అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ఐదు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ఇందులో కేంద్ర ప్రభుత్వం సహాయం రూ.873.49 కోట్లు
ఇప్పటివరకు 8 ప్రాజెక్టులకు రూ.9,573 కోట్ల అనుమతులు
హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, అలంపూర్ పట్టణాల్లో అభివృద్ధి పనులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి చెందిన ఐదు ప్రాజెక్టులకు రూ.3,892.38 కోట్లతో ఆమోదం తెలిపింది. ఇందులో రూ.873.49 కోట్లను కేంద్ర ప్రభుత్వ సహాయంగా అందించనుంది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 3 మంగళవారం జరిగిన నాలుగో జాతీయ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో హైదరాబాద్ మహానగరానికి గోదావరి తాగునీటి సరఫరా రెండో, మూడో దశ పనులకు రూ.1,992 కోట్లు కేటాయించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఘన్‌పూర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు సుమారు 120 కిలోమీటర్ల మేర భారీ పైపులైన్లు నిర్మించడంతోపాటు 120, 70 ఎంఎల్‌డీ సామర్థ్యంతో రెండు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 102.5 మిలియన్ లీటర్ల నిల్వ సామర్థ్యాన్ని కూడా కల్పించనున్నారు. ఈ పనులు పూర్తయితే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఇటీవల విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థలతో సహా కోర్ అర్బన్ ప్రాంతంలోని సుమారు 1.74 కోట్ల మందికి 2035 వరకు తాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వాటాకు సంబంధించి హడ్కో రుణ ప్రక్రియ కూడా పూర్తయింది.
2027 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, ఆమోదం పొందిన మిగతా నాలుగు ప్రాజెక్టులు ప్రధానంగా వరంగల్, హనుమకొండ, అలంపూర్ పట్టణాల అభివృద్ధికి సంబంధించినవి ఉన్నాయి. గ్రేటర్ వరంగల్‌లో రూ.1,465 కోట్లతో సమగ్ర వర్షపు నీటి కాలువల వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. 407.70 చదరపు కిలోమీటర్ల పరిధిలో చేపట్టే ఈ పనులతో 24 ప్రధాన వరద ప్రభావిత ప్రాంతాలకు పరిష్కారం లభించనుంది. పది పెద్ద చెరువుల కట్టలను పటిష్టం చేయడంతోపాటు సుమారు 100 కిలోమీటర్ల ప్రధాన నాలాలకు రక్షణ గోడలు నిర్మించనున్నారు. వరంగల్ కోట చుట్టూ కాకతీయుల కాలం నాటి కందకాన్ని రూ.209.08 కోట్లతో పునరుద్ధరించి, నడక మార్గాలు, వ్యూ పాయింట్లు, గ్రీనరీ అభివృద్ధి చేయనున్నారు.
హనుమకొండ పాత వాణిజ్య కేంద్రాన్ని రూ.168.80 కోట్లతో ఆధునీకరించనున్నారు. సమగ్ర బస్ టెరి్మనల్, వాణిజ్య సముదాయం, బహుళ అంతస్తుల వాహన పార్కింగ్ కేంద్రాలు, భద్రకాళి ఆలయం పరిసరాల్లో మాడవీధులు, వేయిస్తంభాల గుడి పరిసరాల అభివృద్ధి ఇందులో భాగంగా ఉన్నాయి. అలంపూర్‌లో రూ.57.50 కోట్లతో జోగుళాంబ ఆలయం, నవబ్రహ్మ ఆలయాల పరిసరాలను వారసత్వ, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. రహదారులు, పార్కింగ్, పుష్కర ఘాట్, పర్యాటకుల సౌకర్యాలు, 300 మీటర్ల వారసత్వ నడక మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఈ ఐదు ప్రాజెక్టుల్లో కేంద్ర సాయం 20 నుంచి 25 శాతం వరకు ఉండగా, మిగిలిన నిధులను రుణాలు, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలు సమకూర్చనున్నాయి. గత మే 11న జరిగిన తొలి జాతీయ కమిటీ సమావేశంలో మరో మూడు ప్రాజెక్టులకు రూ.5,681.04 కోట్ల ఆమోదం లభించింది. తాజాగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మరో ఐదు ప్రాజెక్టులు ఆమోదం పొందడంతో తెలంగాణలో ఆమోదం పొందిన మొత్తం ఎనిమిది ప్రాజెక్టుల విలువ రూ.9,573.42 కోట్లకు చేరింది. వీటికి కేంద్రం నుంచి మొత్తం రూ.2,293.75 కోట్ల సహాయం మంజూరైంది.


