ప్రాదేశిక పోలింగ్‌లో మంత్రుల అరాచకం | Police took away agents and YSRCP leaders on the very night before polling | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక పోలింగ్‌లో మంత్రుల అరాచకం

Nov 6 2026 5:42 AM | Updated on Nov 6 2026 5:42 AM

Police took away agents and YSRCP leaders on the very night before polling

మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డిపైకి దౌర్జన్యంగా దూసుకెళ్తున్న మంత్రి ఆనం

ఆర్థిక మంత్రి పయ్యావుల నియోజకవర్గంలో స్టేషన్‌లో 50 మంది వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు

పోలింగ్‌కు ముందు రోజు రాత్రే ఏజెంట్లు, వైఎస్సార్‌సీపీ నాయకులను ఎత్తుకెళ్లిన పోలీసులు

మంత్రి అచ్చెన్న ఇలాకాలో ప్రతిపక్ష నాయకుల వేట

పరిటాల సునీత ఒత్తిడితో తెల్లవారుజామున అరెస్టులు

సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో ఓటర్లు వెనక్కి

పులివెందుల బూత్‌లలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి తిష్ట.. ఎంపీ అవినాష్‌కు మాత్రం అడ్డంకి

శ్రీకాకుళం కిష్టప్పపేటలో టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్‌ దాడి

శెట్టూరులో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని తనయుడి దండయాత్ర

చంద్రగిరిలో చెవిరెడ్డిని వెంటాడి ఎమ్మెల్యే సతీమణి ఓవరాక్షన్‌

సాక్షి, అమరావతి: ప్రజల మద్దతు కోల్పోయి, పరిషత్‌ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు సొంత నియోజకవర్గాల్లో అరాచకాలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకొని, అనుచరులతో రిగ్గింగ్‌ చేయించారు. అధికారాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పోలింగ్‌ బూత్‌ల దగ్గరికి వచ్చి గొడవలకు దిగారు. వారి కొడుకులు, భార్యలు పోలింగ్‌ కేంద్రాలను సొంత జాగీర్లలా మార్చే­శారు. పోలీసులు, అధికారుల సహాకారంతో చెలరేగి­పోయారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను భయాందోళనలకు గురిచేసి, వారిని బయటకు పంపేసి పోలింగ్‌ బూత్‌లను అక్రమించుకొ­న్నారు. భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. స్వేచ్ఛగా ఓటింగ్‌ జరిగితే సొంత నియోజకవర్గాల్లోనే పరువు పోతుందన్న భయం మంత్రుల­ను వెంటాడిందని, అందుకే ఓటరును నమ్ముకోకుండా పోలీసుల­ను, గూండాలను నమ్ముకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

ముందురోజు రాత్రే ప్రతిపక్షమంతా పోలీసు స్టేషన్‌కు
ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి మొదటి ఆయు­ధం పోలీసు యంత్రాగం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ నియోజకవర్గం అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో పోలింగ్‌కు ముందు రాత్రే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను స్టేషన్లకు తరలించారు. కూడేరు మండలంలోనే 50 మందికి పైగా ఏజెంట్లను బైండోవర్‌ పేరుతో రోజంతా స్టేషన్‌లోనే ఉంచారు. విడపనకల్లులో మండల కన్వీనర్‌ను అర్ధరాత్రి ఇంట్లోంచి లాక్కెళ్లారు. 

వైఎస్సార్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర్‌రెడ్డిని ఇంట్లోనే నిర్బంధించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ఒత్తిడితో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెల్లవారు­జామున మూడు గంటలకే పోలీసు వాహనాలు పల్లెల్లోకి దూసుకొచ్చాయి. పలు గ్రామాల్లోని వైఎస్సార్‌సీపీ నేతలను ఇళ్లలోంచి లాక్కెళ్లారు. టీడీపీ గూండాలు, రౌడీ­లు ఉదయం నుంచే రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రిగ్గింగ్‌ను ఆప­డానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌­రెడ్డిని దారిలోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

తిరుపతి రూరల్‌ మండలం సప్తగిరి కాలనీలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఫోన్‌ మాట్లాడుతుండగా... ఆయన వెంటే ఉంటానని చెబుతున్న పులివర్తి సుధారెడ్డి  

టెక్కలి–4 ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భర్త, మాజీ ఎంపీటీసీ కృష్ణను కాలర్‌ పట్టుకుని ఈడ్చుకెళ్తున్న సీఐ విజయకుమార్‌  

అచ్చెన్న నియోజకవర్గంలో రోజంతా వేట
మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేటాడారు. పోలింగ్‌ కేంద్రాలు, ఇళ్ల వద్ద ప్రతి కార్యకర్తనూ సీఐ విజయ్‌కుమార్‌ వెతికి మరీ పట్టుకున్నారు. మాజీ ఎంపీటీసీ శ్రీధర్‌రెడ్డిని, పోటీలో ఉన్న అభ్యర్థి కొడుకు పృథ్విని కూడా వదలలేదు. ఏజెంట్లను భయపెట్టి బయటకు పంపి సాయంత్రం వరకు యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేశారు. రిగ్గింగ్‌ను అడ్డుకోవడానికి వెళ్లినవాళ్లనే పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు.

గల్లీ నేత అవతారమెత్తిన మంత్రి ఆనం
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని చేజర్ల మండలంలో 10 గంటల తర్వాత వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు బూత్‌లలో ఉండకూడదని పోలీసులు ఆదేశించారు. ఏ చట్టం ప్రకారమని అడిగితే పైనుంచి ఆర్డర్‌ అని సమాధానమిచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గల్లీ నేతలా మారి పోలింగ్‌ బూత్‌ వద్ద చిల్లర గొడవకు దిగారు. మరో మంత్రి సవిత నియోజకవర్గం పెనుకొండ పరిధిలోని గోరంట్లలో ఒక సీఐ వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై పడి మహిళలను బూతులు తిట్టాడు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు గంట్యాడలోని బూత్‌ల దగ్గరే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారు.

సీఎం సొంత గడ్డపైనా అదే తీరు
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలోనూ ఓటరుకు స్వేచ్ఛ దొరకలేదు. నాయనూరులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ఎవరినీ బూత్‌ల దగ్గరికే రానివ్వలేదు. దీంతో పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన వాళ్లు ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారు. రామకుప్పం బొమ్మనపల్లిలో కూడా ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారు.

కళ్యాణదుర్గంలో తండ్రీకొడుకుల రౌడీ జోడి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కొడుకు యశ్వంత్‌ రౌడీ జోడీ అన్నట్లుగా చెలరేగిపోయారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద రోజంతా హంగామా సృష్టిస్తూనే ఉన్నారు. ఉదయాన్నే ఎమ్మెల్యే సురేంద్రబాబు హడావుడి చేయగా, ఆయన కొడుకు యశ్వంత్‌ ఏ పదవీ లేకపోయినా అనుచరులతో శెట్టూరు, చింతర్లపల్లి, కనుకూరు బూత్‌ల్లోకి దూసుకెళ్లి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కొట్టాడు. వీరి దాడులతో గంటల తరబడి ఆ పల్లెలు అట్టుడికాయి. కొడుకు పని ముగించాక మధ్యాహ్నం తండ్రి వంతు వచ్చింది. కుందుర్తి మండలం బెస్తరపల్లిలో బూత్‌ చూడడానికి వచ్చిన ఎమ్మెల్యే స్వయంగా వైఎస్సార్‌సీపీ నేతలతో కొట్లాటకు దిగారు. 

పులివర్తి సతీమణి ఓవరాక్షన్‌
తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి ఏ పదవీ లేకపోయినా పోలింగ్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. నియోజకవర్గంలో దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్పడుతున్న టీడీపీ వారిని అడ్డుకుంటున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అడ్డు తగిలారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వెనకాలే వెళ్లారు. ‘మీరెక్కడికి వెళ్తే నేనూ అక్కడికే. కావాలంటే మీ కారులోనే వస్తా‘ అంటూ ఆయన్ని వెంటాడారు. ఆమె బయట హంగామా చేస్తుంటే లోపల టీడీపీ గూండాలు దొంగ ఓట్లు వేసుకున్నారు. 

అభ్యర్థుల భర్తలు సైతం
మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. కూటమి అభ్యర్థుల భర్తలు కూడా బూత్‌లను సొంత అడ్డాలుగా మార్చుకున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో కూటమి అభ్యర్థి భర్త మారూరి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బూత్‌ దగ్గరే హల్‌చల్‌ చేశాడు. మధ్యాహ్నానికి అదే బూత్‌లో అభ్యర్థులను, మీడియాను బయటే ఆపేసి లోపల రిగ్గింగ్‌ చేశారు. పిడుగురాళ్ల మండలం జానపాడులో కూటమి అభ్యర్థి భర్త నాగమల్లికార్జునరావు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌ల్లోంచి గెంటేశాడు. ఆ తర్వాత రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

ఎంపీకి అడ్డు.. ఎమ్మెల్సీకి దారి
అధికార దుర్వినియోగం ఎంతలా బరితెగించిందో పులివెందులలో స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్‌ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి పార్నపల్లె బూత్‌ల దగ్గరే తిష్ట వేశారు. ఆయన తమ్ముడు భరత్‌ వంద మందితో కామసముద్రం బూత్‌ల ముందు నిలబడి ఓటర్లను అడ్డుకున్నాడు. అదే సమయంలో పరిస్థితిని  చూడడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని డీఎస్పీ రోడ్డుపైనే ఆపేశారు.

టీడీపీ ఎమ్మెల్యేల రౌడీ అవతారం 
మంత్రులు పోలీసులతో పని కానిస్తే, కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ సొంత గ్రామం కిష్టప్పపేటలో క్యూ­లో నిలబడిన ఓటర్లనే టీడీపీకి ఓటేయ­మని దబాయించారు. ప్రశ్నించిన వైఎస్సా­ర్‌సీపీ నేత బన్న నరసింగరావుపై చేయి చేసుకు­న్నారు. ఎంపీటీసీ అభ్యర్థి రుప్ప దివ్యను ‘బూత్‌ దాటి బయటకు రాలేవు‘ అని బెదిరించారు. ఓటర్లకు రక్షణ కల్పించాల్సిన ప్రజాప్రతినిధే ఓటర్ల ముందు దౌర్జన్యానికి దిగడంపై గ్రామస్తులు మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement