రాజ్యాంగానికి రక్షణ ఎక్కడ? కాకాణి సంచలన ఆరోపణలు! | AP Parishad Elections Kakani Allegations Police | Sakshi
Sakshi News home page

రాజ్యాంగానికి రక్షణ ఎక్కడ? కాకాణి సంచలన ఆరోపణలు!

Nov 6 2026 1:07 PM | Updated on Nov 6 2026 1:24 PM

AP Parishad Elections Kakani Allegations Police

సాక్షి నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార కూటమి అరాచకాలకు పాల్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. ప్రజలను కాపాడాల్సిన పోలీసులతోనే పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని వారు మండిపడ్డారు.

ఏపీలో పరిషత్‌ ఎన్నికలు జరిగిన విధానంపై, ఆ సమయంలో పోలీసులు ప్రవర్తించిన దారుణమైన తీరుపై.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడూతూ.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా పార్టీ శ్రేణులను నిర్బంధించారని, ప్రధాన నాయకులను హౌస్‌ అరెస్టులు చేయగా, కొందరు నేతలను గ్రామాల నుంచి వెళ్లగొట్టారని, ఈ పరిస్థితి చాలా దారుణమని అన్నారు. నెల్లూరు జిల్లాలో పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, గాయపడిన వారిని సైతం తరిమికొట్టారని వారు విమర్శించారు.

అలాగే, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిపై పోలీసులు జులుం ప్రదర్శించారని కాకాణి ఆరోపించారు. మంత్రిగా ఉన్న ఆనం పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఎలా వెళ్తారని వారు ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా వెళ్లి బూత్‌ క్యాప్చరింగ్‌కు పాల్పడ్డారు. అలాగే, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన చోట పోలింగ్‌ రద్దు చేయకపోవడంపై కలెక్టర్‌ను నిలదీస్తున్నానని కాకాణి అన్నారు.

మర్రిపాడులో ఎస్‌ఐ బలరాం, సీఐ గంగాధర్‌ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతోపాటు.. టీడీపీకి చెందిన వారు గూడూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి గురవయ్య ఇంటిపై దాడికి యత్నించారని వారు ఆరోపించారు. గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తరిమికొట్టడం, పోలీస్‌స్టేషన్‌కు తరలించిన తీరు సరికాదని మండిపడ్డారు.

స్వయంగా పోలీసులే రిగ్గింగ్‌కు పాల్పడుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగానికి రక్షణ ఎక్కడ ఉంటుందని కాకాణి ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిషత్‌ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనలపై అధికారులు వెంటనే స్పందించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు.

ఇదీ చదవండి: ఆ ఏడు కేసులను ఎందుకు మూసేశారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement