పేటెంట్‌ సెర్చ్‌.. వెరీ ఈజీ | WIPO AI Patent Search Feature | Sakshi
Sakshi News home page

పేటెంట్‌ సెర్చ్‌.. వెరీ ఈజీ

Nov 4 2026 9:16 AM | Updated on Nov 4 2026 9:16 AM

WIPO AI Patent Search Feature

‘పేటెంట్‌స్కోప్‌’లో అందుబాటులోకి ఉచిత ఏఐ సెర్చ్‌ టూల్‌

సాధారణ భాషలోనే కోట్లాది పేటెంట్‌ పత్రాల అన్వేషణకు అవకాశం

పరిశోధకులు, స్టార్టప్‌లు, లీగల్‌ నిపుణులకు భారీగా సమయం ఆదా  

పరిశోధకులు, ఆవిష్కర్తలు, లీగల్‌ నిపుణులు ఏదైనా పేటెంట్‌ సమాచారాన్ని మరింత సులభంగా తెలుసుకునేందుకు ఐక్యరాజ్యసమితి పరిధిలోని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ(వైపో) కీలక అడుగు వేసింది. సంస్థ ఆధ్వర్యంలోని పేటెంట్‌ డేటాబేస్‌ ‘పేటెంట్‌స్కోప్‌’ వేదికగా సరికొత్త ఉచిత ఏఐ ఆధారిత సెర్చ్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సాధారణ భాషా వివరణలను స్వయంచాలకంగా నిర్మాణాత్మక శోధన పదాలుగా (సెర్చ్‌ క్వెరీస్‌గా) మార్చడం దీని ప్రత్యేకత.

సాధారణ భాషలోనే సెర్చ్‌.. ఎలా పనిచేస్తుందంటే?
పేటెంట్‌ పత్రాలను శోధించడం, అధ్యయనం చేయడం ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. సాంకేతిక సంకేతాలు, దేశాల కోడ్స్‌పై పట్టు ఉంటేనే సరైన పత్రాలు లభ్యమయ్యేవి. దీనికి ఎన్నో గంటల సమయం పడుతుంది. కొత్తగా వచ్చిన ఏఐ అసిస్టెంట్‌తో వినియోగదారులు తమకు కావలసిన ఆవిష్కరణను సాధారణ వ్యవహారిక భాషలోనే టైప్‌ చేసి సెకన్లలో వెతకవచ్చు.

ఉదాహరణకు.. ‘2022 తర్వాత వచ్చిన అధిక సామర్థ్యం గల సోలార్‌ ప్యానెల్స్‌‘ అని టైప్‌ చేస్తే చాలు. ఏఐ వ్యవస్థే స్వయంగా కీవర్డ్స్, ప్రచురణ తేదీలు, దేశాల కోడ్స్‌తో కూడిన సమగ్ర సెర్చ్‌ క్వెరీని రూపొందిస్తుంది. ఈ సూచనల ఆధారంగా కావాల్సిన సమాచారాన్ని సమగ్రంగా పొందవచ్చు.

డేటా భద్రతకు అధిక ప్రాధాన్యం...
పరిశోధనల గోప్యతను కాపాడేందుకు వైపో డేటా భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ లాంగ్వేజ్‌ మోడల్‌ పూర్తిగా వైపో అంతర్గత సర్వర్లలోనే పనిచేస్తుంది కాబట్టి సెర్చ్‌ వివరాలు ఎక్కడా బయటకు వెల్లడి కావు. ప్రస్తుతం వెర్ష¯న్‌ 1.0లో కీవర్డ్స్, దేశాలు, తేదీల ఆధారంగా శోధనకు అవకాశం ఉండగా, త్వరలో దరఖాస్తుదారుల పేర్లు, పేటెంట్‌ నంబర్లను సైతం ఏఐ పరిధిలోకి తీసుకురానున్నారు.

పేటెంట్‌స్కోప్‌లో దీన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చు. అలాగే పేటెంట్‌లో వందల పేజీల వివరణ ఉన్నా, చట్టపరమైన హక్కులు కల్పించేది చివరిలోని ‘క్లెయిమ్స్‌’ మాత్రమే. ప్రతి పదాన్నీ చట్టపరమైన కోణంలో డీకోడ్‌ చేసి, వారి హక్కులను ఉల్లంఘించలేదని నిర్ధారించుకోవడం కష్టమైన పని. సరికొత్త ఏఐ టెక్నాలజీతో ఈ పని సులభతరం కానుంది.

డేటాబేస్‌లో 12.2 కోట్ల పత్రాలు...
‘పేటెంట్‌స్కోప్‌’ డేటాబేస్‌లో 158 సభ్యదేశాల్లోని 78కి పైగా కార్యాలయాలకు చెందిన 12.2 కోట్లకు పైగా అంతర్జాతీయ, జాతీయ పేటెంట్‌ పత్రాలు ఉన్నాయి. 46 లక్షలకు పైగా పేటెంట్‌ సహకార ఒప్పందం దరఖాస్తులు, 68 లక్షల శాస్త్రీయ కథనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 37 లక్షల పేటెంట్‌ దరఖాస్తులు నమోదవుతున్నాయి.

ఇదీ చదవండి: ‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement