కరువు.. ఉపశమనం | Key government decisions in todays cabinet meeting | Sakshi
Sakshi News home page

కరువు.. ఉపశమనం

Nov 5 2026 1:50 AM | Updated on Nov 5 2026 1:50 AM

Key government decisions in todays cabinet meeting

నేటి కేబినెట్‌ భేటీలో సర్కారు కీలక నిర్ణయాలు! 

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్న మంత్రివర్గం 

కరువుపై ఉప సంఘం నివేదిక, అఖిలపక్షం అభిప్రాయాలపై చర్చ 

ఢిల్లీకి అఖిలపక్షం, తేదీ ఖరారుపై నిర్ణయాలు! 

మునిసిపాలిటీల్లో కొత్తగా 800 పోస్టులు 

ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఇక వేర్వేరు.. ఆర్డినెన్స్‌కు ఆమోదం

గ్లోబల్‌ సమ్మిట్‌పైనా మంత్రులతో సీఎం సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు  పరిస్థితులు, తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం కరువు పరిస్థితులపై అధ్యయనం జరిపి తీసుకోవాల్సిన ఉపశమన చర్యలను సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 

మరోవైపు అఖిలపక్ష పార్టీల నేతలతో సైతం ఈ అంశంపై సమావేశం నిర్వహించి సలహాలు, అభిప్రాయాలను సేకరించింది. వీటిపై మంత్రివర్గ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే గత మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి జాతీయ విపత్తుల సహాయ నిధి నుంచి రాష్ట్రానికి కరువు సహాయం చేయాలని విజ్ఞప్తి చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి అఖిల పక్ష పార్టీల ముఖ్య నేతలకు ఆహ్వానం పంపడంతో పాటు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన కీలకాంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. అందుకు సంబంధించిన తేదీని భేటీలో ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. 

రాష్ట్రంలో 365 కరువు మండలాలున్నట్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అక్టోబర్‌ నెలలో సైతం తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో కరువు తీవ్రత మరింత పెరిగింది. ఈ మేరకు కరువు మండలాల సంఖ్యను పెంచడం, కరువు సూచికలను నవీకరించే అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తాగునీటి సమస్య తీవ్రం కానున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలించడంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

మునిసిపాలిటీల్లో 800 పైగా కొత్త పోస్టులు.. 
గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ హయాంలో కొత్త మునిసిపాలిటీల ఏర్పాటు, కార్పొరేషన్లలో విలీనం తదితరాలు జరిగినప్పటికీ.. ఉన్న సిబ్బందిని మాత్రమే సర్దుబాటు చేశారు తప్ప కొత్త నియమాకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో గురువారం నాటి కేబినెట్‌ భేటీలో దాదాపు 800 పైగా కొత్త పోస్టులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్లు వేర్వేరుగా ఉన్నందున, రాష్ట్రంలోనూ రెండు కమిషన్లను వేర్వేరుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఈ మేరకు ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలిసింది. పలు విద్యా సంస్థలు, పరిశ్రమలకు భూముల కేటాయింపుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి దఖలు పడిన 550 ఎకరాల భూమి వినియోగం, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.  

గ్లోబల్‌ సమ్మిట్‌పై అనధికార భేటీ! 
    ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026 ఏర్పాట్లు, ఏ రకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి? గతంలో సమ్మిట్‌ నిర్వహించినప్పుడు వచి్చన ప్రతిపాదనలు, వాటిలో ఏ మేరకు సాకారం అయ్యాయి, ఎంతమంది సుముఖత వ్యక్తం చేస్తూ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు..? ఏ మేరకు వారికి స్థలాలు కేటాయించారన్న అంశాలపై మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనధికార కేబినెట్‌ భేటీలో సమీక్షించనున్నట్లు తెలిసింది. కేబినెట్‌ భేటీకి ముందు 3 గంటల సమయంలో ఈ సమావేశం జరగనుంది. ఈసారి అదనంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు, ఎయిర్‌షోను కూడా నిర్వహిస్తున్న విషయం విదితమే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement