శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మహిళపై లాఠీతో దాడి చేస్తున్న ఎస్సై
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు
ఓటు హక్కును కాలరాసిన కూటమి కాలకేయులు
పరిషత్ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. ఊరూరా దమనకాండ
తెల్లవారుజాము నుంచే దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డ పచ్చమూక
కూటమి నేతల అక్రమాలకు పోలీసుల వత్తాసు
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పలుచోట్ల స్వయంగా అడ్డుకున్న పోలీసులు
పోలింగ్ బూత్‌లలో ఉన్న ఏజెంట్లను తరిమికొట్టిన టీడీపీ రౌడీలు
టీడీపీ మూకల ఆధీనంలోకి పోలింగ్ బూత్‌లు.. ఆపై యథేచ్ఛగా రిగ్గింగ్
రౌడీలుగా మారిన పచ్చ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు
గ్రేటర్ రాయలసీమ, శ్రీకాకుళం, తదితర జిల్లాల్లో ఎన్నికల హక్కుపై దాడి
తిరుపతి జిల్లా నల్లపురెడ్డిపల్లె, వైఎస్సార్ జిల్లా ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబులతో దాడి
రాళ్లు, కర్రలు, సీసాలతో విరుచుకుపడిన టీడీపీ మూకలు
ప్రేక్షక పాత్రలో పోలీసులు.. ప్రతిపక్ష నేతలపైనే తప్పుడు కేసులు
కూటమి ఎన్నికల అక్రమాలకు అడుగడుగునా వత్తాసు పలికిన ఎస్‌ఈసీ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయక చంద్రబాబు మార్కు రాక్షస రాజకీయం రాష్ట్రంలో మరోసారి కరాళ నృత్యం చేసింది. టీడీపీ కూటమి కాలకేయులు ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ వికటాట్టహాసం చేశారు. వెల్లువెత్తుతున్న తీవ్ర ప్రజా వ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న చంద్రబాబు స్థానిక ఎన్నికలపై పచ్చమూకతో దండయాత్ర చేయించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ సాక్షిగా రాష్ట్రంలో ఆటవిక నీతి రాజ్యమేలింది. దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ కూటమి గూండాలు బీభత్సం సృష్టించారు.
ఓటర్లపై దాడులు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజంట్లపై దాడులు.. కిడ్నాపులు.. ఓటర్లపై దౌర్జన్యాలు.. పోలింగ్ బూత్‌ల ఆక్రమణలు.. దొంగ ఓట్లు వేస్తూ యథేచ్చగా రిగ్గింగ్.. కూటమి ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, నేతలే గూండాగిరీతో బరితెగింపు... ఇలా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కోసం గురువారం నిర్వహించిన స్థానిక ఎన్నికల పోలింగ్‌లో ఎక్కడికక్కడ దౌర్జన్యానిదే పైచేయి అయ్యింది. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సాగిన ఈ అరాచక కాండకు యావత్ అధికార యంత్రాంగం వత్తాసు పలికింది. పచ్చ చొక్కాలు, కండువాలు ధరించలేదు తప్ప ఖాకీలు టీడీపీ కార్యకర్తలను మించి ఊడిగం చేశారు. ఎన్నికల అక్రమాలకు పహారా కాశారు. యావత్ అధికార యంత్రాంగం కూటమి అక్రమాలకు వత్తాసు పలికింది.

వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన మండలం వంకమర్రిలో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ నేత
పక్కాగా పచ్చ కుతంత్రం అమలు
చంద్రబాబు శకుని పన్నాగాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీతోపాటు యావత్ పోలీసు, అధికార యంత్రాంగం నిస్సిగ్గుగా అమలు చేశాయి. అందుకోసం ముందస్తుగానే కుట్రకు సిద్ధపడ్డాయి. 7,762 ఎంపీటీసీ, 582 జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ గూండాలు, రౌడీ మూకలు, గంజాయి బ్యాచ్‌లు, ఇతర రాష్ట్రాల నుంచి రప్పించిన అసాంఘిక శక్తులను బుధవారం సాయంత్రానికే మోహరించారు. గురువారం తెల్లవారుజాము నుంచే పచ్చ కుతంత్రాన్ని పక్కాగా అమలు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అసలు పోలింగ్ కేంద్రాలకే వెళ్లనివ్వకుండా పోలీసులే ఆటంకాలు సృష్టించారు.
తెల్లవారుజామునే వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజంట్లను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. దాంతో రాష్ట్రంలో మెజార్టీ పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజంట్లు లేకుండానే పోలింగ్ మొదలైంది. శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకు ఇదే దుస్థితి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఇదే మొదటిసారని పరిశీలకులు వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ కూటమి అక్రమాలను ప్రశ్నించిన, ప్రశ్నిస్తారని భావించిన వైఎస్సార్‌సీపీ కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా, మండల స్థాయి నేతలు.. అందర్నీ ముందుగానే హౌస్ అరెస్టు చేశారు.
పోలీసుల షాడో పార్టీలతో వారిని కట్టడి చేశారు. పెద్ద సంఖ్యలో నేతలను బలవంతంగా ఈడ్చుకుపోయారు. వైఎస్సార్‌సీపీ ఓటర్లతోపాటు తటస్థ ఓటర్లు కూడా పోలింగ్‌కు రాకుండా భయభ్రాంతులకు గురి చేశారు. ఓటర్ల చేతుల్లోని స్లిప్పులను బలవంతంగా తీసుకుని చింపి వేసి వెనక్కి పంపించి వేశారు. టీడీపీ కూటమి రౌడీ మూకలు గ్రామాల్లో బరితెగించి దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డాయి. ప్రజాతీర్పునకు ప్రతీక అయిన బ్యాలెట్ పేపర్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.
కోర్టు ఆదేశాలంటే కూడా లెక్కలేనితనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపించాయి. నామినేషన్ల దశ నుంచి ప్రచారం, పోలింగ్ వరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ఓటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు, దౌర్జన్యాలు సాగాయి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాల్సిన చోట అధికార పార్టీకి చెందిన మూకల బల ప్రదర్శన, పోలీసుల పక్షపాత వైఖరి ప్రజాస్వామ్యానికే సవాలుగా మారాయి.
నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థులను బెదిరించడం, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులతో నిర్బంధించడం వంటి చర్యలతో ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచే ప్రభావితం చేశారు. నామినేషన్ కేంద్రాల నుంచి పోలింగ్ వరకు పటిష్ట భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదు. దాడులు, దౌర్జన్యాలు జరిగిన చోట్ల కేంద్ర బలగాల పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది.
వైఎస్సార్ కడప జిల్లాలో దౌర్జన్యకాండ
» వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు బయటి నుంచి వచ్చిన అల్లరిమూకలతో వేముల, పులివెందుల, లింగాల మండలాలల్లో ఏకపక్ష పోలింగ్ చేయించుకున్నారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డగించారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెళ్తే, డీఎస్పీ మురళీనాయక్ అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట, సంజీవరెడ్డిపల్లె గ్రామాల ఓటర్లు ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించారు.
» పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ కూటమి అరాచకం అడ్డూ అదుపూ లేకుండా సాగింది. టీడీపీ గూండాలు ఏకంగా పెట్రోల్ బాంబులతో బీభత్సం సృష్టించడం విభ్రాంతి కలిగించింది. పులివెందుల మండలం ఎర్రిపల్లెలో వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు పెట్రోల్ బాంబులు వేశారు. ఈ దాడిలో సామాన్య ప్రజలు కూడా గాయపడ్డారు.
పోలీసుల సాక్షిగా దాడులు, రిగ్గింగ్
» టెక్కలిలో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్ బూత్ ఏజంట్లపై దాడి చేసి బయటకు పంపి వేశారు. అనంతరం రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. టెక్కలి ఎంపీటీసీ–4లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మామిడి జ్యోతి భర్త కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
» శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ స్వయంగా రౌడీయిజం చేయడం విస్మయపరిచింది. కృష్ణప్పపేటలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేత బాన్న నరసింగరావుపై టీడీపీ ఎమ్మెల్యే శంకర్ దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దుప్ప దివ్యపట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలింగ్ బూత్ దాటి బయటకు రాలేవని బెదిరించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు రాళ్లతో దాడి చేశారు. పోలాకి మండలంలో టీడీపీ తరఫున రంగంలోకి దిగిన గంజాయి బ్యాచ్‌లకు పోలీసులు దన్నుగా నిలిచారు. మబగాంలో ఇప్పిలి సాయి అనే వ్యక్తికి పోలీసులు తమ లాఠీ ఇచ్చి మరీ పోలింగ్ కేంద్రంలోకి పంపించడం విస్మయ పరిచింది.
» పిఠాపురం నియోజకవర్గంలో కూటమి అరాచకం యథేచ్ఛగా సాగింది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లనే జనసేన నేతలు బెదిరించి బెంబేలెత్తించారు. గ్లాస్ గుర్తుకు ఓటు వేయకపోతే అంతు చూస్తామని పిఠాపురం మండలం మంగితుర్తిలో బహిరంగంగానే బెదిరించారు.
» నెల్లూరు జిల్లాలో టీడీపీ అరాచకాలకు పోలీసులు నిస్సిగ్గుగా వత్తాసు పలికారు. పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని సీఐ గంగాధర్ అడ్డుకోవడం విస్మయ పరిచింది. విక్రమ్ రెడ్డి వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి మరీ అడ్డుకోవడం గమనార్హం. నెల్లూరు జిల్లా ఉదయగిరి, బండగానిపల్లిలో టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు మాత్రం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం గమనార్హం.
» పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని కత్తులకవిటి పోలింగ్ కేంద్రం వద్ద పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గురువారం ఓ వీధి రౌడీలా వ్యవహరించారు. పోలింగ్ స్టేషన్ 39లో ఏజెంట్లుగా ఉన్న గొల్ల రమేష్, పక్కి కిరణ్‌కుమార్, గేదెల సుదర్శనరావుపై దౌర్జన్యానికి దిగి చేయి చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఆపేసి, చంపేస్తానని బెదిరించారని వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజంట్లు, అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
» మంత్రి సత్య కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరంలో కూటమి నేతలు బరితెగించారు. ఆయన ప్రధాన అనుచరుడు ఆదినారాయణ యాదవ్ ముదిగుబ్బ పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
» రాప్తాడు నియోజకవర్గం తగరకుంటలో టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అడ్డుకున్నారు. తద్వారా టీడీపీ రిగ్గింగ్‌కు పోలీసులు కొమ్ము కాశారు.
» గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
» బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయాణంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజంట్లపై టీడీపీ గూండాలు దాడి చేసి బయటకు తరిమేశారు. అనంతరం ఏకపక్షంగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.
» కర్నూలు జిల్లాలో టీడీపీ గూండాల దాడులతో ఏకంగా పోలింగ్ నిలిచిపోయింది. కోసిగి మండలం ఆర్లబండలో టీడీపీ నేతలు రిగ్గింగ్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి రెండున్నర గంటలపాటు పోలింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. అనంతరం మళ్లీ పోలింగ్ పునఃప్రారంభించారు.
» ప్రకాశం జిల్లాలో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయకుండా దాడులకు పాల్పడ్డారు. అయినా సరే పోలీసులు మాత్రం టీడీపీ గుండాగిరికే వత్తాసు పలికారు. దాంతో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఇతర నేతలు అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
» కల్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమారుడు యశ్వంత్ గుండాగిరితో హల్‌చల్ చేశారు. కొందరు రౌడీలతో కలసి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు.
» ఉరవకొండలో పోలీసులే స్వయంగా టీడీపీకి అనుకూలంగా రిగ్గింగ్ చేయడం విస్మయ పరిచింది. మరుట్లలో సీఐ రాజు దగ్గరుండీ రిగ్గింగ్ చేయించడాన్ని ప్రజలు ప్రశ్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు.
» చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ పీఏ కుమార స్వామి హల్‌చల్ చేశారు. వైఎస్సార్‌సీపీ తరపున ఏజంట్లుగా కూర్చుంటే చంపి తీరుతామని బెదిరించారు. వందల మంది రౌడీలను దించి అంతుచూస్తానన్నారు.
» నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరం పోలింగ్ బూత్‌లో ఎస్‌ఐ బలరామరెడ్డి స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ చొక్కా పట్టుకొని లాక్కొచ్చి బయటకు నెట్టేశారు. దీంతో అక్కడ రిగ్గింగ్‌కు నేరుగా సహకరించారు. మర్రిపాడులో ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డిని సీఐ గంగాధర్ అడ్డుకున్నారు.
» తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరులో జనసేన, టీడీపీ నాయకులు కలిసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా దర్శి, కనిగిరి, కందుకూరు, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో టీడీపీ రౌడీలు వీరంగం సృష్టించారు. ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, నానా బీభత్సం సృష్టించారు. వీరికి పోలీసులు తోడుగా నిలిచారు.
» శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కూటమి నేతలు దౌర్జన్యాలకు దిగుతూ రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. హిందూపురం ప్రాంతంలో బాలకృష్ణ అనుచరులు, పెనుకొండ ప్రాంతంలో మంత్రి సవిత అనుచరులు, రాప్తాడు ప్రాంతంలో పరిటాల సునీత అనుచరులు, ధర్మవరం ప్రాంతంలో మంత్రి సత్యకుమార్ వర్గీయులు దౌర్జన్యం చేసి దొంగ ఓట్లు వేసుకున్నారు. చిలమత్తూరులో టీడీపీ గూండాల అరాచకాలను వీడియో తీస్తుండగా సాక్షి విలేకరిని హిందూపురం డీఎస్పీ రవిబాబు బెదిరించాడు.
» తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు పొట్టి రవి భారీ సంఖ్యలో వాహనాల్లో రౌడీలతో వెళ్లి పెద్దవడుగూరు, యాడికి మండలాల్లోని పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ చేయించాడు.
ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తానన్నందుకు హత్యాయత్నం
అనకాపల్లి జిల్లా రమణయ్యపేటకు చెందిన కూనిశెట్టి అనిల్ గురువారం ఉదయం రమణయ్యపేటలో పోలింగ్ బూత్‌కు సమీపంలో కూర్చొన్నాడు. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కర్రి స్వామి వచ్చి నువ్వు ఏ పార్టీకి ఓటు వేస్తావని ప్రశ్నించాడు. తాను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తానని అనిల్ చెప్పాడు. వెంటనే మాంసం విక్రయించే ఓ వ్యక్తి వద్ద ఉన్న కత్తి లాక్కొని అనిల్‌ను చంపడానికి ప్రయత్నించాడు. బాధితుడు చెయ్యి అడ్డం పెట్టడంతో అతని చేతివేళ్లు తెగిపోవడంతోపాటు, తలపై గాయమయింది.
విలేకరులపై దాడులు
పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లె మండలం పట్నం పంచాయతీలో టీడీపీ ఎమ్మెల్యే మురళిమోహన్ అనుచరులు దొంగ ఓట్లు వేస్తుంటే సాక్షి విలేకరి జగన్నాధం తన మొబైల్ ద్వారా ఫోటోలు తీశారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ మూకలు ఆయనపై పిడిగుద్దులుతో దాడి చేశారు. ఫోన్‌ను ధ్వంసం చేశారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం ఇప్పెంట పోలింగ్ కేంద్రం వద్ద సాక్షి విలేకరి పుల్లారెడ్డిపై టీడీపీ మూకలు దాడి చేశాయి. ఆయన సెల్‌ఫోన్ ధ్వంసం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఆకాశలక్కవరంలో బూత్‌లో జరుగుతున్న దౌర్జన్యాన్ని చిత్రీకరిస్తున్న విలేకరుల ఫోన్లు లాక్కుని దాడికి ప్రయత్నించారు.
బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లిన టీడీపీ గూండాలు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలోని గంగవరం పోలింగ్ బూత్–5లో మొత్తం ఓటర్లు 879 మంది ఉండగా, సాయంత్రం 5 గంటలకు 536 ఓట్లు పోల్ అయ్యాయి. బాక్స్‌కు సీల్ వేసే సమయంలో 30 మంది టీడీపీ గూండాలు బూత్‌లోకి చొరబడి బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లారు. సిబ్బంది దగ్గర ఉన్న సంతకం చేసిన బ్యాలెట్ పేపర్లు 50కి పైగా లాక్కొని.. వాటి మీదున్న గ్లాసు గుర్తుపై ఓటు వేసి.. వాటిని బ్యాలెట్ బ్యాక్స్‌లో వేశాక తిరిగి తెచ్చిచ్చారు.
చంద్రగిరిలో ఎల్లో గ్యాంగ్ బీభత్సం
చంద్రగిరిలోని ఓటేరు, సాయినగర్, లింగేశ్వర్ నగర్, తిరుచానూరు, మంగళం పరిధిలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో తిష్టవేసి ఉన్న వందలాది మంది దొంగ ఓటర్లు ఉన్న ప్రాంతాలకు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నియోజక వర్గ సమన్వయకర్త మోహిత్‌రెడ్డి చేరుకుని గుంపులు గుంపులుగా ఉన్న యువకులు, మహిళలను ప్రశ్నించారు. వారి వివరాలు అడుగుతూ.. వీడియోలు, ఫోటోలు తీస్తుండటంతో వారు పరుగులు తీశారు.


