పోలీసులపై ఊగిపోతున్న ఎమ్మెల్యే సునీల్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: తమకు అడ్డొచ్చిన పోలీసులపై గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఊగి పోయారు. ఖాకీ చొక్కాలిప్పి వస్తే కొట్టుకుందామని కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేకలు వేస్తూ మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించిన ఘటన వాకాడు మండలంలోని ఎస్‌ఏఎల్‌సీ పాఠశాల వద్ద గురువారం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో పోలీసులు తాము ఎంత చేసినా చివరికి ఇలా మాటలు పడాల్సి రావడంపై ఏమిటని మదన పడుతున్నారు.
పరిషత్ ఎన్నికల సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి అదికార పార్టీ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి కేంద్రం వద్దకు చేరుకుని పోలీసులపై ఊగి పోయారు. దీంతో అక్కడికి చేరుకున్న సీఐతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగి ఓటర్లు, అభ్యర్థులు, కేంద్రంలోకి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. రౌడీయిజం చేస్తున్నారా? నాయకులను ఎస్సై ఎలా అడ్డుకుంటారు.. రమ్మనండి తేల్చుకుందాం. చొక్కాలు విప్పి వస్తే కొట్టుకుందాం అంటూ సవాల్ విసిరారు. మీ ఇష్టమా, మేము కూలీలమా అంటూ రచ్చ చేశారు.
ఇదీ చదవండి: వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్


