పదేపదే నిరసనలు.. రాహుల్‌కు వ్యాపారుల సంఘం 5 ప్రశ్నలు | Traders body write lettter to Rahul Gandhi | Sakshi
Sakshi News home page

పదేపదే నిరసనలు.. రాహుల్‌కు వ్యాపారుల సంఘం 5 ప్రశ్నలు

Nov 5 2026 9:42 PM | Updated on Nov 5 2026 9:42 PM

Traders body write lettter to Rahul Gandhi

ఢిల్లీలో రాజకీయ ర్యాలీలు, నిరసనలు, ఆందోళనల వల్ల వ్యాపార కార్యకలాపాలు పదేపదే దెబ్బతింటున్నాయని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఐదు ప్రశ్నలు సంధించింది. నిరసన తెలిపే హక్కు పేరుతో ఇతరుల జీవనోపాధిని దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భర్తియా రాహుల్ గాంధీకి ఘాటైన లేఖ రాశారు.

గత నెల రోజులుగా దేశ రాజధానిలో జరిగిన రాజకీయ ప్రదర్శనల వల్ల వ్యాపారులు, దుకాణదారులు ఆర్థికంగా నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా నవంబర్ 1న కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీతో పాటు, వివిధ సంస్థలు నిర్వహించిన నిరసనలకు కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పండుగలు, పెళ్లిళ్ల కొనుగోళ్లకు కీలకమైన సమయంలో ఈ ఆందోళనల వల్ల మార్కెట్లకు వచ్చే వినియోగదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది.

స్థానిక మార్కెట్లలో కొనుగోళ్లు చేయాలని రాహుల్ గాంధీ ఒకవైపు ప్రజలకు పిలుపునిస్తూనే, మరోవైపు వినియోగదారులు మార్కెట్లకు చేరుకోలేని పరిస్థితులు సృష్టించే నిరసనలకు మద్దతు ఇస్తున్నారని భర్తియా విమర్శించారు. ఇది సాధారణ వ్యాపారుల జీవనోపాధిని నేరుగా దెబ్బతీసే విరుద్ధ వైఖరి అని పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని 19(1)(a), 19(1)(g) అధికరణలను ప్రస్తావిస్తూ.. భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు వృత్తి, వ్యాపారం చేసుకునే హక్కులకు కూడా సమాన ప్రాధాన్యం ఉందని సీఏఐటీ గుర్తుచేసింది. చిన్న వ్యాపారులు, దుకాణదారులు, వీధి వ్యాపారులు, రోజువారీ సంపాదనపై ఆధారపడే కుటుంబాల హక్కులను రాజకీయ నాయకులు విస్మరించకూడదని పేర్కొంది.

రాహుల్ గాంధీకి ఐదు ప్రశ్నలు
1. నిరసన తెలిపే హక్కు.. వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందే హక్కు కంటే ముఖ్యమైనదా?
2. దేశ రాజధాని వాణిజ్య కార్యకలాపాలను స్తంభింపజేయడం రాజకీయంగా, నైతికంగా సమర్థనీయమేనా? నష్టపోయిన వ్యాపారులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు?
3. స్థానిక మార్కెట్లలో కొనుగోళ్లు చేయాలని ప్రజలను కోరుతూ, అదే మార్కెట్లకు వినియోగదారులు వెళ్లకుండా చేసే నిరసనలకు ఎలా మద్దతు ఇస్తారు?
4. తాము మద్దతు ఇచ్చిన నిరసనల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బాధ్యత వహిస్తాయా?
5. తన సొంత వ్యాపారం, జీవనోపాధి లేదా రోజువారీ ఆదాయంపై ఇలాంటి దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే రాహుల్ గాంధీ అంగీకరిస్తారా?

దేశవ్యాప్తంగా ధిక్కార దినం
రాహుల్ గాంధీ లేఖకు ఇచ్చే సమాధానం కోసం ఎదురుచూస్తామని సీఏఐటీ తెలిపింది. అయితే దీపావళి తర్వాత ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార నాయకులతో జాతీయస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఈ సమస్యపై దేశవ్యాప్తంగా 'ధిక్కార దినం' నిర్వహించాలని నిర్ణయించింది. దాని తేదీని సమావేశంలో ఖరారు చేయనుంది.

రాజకీయ నిరసనలకు వ్యతిరేకం కాదని, అవి ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న హక్కు అని సీఏఐటీ స్పష్టం చేసింది. అయితే ఆ హక్కును వినియోగించుకునే క్రమంలో ఇతరుల వ్యాపారాలు, ఉద్యోగాలు, జీవనోపాధికి ఆటంకం కలిగించకూడదని పేర్కొంది. భారత వ్యాపారులు దేశీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా, ఉపాధి కల్పనలో కీలక భాగస్వాములుగా ఉన్నారని భర్తియా అన్నారు. ఢిల్లీలో ఎదురైన పరిస్థితులు ఇతర నగరాల్లోనూ తలెత్తే అవకాశం ఉన్నందున ఈ సమస్యను జాతీయస్థాయిలో చూడాలని సీఏఐటీ అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement