అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌ | Hyderabad ED 400 Crore Crypto Scam | Sakshi
Sakshi News home page

అమెరికన్లే టార్గెట్‌.. ఫేక్‌ కాల్‌ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్‌

Nov 4 2026 12:53 PM | Updated on Nov 4 2026 12:53 PM

Hyderabad ED 400 Crore Crypto Scam

అమెరికా పౌరులనే లక్ష్యంగా చేసుకుని క్రిప్టో కరెన్సీ, డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో సాగిస్తున్న అంతర్జాతీయ సైబర్‌ మోసాల వ్యవహారాన్ని హైదరాబాద్‌ ఈడీ అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఫేక్‌ కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి గత మూడేళ్లుగా వేలాది మందిని మోసం చేస్తున్న ముఠా ఆటకట్టించింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ.400 కోట్ల మేర క్రిప్టో లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

హర్షల్‌ రావల్‌ నేతృత్వంలోని ముఠా తొలుత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఫేక్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి అమెరికా పౌరులకు ఫోన్లు చేసి క్రిప్టో కరెన్సీ, డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేసేది. అయితే, మాదాపూర్‌ కాల్‌ సెంటర్‌పై దాడులు జరగడంతో నిందితులు తమ మకాంను పంజాబ్‌లోని పాటియాకు మార్చారు. అక్కడ మరో ఫేక్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి మోసాలను కొనసాగించారు.

ఈ కేసులో హర్షిల్‌ రావల్‌, ప్రణవ్‌ పితాదియా, చేతన్‌ ముంజల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. పాటియాలో మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వీరి ముఠా ఇప్పటివరకు వేలాది మంది అమెరికా పౌరులను మోసం చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. మోసాల ద్వారా వచ్చిన సొమ్మును తరలించేందుకు వందల సంఖ్యలో మ్యూల్‌ బ్యాంకు ఖాతాలను ఉపయోగించినట్లు పోలీసులు తేల్చారు.

అలాగే అమెరికా నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకున్న డబ్బులను.. హవాలా మార్గాల్లో బదిలీ చేసినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఈ అంతర్జాతీయ మోసాల వ్యవహారంపై అమెరికాతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. క్రిప్టో లావాదేవీల ద్వారా సుమారు రూ.400 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

మరోవైపు, ఈ మోసాల వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఇతర నిందితుల పాత్రపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఫేక్‌ కాల్‌ సెంటర్ల నుంచి విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ వ్యవహారంలో వందలాది బ్యాంకు ఖాతాలు, క్రిప్టో లావాదేవీలు, హవాలా మార్గాలు బయటపడటం కలకలం రేపుతోంది. అంతర్జాతీయ సైబర్‌ మోసాల వెనుక ఉన్న మిగతా నెట్‌వర్క్‌ను గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇదీ చదవండి: జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ.. సినిమాను తలపించేలా ఛేజింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement