కుతంత్రాలే అస్త్రం.. రిగ్గింగే శస్త్రం..
చంద్రబాబుకు ఎస్‌ఈసీ తొత్తు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చిత్తు
‘కనపడదు.. వినపడదు’ అన్న స్థితిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఇష్టారాజ్యంగా పేట్రేగిపోయిన పచ్చ కాలకేయుల అక్రమాలపై చర్యలేవీ?
యథేచ్ఛగా పోలింగ్ బూత్‌లు ఆక్రమించడం కనిపించడం లేదా?
ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లను బయటకు తోసేసి రిగ్గింగ్ చేయలేదా?
బాధితులు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా స్పందించలేదెందుకు?
104.27 శాతం పోలింగ్ అంటే ఏం జరిగిందో తెలియదా?
పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లు వేయించడంపై సర్వత్రా విస్మయం
వందలాది వీడియోలు వైరల్ అయినా నిమ్మకు నీరెత్తినట్లున్న ఎస్‌ఈసీ
ఈ దుస్థితి తమ 20–30 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదంటున్న పోలింగ్ సిబ్బంది
సాక్షి, అమరావతి: దేశ ఎన్నికల చరిత్రలోనే గతంలో ఎన్నడూ చూడని, వినని రీతిలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు మితిమీరిపోయాయి. గతంలో జరిగిన అక్రమాలన్నింటినీ మించి పచ్చ పార్టీ గూండాల నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అడుగడుగునా అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో.. డజన్ కుట్రలతో అడ్డగోలుగా విజయం సాధించేలా టీడీపీ పెద్దలు కుతంత్రాలు పన్నిన విషయం విదితమే.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా ఆదిలోనే అడ్డుకోవడం.. టీడీపీ గూండాలు పత్రాలు లాక్కొని చింపేయడం.. ఈ అడ్డంకులు దాటుకుని ఎవరైనా నామినేషన్ దాఖలు చేసి ఉంటే.. ఏకంగా ఆర్వోల వద్దకే వెళ్లి వారి వద్ద ఉన్న పత్రాలు ఎత్తుకెళ్లడం.. ఆపై ఎవరైనా పోటీలో నిలిచి ఉంటే బెదిరింపులకు గురిచేయడమూ తెలిసిందే. అన్ని అడ్డంకులను అధిగమించి పోలింగ్ దాకా వచ్చిన చోట్ల ఏకంగా ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లనే గెంటి వేసి.. ఇష్టానుసారం రిగ్గింగ్ చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇంత జరుగుతున్నా ఎస్‌ఈసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఈసీ చంద్రబాబుకు తొత్తుగా మారడం వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ప్రజలు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలనే ఆక్రమించుకుని, యథేచ్ఛగా ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతున్న ఘటనలకు సంబంధించిన వందలాది వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినా రీ పోలింగ్ నిర్వహించడానికి ఎస్‌ఈసీ సిద్ధపడక పోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ నిస్సహాయతను ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఎన్నెన్నో అక్రమాలు.. స్పందనలే నిల్
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంతో పాటు, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలం చిర్రయాణం పోలింగ్ బూత్‌లో టీడీపీ మూకలు పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకుని యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలకు సంబంధించి పదుల సంఖ్యలో వీడియోలు బహిర్గతమయ్యాయి.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుపల్లి పోలింగ్ కేంద్రంలో అక్కడి మొత్తం ఓటర్ల సంఖ్య కంటే అధికంగా ఓట్లు పోలైనట్లు అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఏకంగా 104.27 శాతం పోలింగ్ నమోదైనట్లు మండల ఎన్నికల అధికారులే వెల్లడించడం విశేషం. ఇది టీవీ మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. ఒక పోలింగ్ కేంద్రంలో నమోదైన ఓట్ల శాతం మొత్తం ఓటర్ల సంఖ్యను మించిపోయాయంటే అక్కడ పక్కాగా రిగ్గింగ్ జరిగిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. అయినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కనీస స్పందన లేకపోవడం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసింది.
అంతా ఒక్కటై.. మాఫియా తరహాలో ఎన్నికల కుట్ర
సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో ఏదైనా పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ లేదా ఇతర అక్రమాలు చోటుచేసుకుంటే, వాటిని విధుల్లో ఉన్న పోలింగ్ అధికారి (పీవో) తక్షణమే గుర్తించి ఎన్నికల రికార్డుల్లో నమోదు చేయాలి. ఆ స్థాయిలో అక్రమాలను నమోదు చేయకపోయినా, తదుపరి స్థాయిలో ఉండే రిటర్నింగ్ అధికారి (ఆర్వో) వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు అక్రమాలకు వత్తాసు పలికినా, జిల్లా కలెక్టర్లు స్వతంత్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించి నివేదికలు సమర్పించాల్సిన బాధ్యత ఉంటుంది.
ఈ స్థాయిల్లోనూ అధికారులు తమ బాధ్యతలను విస్మరించి, ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి అక్రమాలపై నివేదికలు సమర్పించలేదు. అయినా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం తన పరిధిలోని అధికారాలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చినప్పుడు, వాటిని పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్‌పైనే ఉంటుంది.
శుక్రవారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగినట్లు వీడియోలు బహిర్గతమైనా, ఎన్నికల సంఘం నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రజాస్వామ్యానికి పునాదులైన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంతటి తీవ్ర స్థాయి అక్రమాలు జరుగుతున్నా, వాటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలే మౌనంగా ఉండటం చూస్తుంటే అధికార యంత్రాంగం అంతా ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ బూత్‌ల ఆక్రమణలు, రిగ్గింగ్ ఆరోపణలు, ఓటర్ల సంఖ్యను మించిన పోలింగ్ వంటి అసాధారణ ఘటనలపై కూడా ఎన్నికల సంఘం స్పందించకపోతే, ఆ సంస్థ స్వతంత్రత, నిష్పాక్షికతపై ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది?
బాలెట్ బాక్స్‌ల తరలింపులో మతలబు ఏమిటి?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలకు తరలించే ప్రక్రియలో జరిగిన పలు సంఘటనలు పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం–1 ఎంపీటీసీ ఎన్నికకు సంబంధించి గురువారం పోలింగ్ సమయంలో స్థానికంగా టీడీపీ– వైఎస్సార్‌సీపీ పక్షాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను తరలించే క్రమంలో ఆ పోలింగ్ బూత్ పీవో మార్గం మధ్యలో బాలెట్ బాక్స్‌ను పట్టుకుని ఒక వాహనం నుంచి దిగి మరో వాహనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు స్థానికులు గుర్తించి నిలదీశారు.
సాధారణంగా బాలెట్ బాక్స్ సేకరించిన వాహనంలోనే నేరుగా వాటిని భద్రపరిచే స్ట్రాంగ్ రూంకు చేర్చాలని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. అనుమానాస్పదంగా పీవో వాహనం మారేందుకు ప్రయత్నించగా, పీవో తీరును నిరశిస్తూ ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపైనే పోలీసులు తిరిగి కేసు పెట్టారు. ఈ అంశంలో పోలీసులు, ఎన్నికలాధికారులు చెబుతున్న కారణాలు వేర్వేరుగా ఉండడం గమనార్హం. ఇదే తరహాలో చాలా నేరుగా స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బ్యాక్స్‌లను తరలించకుండా మార్గం మధ్యలో వాటిని ఒక చోట చేర్చి, చాలా సేపటి తర్వాత అక్కడి నుంచి వేరే వాహనంలో తరలించారని తెలుస్తోంది. ఫలితంగా మధ్యలో ఏకంగా బ్యాలెట్ బాక్స్‌లనే తారుమారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బీహార్ కంటే అత్యంత దారుణంగా ఉందని ఓ రిటైర్డు సీఎస్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంతటి అరాచకం, దౌర్జన్యం తమ 20–30 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని పోలింగ్ విధులు నిర్వహించిన ఉద్యోగులు బాహాటంగా చెబుతున్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితమంతా రక్తపాతం, రిగ్గింగ్, వెన్నుపోటే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని ఓ సీనియర్ రాజకీయ నేత వ్యాఖ్యానించారు.


