ఏం కష్టమొచ్చింది తల్లులూ! | Two Childhood Friends Attempt Suicide In Chittoor, One Dies While Another Battles For Life, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఏం కష్టమొచ్చింది తల్లులూ!

Nov 6 2026 9:39 AM | Updated on Nov 6 2026 10:08 AM

Two Girl Attempted Suicide In Chittoor

మృతురాలు మౌనిక (ఫైల్‌) , ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జీవిత (ఫైల్‌)

చిత్తూరు: ఆ ఇద్దరిదీ విడదీయలేని స్నేహబంధం.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు.. కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకునేవారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు బాలికలు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆ లోటును మరచిపోయేవారు. అలాంటి ప్రాణస్నేహితులు ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికులను కలచివేసింది. వారిలో ఒకరు మృత్యుఒడికి చేరగా.. మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. అసలు ఆ చిన్నారులకు ఏం కష్టమొచ్చింది? వారి మనసుల్లో ఎలాంటి వేదన దాగి ఉంది? అన్న ప్రశ్నలు అందరినీ కలచివేస్తున్నాయి. 

మున్సిపల్‌ పరిధిలోని కాకవేడు ఎస్టీ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన ఎ. విజయక్‌ కుమార్తె మౌనిక (15), సెంథిల్‌ కుమార్తె జీవిత (17) బుధవారం సాయంత్రం విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రాత్రి వారి పరిస్థితిని గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మౌనిక చికిత్స పొందుతూ మృతిచెందింది. అపస్మారక స్థితిలో ఉన్న జీవితకు నగరి ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. 

తల్లిని కోల్పోయి.. ఒకరికొకరు తోడుగా.. 
మౌనిక, జీవిత చిన్ననాటి నుంచే ప్రాణస్నేహితులు. ఇరుగుపొరుగు ఇళ్లలోనే నివసించడంతో బాల్యం నుంచే వారి మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది. మౌనిక తొమ్మిదో తరగతి వరకు చదివి చదువు మానేయగా.. జీవిత పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక ఇంటివద్దే ఉంటోంది. ఇద్దరూ చిన్న వయసులోనే తల్లులను కోల్పోయారు. తల్లి ప్రేమకు దూరమైన ఆ చిన్నారులు ఒకరికొకరు ఆప్యాయతను పంచుకుంటూ పెరిగారు. 

ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఒకరికి మరొకరు తోడుగా ఉంటూ తమ బాల్యాన్ని గడిపారు. మౌనిక తండ్రి సంరక్షణలో ఉండగా.. జీవిత తండ్రి దూర ప్రాంతంలో ఉండటంతో అవ్వాతాతల వద్ద పెరుగుతోంది. ఇంతటి అనుబంధం కలిగిన ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కాలనీవాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎప్పుడూ చలాకీగా కనిపించే ఆ చిన్నారుల మనసుల్లో అంతటి వేదన ఏముంది? తమ బాధను ఎవరితోనూ పంచుకోలేనంత కష్టం ఏమొచ్చింది? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

విచారణలో వాస్తవాలు వెలుగులోకి.. 
ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యారి్థనుల సెల్‌ఫోన్లలోని డేటాను పరిశీలిస్తూ ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జీవిత కోలుకున్న తర్వాత ఆమె వాంగ్మూలం ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కలిసి నవ్వుతూ.. కలిసి తిరుగుతూ గడిపిన ఆ ఇద్దరు బాల్య స్నేహితుల్లో ఒకరు ఇక లేరన్న వార్త కాలనీవాసుల హృదయాలను కలచివేస్తోంది. మరో చిన్నారి అయినా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement