స్కిల్ డెవలప్‌మెంట్‌సహా ఏడు కేసులపై సీఐడీకి హైకోర్టు ప్రశ్న
సీజ్ చేసిన వస్తువులు, కీలక ఆధారాల పరిరక్షణకు ప్రత్యేక పిటిషన్ దాఖలుకు సూచన
చంద్రబాబు సీఎం అయ్యాక ఈ కేసుల దర్యాప్తు పక్కదారి
కేసుల మూసివేతే లక్ష్యంగా సీఐడీ దర్యాప్తు
కీలక ఆధారాలను పక్కనపెట్టి క్లోజర్ రిపోర్టులు
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు
సాక్షి, అమరావతి: అప్పటి ప్రభుత్వ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు, పొంగూరు నారాయణ, పలువురు మంత్రులు, అధికారులపై దాఖలైన స్కిల్ డెవలప్‌మెంట్‌సహా ఏడు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడు కేసులను ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ అంటూ మూసివేస్తూ సీఐడీ దాఖలు చేసిన నివేదికలకు సంబంధించిన వివరాలను కేసుల వారీగా పొందుపరిచి సమగ్ర పట్టికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
ఆయా కేసుల్లో ఫిర్యాదుదారుల వైఖరి, క్లోజర్ రిపోర్టుల దాఖలు, వాటి ఆమోదం, ప్రొటెస్ట్ పిటిషన్ల వివరాలను కేసుల వారీగా సమగ్ర పట్టిక రూపంలో తమ ముందు ఉంచాలని సీఐడీని ఆదేశించింది. ఈ వివరాలతోపాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా సమర్పించాలని స్పష్టంచేసింది. వాటి ప్రతులను పిటిషనర్ తరఫు న్యాయవాదికి అందించాలని కూడా నిర్దేశించింది. క్లోజర్ రిపోర్టులను సవాలు చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు సంబంధిత కోర్టు వాటిని పరిశీలించవచ్చని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వస్తువులు, కీలక ఆధారాలను పరిరక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తే సంబంధిత న్యాయస్థానం పరిశీలిస్తుందని కూడా సూచించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన ప్రధాన న్యాయమూర్తి (సీజే )జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, అసైన్డ్ భూములు, ఏపీ ఫైబర్‌నెట్, మద్యం, ఇసుక విధానాలకు సంబంధించి దాఖలైన కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీలకు అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం విచారించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ 2023లో పిల్ దాఖలు చేశారు. అలాగే చంద్రబాబు తదితరులపై వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించి నమోదైన ఏడు కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీలకు బదిలీ చేయాలని కోరుతూ స్వర్ణాంధ్ర తెలుగు డైలీ ఎడిటర్ కె.బాలగంగాధర్ తిలక్ 2024లో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్, అసైన్డ్ భూములు, ఏపీ ఫైబర్‌నెట్, మద్యం, ఇసుక విధానాలకు సంబంధించిన కేసుల్లో ధర్మాసనం అడిగిన వివరాలు
1. కేసు నంబరు, ఎఫ్‌ఐఆర్ అంశాలు
2. క్లోజర్ రిపోర్టు దాఖలు చేసిన తేదీ
3. క్లోజర్ రిపోర్టును సంబంధిత న్యాయస్థానం ఆమోదించిన తేదీ
4. ఫిర్యాదుదారుడు ఇచ్చిన 164 స్టేట్‌మెంట్ వివరాలు
5. ఫిర్యాదుదారుడు దాఖలు చేసిన అఫిడవిట్ లేదా ఎన్‌ఓసీ వివరాలు
6. క్లోజర్ రిపోర్టుకు ఫిర్యాదుదారుడు అంగీకరించిన కారణాలు
7. ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారా? లేదా? సంబంధిత వివరాలు
8. ప్రొటెస్ట్ పిటిషన్ లేదా క్రిమినల్ రివిజన్ పెండింగ్‌లో ఉన్న న్యాయస్థానం వివరాలు
స్వతంత్ర సంస్థ నిష్పక్షపాత దర్యాప్తు అవసరం
2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత.. ఆయనపై గతంలో నమోదైన కీలకమైన ఆర్థిక నేరాల కేసుల్లో రికార్డులు, ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ముందు నుంచీ మాకు ఆందోళన ఉంది. తొలుత ఐదు కేసుల్లో చార్జ్‌షీట్లు దాఖలు కాగా, మిగిలిన కేసుల్లో దర్యాప్తు కొనసాగింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం సీఐడీ అధికారులు గతంలో సేకరించిన ఆధారాలను పక్కన పడేశారు.
చంద్రబాబు తదితరులపై కేసులను మూసి వేయాలన్న ఉద్దేశంతో కోర్టు అనుమతి లేకుండా నామమాత్రంగా దర్యాప్తు చేపట్టి, గతంలో విచారించిన సాక్షులతోపాటు కొత్తగా మరికొందరిని విచారించారు. గతంలో 289 మంది సాక్షులను విచారించగా, తిరిగి దర్యాప్తులో మరో 146 మందిని విచారించారు. వాటి ఆధారంగా ఏసీబీ కోర్టులో ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ అంటూ క్లోజర్ రిపోర్టులు దాఖలు చేశారు. సంబంధిత న్యాయస్థానాల అనుమతి లేకుండా తిరిగి దర్యాప్తు చేపట్టి సాక్షులను పునర్విచారించడం చట్టవిరుద్ధం. కొన్ని కేసుల్లో క్లోజర్ రిపోర్టులను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్లు, ఇతర న్యాయపరమైన పిటిషన్లు దాఖలయ్యాయి. అందువల్ల ఈ పిల్ నిరర్థకంగా మారిందని చెప్పడానికి వీల్లేదు.
చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసుల్లో గతంలో సీజ్ చేసిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర కీలక వస్తువులను నిందితులకు తిరిగి ఇవ్వకుండా పరిరక్షించాలి. ప్రొటెస్ట్ పిటిషన్లపై నిర్ణయం వెలువడే వరకు వాటిని భద్రపరచాలి. లేకుంటే కీలక ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ అంశంపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలి. పిటిషనర్లతోపాటు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కళ్లం అజయ్‌కుమార్‌రెడ్డి, దాసరి సువర్ణరాజు, ఏము కొండలరావు తదితరులకు థర్డ్ పార్టీ సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రివిజన్ పిటిషన్లను ప్రస్తుత పిల్‌కు జత చేయాలని దీనిపై ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేశాం.
న్యాయమైన, నిష్పక్షపాత దర్యాప్తు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కులో భాగం. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదని లేదా నిందితులకు అనుకూలంగా సాగిందని న్యాయస్థానం భావించినప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణకు ఆదేశించవచ్చు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులను ఇచ్చింది. చంద్రబాబు తదితరులపై నమోదైన కేసుల్లో ఈడీ 2023 సెప్టెంబర్ 14న విడుదల చేసిన ప్రకటనలో సుమారు రూ.70 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు, దుర్వినియోగం జరిగినట్లు పేర్కొంది.
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సరఫరాల పేరుతో షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులు మళ్లించినట్లు గతంలో ఈడీ వెల్లడించింది. ఇప్పుడు అదే ఈడీ ఈ వ్యవహారంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అఫిడవిట్‌లో పేర్కొనడం పరస్పర విరుద్ధమైన వైఖరి. ఫిర్యాదుదారుల నుంచి ఒత్తిడి తెచ్చి ఎన్‌ఓసీలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్లోజర్ రిపోర్టులు, వాటిని ఆమోదించిన ఉత్తర్వుల ప్రతులు కూడా కొందరు ఫిర్యాదుదారులకు అందలేదు. అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం అనేవి సమాజంపై విస్తృత ప్రభావం చూపుతాయి. ప్రజాధనాన్ని పరిరక్షించేందుకు హైకోర్టు జోక్యం చేసుకోవాలి. – పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు


