్తిగత మైలేజ్ కోసం పాకులాడటం ఏమిటని నిలదీస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన పేరిట చంద్రబాబు చేసిన హంగామా చూస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందేనని రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల్లో చర్చ జరుగుతోంది. వరుస తుపానుల దెబ్బకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రైతులను ప్రభుత్వ పెద్దగా ఆదుకోవాల్సింది పోయి.. రెడీ.. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్! అంటూ చంద్రబాబు చేసిన స్టంట్‌లు, వారిని అవమానపర్చేలా చేసిన వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
చంద్రబాబు నిర్వాకాలకు తోడు ఖరీఫ్ సీజన్‌లో ఓవైపు కరువు, మరోవైపు వరుస తుపానులు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. తీవ్ర వర్షాభావం, సాగునీటి ఎద్దడి లాంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి అరకొరగా సాగు చేస్తే.. తీరా పంట చేతి కొచ్చే వేళ వరుసగా అర్నబ్, మురసు తుపానులు విరుచుకుపడ్డాయి. ఈ రెండు విపత్తుల్లో ప్రాథమిక అంచనాల మేరకు దాదాపు 12.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులే అంచనా వేశారు. దాదాపు 11.40 లక్షల ఎకరాల్లో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కాగా క్షేత్రస్థాయిలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు నష్ట పోయినట్లు అంచనా.
ఫొటోలకు పోజులిస్తూ.. రైతులపై నిందలా?
విపత్తుల వేళ ప్రభుత్వాధినేతలు కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలవాలి. వారికి నేనున్నానని భరోసా కల్పించాలి. కానీ ఇందుకు విరుద్దంగా చంద్రబాబు చేస్తున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్లు తీవ్ర విస్మయానికి గురి చేస్తున్నాయి. ఓవైపు ఏరియల్ సర్వేలంటూ హెలికాప్టర్‌లో చక్కర్లు కొడుతూ మరొకవైపు క్షేత్రస్థాయి పరిశీలన పేరిట ఆయన చేస్తున్న ప్రచారార్భాటాలను చూసి రైతులు నివ్వెరపోతున్నారు. ‘అర్నబ్’ తుపాను వేళ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ, గోదావరి జిల్లాల్లోనూ... ‘మురసు’ సమయంలో బాపట్ల, గుంటూరు జిల్లాల్లో బాబు చేసిన హంగామా అంతా అంతా కాదు.
పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను అక్కున చేర్చుకుని అండగా నిలవాల్సిన వేళ వారి గోడు పట్టించుకోకుండా ‘మీరు వీడియోలు, ఫోటోలు తీసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా పోజులిస్తా’ అంటూ తన వెంట తీసుకెళ్లిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ (ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు) నిర్వాహకులకు బాబు స్వయంగా సూచనలు ఇవ్వడం రైతులను విస్తుపోయేలా చేశాయి. కాళ్లకు కాదు కదా.. కనీసం బూట్లకు కూడా మట్టి అంటకుండా పొలం గట్లపై నడుస్తూ, రైతులను పంట బోదెల్లో దింపి వారి భుజాలపై చేతులేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
ఇన్‌పుట్ సబ్సిడీ రావడం లేదు.. పంటల బీమా పరిహారం రావడం లేదంటూ కౌలురైతులు నిలదీస్తే బదులివ్వాల్సింది పోయి.. ‘ప్రీమియం కట్టమంటే కౌలు రైతులు చెల్లించలేదు.. బీమా పరిహారం ఎలా వస్తుంది?’ అని చంద్రబాబు గద్దించడం తీవ్ర చర్చనీయాంశమైంది. క్షేత్ర స్థాయి పర్యటనలో రైతుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక చంద్రబాబు వారిపై ఎదురు దాడికి దిగుతున్నారంటూ రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
ఎంత మందికి పరిహారం ఇచ్చావ్ బాబూ..?
ప్రీమియం చెల్లించలేదు కాబట్టి మీకు బీమా పరిహారం ఎలా వస్తుందని రైతులను గద్దిస్తున్న చంద్రబాబు ఈ రెండున్నరేళ్లలో కనీసం ప్రీమియం చెల్లించిన అన్నదాతల్లో ఎంతమందికి బీమా పరిహారం ఇచ్చారో చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రైతులపై పైసా కూడా భారం పడకుండా రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ఉచిత పంటల బీమాను అధికారంలోకి వచ్చీ రాగానే ఎత్తివేసిన చంద్రబాబు స్వచ్చంద నమోదు అంటూ ప్రీమియం భారాన్ని వ్యవసాయదారుల నెత్తిన మోపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో 2024 జూన్‌లో చెల్లించాల్సిన ప్రభుత్వ ప్రీమియం వాటాను చంద్రబాబు ఎగ్గొట్టడంతో 2023–24 వ్యవసాయ సీజన్‌లో రైతులకు రావాల్సిన రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది.
రబీ–2024, ఖరీఫ్ 2025 సీజన్‌లలో అయినా బాబు సర్కార్ తన వాటా ప్రీమియం మొత్తం చెల్లించి ఉంటే కనీసం మరో రూ.2,500 కోట్లకు పైగా బీమా పరిహారం ఈపాటికే అంది ఉండేది. ప్రభుత్వ వాటా ప్రీమియాన్ని ఎగ్గొట్టడంతో రబీ–2025 సీజన్‌లో ఏపీని బీమా కంపెనీలు బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన మాట వాస్తవం కాదా బాబూ? అని రైతులు నిలదీస్తున్నారు. కాళ్లావేళ్లా పడడంతో ఖరీఫ్– 26 సీజన్‌లో కంపెనీలు బీమా పోర్టల్ తెరవగా.. సాగు చేయని ప్రాంతాల్లో రైతుల మెడపై కత్తిపెట్టి మరీ ప్రీమియం వసూలు చేశారు. దరఖాస్తులో నమోదైన పంట, సాగు చేసిన పంట వేర్వేరు కావడంతో ఏ ఒక్కరికీ పైసా కూడా పరిహారం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
మరొక వైపు ఈ రెండున్నరేళ్లుగా 20కిపైగా విపత్తులు సంభవిస్తే ఏ ఒక్క రైతుకూ పైసా పంట నష్ట పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపాను సాయం నేటికీ జమ కాలేదు. డబ్బులు లేకుండానే ఇన్‌పుట్ సబ్సిడీ జీవోలు జారీ చేస్తున్న ఘనత మీది కాదా బాబూ? అని ప్రశ్నిస్తున్నారు. ఈ రెండున్నరేళ్లలో కరువులు, వరుస విపత్తులతో నష్ట పోయిన రైతులకు దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టారు. సామాజిక వర్గాలకు అతీతంగా భూ యజమానులతో సమానంగా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ కౌలు రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల్లో నమ్మబలికారు.
అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో ఏ ఒక్క కౌలు రైతుకూ ఒక్క రూపాయి పెట్టుబడి సాయం అందించిన పాపానపోలేదు. అలాంటిది కౌలు రైతులను తామేదో ఉద్ధరిస్తున్నట్టు చంద్రబాబు వారిపై ఎదురుదాడికి దిగడం పట్ల రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వ తోడ్పాటులేక.. మరొక వైపు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేక నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునే విషయంలో ఏం చేశారో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులపై నిందలు దుర్మార్గం..
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. మూడేళ్లుగా రూపాయి కూడా పెట్టుబడి సాయం చేయలేదు. 20కిపైగా విపత్తులు సంభవిస్తే ఏ ఒక్క కౌలు రైతుకు పంట నష్ట పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపారు. ప్రీమియం భారం కావడంతో కౌలు రైతులు బీమా చేయించుకోలేకపోయారు. ఇలా తప్పులు మీద తప్పులు చేసి కౌలు రైతులపై నెట్టడం దుర్మార్గం. – పి.జమలయ్య, ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
వచ్చామా.. వెళ్లామా!
గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో ముంపు పొలాల వైపు వెళ్లని సీఎం చంద్రబాబు
ఒకేచోట ఆగి.. వరి పొలాన్ని చూసిన సీఎం
ఆద్యంతం ఫొటోషూట్‌ను తలపించిన పర్యటన
గుంటూరు/బాపట్ల: గుంటూరు జిల్లా కాకుమాను మండలం రేటూరులో మురసు తుపాను ముంపు ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఓ రైతు సాగుచేసిన వరి పంటను పరిశీలించారు. సాగుదారులతో ముచ్చటించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ముంపు బాధితులకు 25 కిలోల బియ్యంగానీ ప్రతీ ఒక్కరికీ నగదుగానీ ఇస్తున్నామన్నారు. మిగిలిన ఏ ఊర్లో నీరు వచ్చినా ఆ ఊరికంతా ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. నియమ నిబంధనలు విడుదల చేశామని, ఒకట్రెండు రోజుల్లో అందరికీ ఇస్తామన్నారు. మీడియా ప్రతినిధి ఒకరు గత ఏడాది మొంథా తుపాను పరిహారం ఇప్పటివరకు రాలేదని చెప్పడంతో.. అది నాకు తెలియదు గానీ, మేం మొత్తం ఇచ్చాం. ఏమైందో కనుక్కుంటామని చంద్రబాబు చెప్పారు.
అయితే, సీఎం పర్యటన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లమడ వాగు ఉగ్రరూపంతో కాకుమాను మండలంలోని రేటూరు, అప్పాపురం, కాకుమాను గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. సీఎం వచ్చే సమయానికి కూడా అవన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. కానీ, వాటిని పరిశీలించకుండా చంద్రబాబు ఓ పొలం వద్ద ఆగి అక్కడే దూరం నుంచి నీట నానుతున్న పొలాలు చూసి అటు నుంచి అటే వెళ్లిపోవడంతో అన్నదాతలు పెదవి విరిచారు.
ప్రీమియం చెల్లించని వారికి బీమా రాదు
రైతులందరికీ బీమా అందడం లేదని, బీమా స్కీముల్లో ఏమైనా మార్పులు చేస్తారా అని సీఎం చంద్రబాబును మీడియా ప్రశ్నించింది. మనం బీమాను మార్చలేమని, గైడ్‌లైన్స్ ఉంటాయని సీఎం తెలిపారు. కౌలు రైతులు ప్రీమియం కట్టలేదని.. కట్టకపోతే వారికి బీమా రాదని చంద్రబాబు చెప్పారు. కౌలు రైతులే 80 శాతం మంది ఉన్నారని మీడియా ప్రతినిధులు చెప్పగా.. ఏం చేయగల్గుతాం చెప్పండి? మనకు కొన్ని నిబంధనలున్నాయ్.. ఇబ్బందులున్నాయ్.. అని చంద్రబాబు అన్నారు. కాగా, రేటూరులో చంద్రబాబు ముంపు ప్రాంత పర్యటన ఫొటో షూట్‌లా సాగింది. నలుగురు ఫొటో, వీడియోగ్రాఫర్లు ఫొటోషూట్‌ను తలపించేలా ఫొటోలు, వీడియోలు తీస్తుండటాన్ని చూసి రైతులు ముక్కున వేలేసుకున్నారు.


