అరెస్ట్‌ పేరుతో అక్రమ నిర్బంధం కుదరదు | Illegal detention under the guise of an arrest is not permissible says Supreme Court | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌ పేరుతో అక్రమ నిర్బంధం కుదరదు

Nov 6 2026 5:16 AM | Updated on Nov 6 2026 5:16 AM

Illegal detention under the guise of an arrest is not permissible says Supreme Court

అక్రమ నిర్బంధం రాజ్యాంగ ఉల్లంఘనే.. 

అలాంటి చర్యలతో వ్యక్తి ప్రాథమిక హక్కులకు విఘాతం 

పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. అరెస్ట్‌–నిర్బంధం వేర్వేరు కాదు 

నిందితుడిని అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల గడువు ప్రారంభం 

ఆ గడువులోపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి 

లేదంటే తక్షణమే కస్టడీ నుంచి విడుదల చేయాలి

ఆర్టికల్‌ 22(2), బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 58 అమలుపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు

ఏ కారణంతోనూ పోలీసులు అదనపు సమయాన్ని తీసుకోవడానికి వీల్లేదు 
ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత 24 గంటలు దాటినా మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచని పక్షంలో ఆ వ్యక్తిని తక్షణమే కస్టడీ నుంచి విడుదల చేయాలి. ఈ గడువును లెక్కించేటప్పుడు అరెస్టు చేసిన ప్రదేశం నుంచి కోర్టుకు తీసుకెళ్లేందుకు పట్టే ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించాలి.  దర్యాప్తు పేరుతోనో, ఇతర కారణాలు చూపుతూనో పోలీసు అధికారులు అదనపు సమయాన్ని తీసుకోవడానికి ఏమాత్రం వీల్లేదు.

నిందితుల హక్కులను కాపాడటంలో మేజిస్ట్రేట్లదే కీలకపాత్ర  
నిందితుల హక్కులను కాపాడే విషయంలో కింది కోర్టుల మేజిస్ట్రేట్లదే కీలక బాధ్యత. పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచినప్పుడు.. వారిని వాస్తవంగా ఏ తేదీ, ఏ సమయంలో అదుపులోకి తీసుకున్నారో మేజిస్ట్రేట్‌ తప్పనిసరిగా రికార్డుల్లో నమోదు చేయాలి.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(2) నిబంధనలు.. ఉల్లంఘనకు గురయ్యాయా లేదా అన్నది ప్రాథమికంగా నిర్ధారించుకోవాలి.  

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు.. అర్ధరాత్రి అరెస్టులు.. రోజుల తరబడి పోలీస్‌స్టేషన్లలో నిర్బంధాలు.. ఆ తర్వాత లాంఛనంగా అరెస్టు చూపించి కోర్టుల్లో హాజరుపరుస్తున్న పోలీసుల తీరుకు సుప్రీంకోర్టు చెక్‌పెట్టింది. అరెస్టు, నిర్బంధం వేర్వేరు కాదని, ఈ రెండింటి మధ్య కృత్రిమ వ్యత్యాసాన్ని చూపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.  ఒక వ్యక్తిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న క్షణమే అరెస్టుగా పరిగణించాలని, అప్పటి నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

నిందితుడు స్వేచ్ఛను కోల్పోయి, వాస్తవంగా పోలీసుల అదుపులోకి వెళ్లిన (నిర్బంధించిన) క్షణం నుంచే ఈ సమయాన్ని లెక్కించాలని ఆదేశించింది. రికార్డుల్లో అరెస్టు సమయాన్ని ఆలస్యంగా నమోదు చేసి వ్యక్తి ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగ నిబంధనల నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పింది. 24 గంటల్లో మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచకపోతే తక్షణమే విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ‘సుజిత్‌ దాస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం, ఈ వ్యాజ్యానికి సంబంధించి త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ  సంచలన తీర్పును వెలువరించింది.

 తాజా తీర్పుతో పోలీసుల నిర్బంధ ప్రక్రియ, నిందితుల ప్రాథమిక హక్కుల పరిరక్షణపై అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించినట్లయింది. దేశవ్యాప్తంగా పోలీసుల నిర్బంధ అధికారాలకు కళ్లెం వేయడంతోపాటు,  ముఖ్యంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి బానిసలుగా మారి రాజకీయ ప్రత్యర్థుల అక్రమ అరెస్టుల విషయంలో దేశంలోనే ముందున్న ఏపీ పోలీసులకు సైతం ఈ తీర్పు గట్టి హెచ్చరికగా మారింది.  

ప్రాథమిక హక్కులకు లోబడే కఠినమైన బెయిల్‌ నిబంధనలు  
ఈ కేసులో నిందితులను పోలీసులు దాదాపు 18 గంటల పాటు ఎలాంటి న్యాయపరమైన పర్యవేక్షణ లేకుండా నిర్బంధంలో ఉంచడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇది ఆర్టికల్‌ 22(2)తో పాటు బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 58 ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. ఎన్‌డీపీఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌) చట్టంలోని సెక్షన్‌ 37 కింద ఉండే కఠినమైన బెయిల్‌ నిబంధనలు సైతం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అధిగమించలేవని స్పష్టంచేసింది. కస్టోడియల్‌ హింస నివారణకు గాను సరైన న్యాయపరమైన పర్యవేక్షణ ఉండటం అత్యంత అవసరమని స్పష్టంచేసింది ఈ తీర్పును దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన రిపోర్టబుల్‌ తీర్పుగా ప్రకటించింది. ఈ కేసులో నలుగురు నిందితులను తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది.  

ఆ హైకోర్టుల తీర్పులు చెల్లవు 
ఈ అంశంపై తాజాగా త్రిపుర హైకోర్టుతోపాటు గతంలో వివిధ రాష్ట్రాల న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా కొట్టివేసింది.  ముఖ్యంగా ఒడిశా హైకోర్టు (అర్యమ పట్నాయక్‌ కేసు), మద్రాస్‌ హైకోర్టు (కణ్ణన్‌ కేసు), కేరళ హైకోర్టు (అరుణ్‌ కే థామస్‌ కేసు) ఇచ్చిన తీర్పులు ఆర్టికల్‌ 22(2)కి సరైన భాష్యం చెప్పలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా హైకోర్టుల చట్టపరమైన వివరణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.   ‘ఆర్టికల్‌ 22(2) ప్రకారం 24 గంటల గడువు.. సోదాలు, స్వాధీన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ప్రారంభమవుతుందని, అరెస్టు చేసిన అధికార యంత్రాంగం రికార్డుల్లో అరెస్టు సమయంగా పేర్కొన్నప్పటి నుంచే ఈ గడువు లెక్కించాలని చెప్పడం చట్టపరంగా ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అంతేకాకుండా, అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement