‘కూటమి అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు’ | YSRC Leader thopudurthi prakash reddy Takes On Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘కూటమి అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదు’

Nov 6 2026 7:43 PM | Updated on Nov 6 2026 7:57 PM

YSRC Leader thopudurthi prakash reddy Takes On Chandrababu Govt

అనంతపురం : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను అధికార కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా కేవలం పోలీసుల లాఠీలు, అక్రమ నిర్బంధాలతో పూర్తిగా ప్రహసనంగా మార్చేసిందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బలవంతంగా పత్రాలు లాక్కోవడం, వేసిన నామినేషన్లను అధికారులతో కుమ్మక్కై తిరస్కరించడం, పోలింగ్ ఏజెంట్లను, ముఖ్య నాయకులను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి ఏకపక్షంగా రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలుగుదేశం పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగిన ఎన్నిక కాదని, ప్రజల స్వేచ్ఛా హక్కులపై అధికార మదంతో ప్రభుత్వం కాకీ చొక్కాలను అడ్డుపెట్టుకుని చేసిన దాడి అని ఆయన స్పష్టం చేశారు.

నామినేషన్ల అపహరణ.. అధికారులతో తిరస్కరణ..
పెద్ద ఎత్తున అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు బలవంతంగా లాక్కోవడం నీకే చెల్లింది చంద్రబాబూ?. నామినేషన్లను అడ్డుకోవడం ద్వారా మీరు వేలాది స్థానాల్లో ఏకగ్రీవాలు చేసుకుని మీరు అనుకున్న ప్రగతిని సాధించారు. ఇక ధైర్యం చేసి వేసిన నామినేషన్లలో కూడా కనీసం 30 శాతం నామినేషన్లను మీ అనుకూల ఆర్వోలతో స్క్రూటినీలో కావాలని రిజెక్ట్ చేయించారు. వేలాది సంఖ్యలో ఈ విధమైన అక్రమాలకు పాల్పడ్డారు.

అక్రమ కేసులు, బెదిరింపు నోటీసులు
ఎన్నికల కంటే ముందే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించారు. ప్రచారాల సందర్భంలోనూ తప్పుడు కేసులు పెట్టి, బైండోవర్లకు కట్టుబడి లేరంటూ ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు, రూ.5 లక్షలు వసూలు చేస్తామని బెదిరింపు నోటీసులు జారీ చేసి భయాందోళనలు సృష్టించారు.

భారీగా ఏజెంట్ల నిర్బంధం.. వందలాది నేతల హౌస్ అరెస్టులు!
ఎన్నికల రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ బూతుల్లో కూర్చోవాల్సిన వేలాది మంది వైయస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను, గ్రామ స్థాయి ముఖ్య నాయకులను ముందు రోజు రాత్రి నుంచే పోలీసులు అక్రమంగా స్టేషన్లకు తీసుకెళ్లి నిర్బంధించారు. బయట ఉంటే ఓటర్లు ఎక్కడ వారిని చూసి ధైర్యంగా ఓటు వేయడానికి వస్తారేమోనన్న భయంతో వారిని బూతులకు రాకుండా అడ్డుకున్నారు. 

చివరకు నాలాంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలను సైతం వందల సంఖ్యలో ఇళ్లలోనే హౌస్ అరెస్టులు చేశారు. చంద్రబాబు నీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని పక్కనపెట్టి, నీ కుమారుడు నడుపుతున్న 'రెడ్ బుక్ రాజ్యాంగం'లో ఇదొక నయా మైలేజ్.

సుప్రీంకోర్టు ఆదేశాల బేఖాతరు.. సీసీటీవీల మాయాజాలం!
ఇవి ఎలక్షన్లా లేక సెలెక్షన్లా? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విలువ లేదా? నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ నిఘా తప్పనిసరిగా ఉండాలని కోర్టు ఆదేశించినా ఎక్కడ పాటించారు? కేవలం 50 శాతం కేంద్రాల్లో మాత్రమే కెమెరాలు పెట్టి, ఆ ఫుటేజ్‌ను కూడా అభ్యర్థులకు ఇవ్వకుండా దాచిపెట్టారు. 7,762 ఎంపీటీసీ, 582 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన ఫిర్యాదులు వస్తే ఏ ఒక్క కలెక్టరైనా చర్యలు తీసుకున్నారా?"

పరిటాల సునీత సొంత గడ్డపై దౌర్జన్యాలు
రామగిరి మండలం మాజీ మంత్రి పరిటాల సునీత సొంత మండలం, నసనకోట ఆమె సొంత గ్రామం. ఆ మండలంలోని ప్రతి గ్రామంలోనూ వైయస్సార్సీపీ ఏజెంట్లను బలవంతంగా అడ్డుకున్నారు. రామగిరి, కనగాపల్లి మండలాల్లో అధికార పార్టీ అరాచకాలను నిరసిస్తూ ఉదయం 11 గంటలకే దాదాపు ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్‌లో మా అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియను బహిష్కరించి బయటకు వచ్చేశారు. స్వయంగా డీఎస్పీ రంగంలోకి దిగి, సీఐలు, ఎస్సైలకు టార్గెట్లు పెట్టి రిగ్గింగ్ చేయించే బాధ్యతలను మోశారు. టీడీపీ గుండాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పోలీసులే స్వయంగా దగ్గరుండి రిగ్గింగ్ చేయించారు.

రెండు గంటల్లో 30 వేల ఓట్లా?.. గిన్నిస్ బుక్ రికార్డు!
పోలీసుల మద్దతుతో ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకుంటూ పోతే ఇక ఎన్నికలు ఎందుకు? కౌంటింగ్ ఎందుకు? ధర్మవరంలో కేవలం రెండు గంటల్లో (ఉదయం 9 నుంచి 11 గంటలకు) 30,000 ఓట్లు ఎలా నమోదయ్యాయి? చిలకలూరిపేటలో రెండు గంటల్లో 20,000 ఓట్లు ఎలా పడ్డాయి? గంటల వ్యవధిలో వేలాది ఓట్లు గుద్దేసిన ఈ విడ్డూరాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పెట్టాలి. విశాఖపట్నంలో సాయంత్రం 5 గంటల వరకు 9,19,367 ఓట్లు పోలైతే, పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి 2:30 గంటలకు అదనంగా మరో 1,15,767 ఓట్లు ఎలా పెరిగాయి? చిత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో 7,000 ఓట్లు అదనంగా వచ్చాయి. పులివెందులలో పెట్రోల్ బాంబుల దాడులు, బ్యాలెట్ బాక్సుల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.

ప్రజలపై ప్రభుత్వ యుద్ధం.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు!
డీజీపీ, ఐజీల నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు, ఎలక్షన్ కమిషనర్, కలెక్టర్ల నుంచి ఎంపీడీవోల వరకు చంద్రబాబు ఆదేశాలతో కేవలం 45 రోజుల్లో ఎన్నికల నిర్వహణలో దొంగ రికార్డులు సృష్టించేందుకు పనిచేశారు. ఇది పార్టీల మధ్య జరిగిన ఎన్నిక కాదు, ప్రజల ఓటు హక్కుపై, స్వేచ్ఛపై అధికార మదంతో ప్రభుత్వమే కాకీ చొక్కాలను పంపి చేసిన దాడి. అంబేద్కర్ రాజ్యాంగానికి, గాంధీజీ గ్రామ స్వరాజ్య కలలకు ఇది అత్యంత క్షోభ కలిగించే దుర్దినం. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వరు, సంక్షేమం అందించరు, సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను మోసం చేసి చివరకు ఓటు హక్కును కూడా లాక్కుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే యువతను సైతం నిర్బంధిస్తున్నారు.

ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది.. ప్రజల తిరుగుబాటు ఖాయం!
ప్రస్తుతం రాష్ట్రంలో 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను కూటమి ప్రభుత్వం మరలా తీసుకొచ్చిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. లాఠీలు, తూటాల బలంతో ప్రజాస్వామ్యాన్ని తొక్కివేస్తే ప్రజల్లో తిరుగుబాటు రాక మానదని... రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల రాష్ట్రంలో ఎవరికైనా పట్టెడు అన్నం దక్కిందా? అని సూటిగా ప్రశ్నించారు. 

పోటీ జరిగిన ప్రతిచోటా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందనే భయంతోనే రాప్తాడుతో సహా అనేక చోట్ల ఆర్వోలను కార్యాలయాలకు రాకుండా చేసి రేపటి కౌంటింగ్‌లోనూ కొత్త కొత్త రూల్స్ తెచ్చి అక్రమాలకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను అణచివేసిన నియంతలకు చరిత్రలో ఎలాంటి దుస్థితి పట్టిందో చంద్రబాబుకు, ఆయన కుమారుడికి అదే గతి పడుతుందని.. ప్రజలు  అధఃపాతాళానికి తొక్కడం ఖాయమని హెచ్చరించారు.

ఇదీ చదవండి:  ‘కూటమికి నేరుగా గెలిచే దమ్ములేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement