అభిప్రాయం
ప్రతి అర్హతగల పౌరుడు ఓటు వేయ గలడనీ, ఆ ఓటుకు తగిన విలువ ఉంటుందనీ ప్రజలు నమ్మినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఓటరు జాబితాల్లో తప్పులు, పారదర్శకత లోపించిన విధా నాలు, పక్షపాతం ఉండవచ్చన్న ఆందోళ నలు చాలామందిలో పెరుగుతున్నాయి. ఓటరు జాబితాలో తమ పేర్లు కనిపించక పోవడం, ప్రశ్నలకు స్పష్టమైన సమాధా నాలు రాకపోవడం ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకాన్ని దెబ్బ తీస్తాయి. ఈ ఆందోళనలపై పారదర్శకంగా విచారణ జరిపి, న్యాయ మైన సమాధానం ఇవ్వాలి.
ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఈ అంశాన్ని జాతీయ చర్చలో కేంద్రస్థానానికి తీసుకొచ్చాయి. అక్టోబర్ 12న రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు వేలాదిగా సుప్రీంకోర్టు వైపు పాదయాత్ర చేశారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిరసన తెలుపుతూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు.
మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్‌లతో పాటు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టుకు చేరకముందే పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. తదనంతరం నేతలు కోర్టు ప్రాంగ ణానికి చేరుకున్నారు. ఓటరు జాబితాల సవరణలోని అంశాలను సవాలు చేస్తూ ఉమ్మడి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఎన్నికల సంఘం, కమిషనర్ల నుంచి సుప్రీంకోర్టు వివరణ కోరింది. విచారణ ఇంకా కొనసాగుతోంది.
అక్టోబర్ 31న జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి ప్రతీకా త్మక ‘ప్రజా అభిశంసన’ కార్యక్రమాన్ని నిర్వహించింది. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఆరు ఆరోపణలను పేర్కొంటూ మల్లికార్జున ఖర్గే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నేతలు, పౌరసమాజ ప్రతినిధులు చేతులెత్తి ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఇది రాజకీయ నిరసన కార్యక్రమం మాత్రమే; రాజ్యాంగ ప్రకారం జరిగే అధికారిక అభిశంసన ప్రక్రియ కాదు. మరుసటి రోజు కూటమి రామ్‌లీలా మైదాన్ వరకూ పాదయాత్ర చేసి, భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఎన్నికల జవాబుదారీతనం కోసం సాగు తున్న తమ పోరాటాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లింది.
ఈ పరిణామాలు ప్రజల ఆందోళనలను ఇండియా కూటమి తీవ్రంగా పరిగణిస్తోందనీ, రాజకీయ సమీకరణతో పాటు న్యాయ పరమైన మార్గాల్లోనూ పోరాడుతోందనీ చూపిస్తున్నాయి. నకిలీ, అనర్హమైన పేర్లను తొలగించడమే ‘సర్’లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే అర్హులైన ఓటర్లు తొలగిపోకుండా చూడటం, తప్పులను సరిచేసుకునే అవకాశం కల్పించడం, ప్రక్రియను పార దర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ప్రజల విశ్వాసం పొందాలంటే స్పష్టమైన సమాధానాలు, జవాబు దారీతనం అవసరం. ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రజాస్వా మ్యంపై దాడి కాదు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో అది భాగం.
ఢిల్లీలో జరిగిన ఈ ఉద్యమం స్థాయి, తీవ్రత భారత ప్రజాస్వా మ్యానికి ఒక కీలక మలుపుగా నిలవవచ్చు. ఇంతకాలం తమ ఆందో ళనలను మౌనంగా భరించిన ప్రజల తరఫున ఇప్పుడు బలంగా, సమష్టిగా స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ పోరాటంలో ఇండియా కూటమి కీలక భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం స్పష్టం: ప్రతి ఓటును కాపాడటం, రాజ్యాంగ విలువలను నిలబెట్టడం, ప్రతి సంస్థ ప్రజల విశ్వాసాన్ని పొందేలా చూడటం.
- కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యాసకర్త, నీటిపారుదల, ఆహార – పౌరసరఫరాల శాఖల మంత్రి, తెలంగాణ ప్రభుత్వం
ఇదీ చదవండి: వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు


