ప్రవళిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: మంత్రి పొన్నం ప్రకటన | Government Support To Pravalika Family Announces Ex-Gratia | Sakshi
Sakshi News home page

ప్రవళిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం: మంత్రి పొన్నం ప్రకటన

Nov 4 2026 8:35 AM | Updated on Nov 4 2026 8:35 AM

Government Support To Pravalika Family Announces Ex-Gratia

సాక్షి, హైదరాబాద్‌: విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిన మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రవళిక తల్లికి ఉద్యోగం కల్పించడంతో పాటు, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న గుండ్ల ప్రవళిక (24) విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో టికెట్‌ చిల్లర విషయంలో ప్రయాణికురాలితో ప్రవళికకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రయాణికురాలు ఆమెను తోసేయడంతో ప్రవళిక బస్సు నుంచి కిందపడిపోయారు. బస్సు వెనుక టైర్లు ఆమె కుడికాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. తొలుత స్థానికంగా చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు.

దాదాపు పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రవళిక.. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, మణుగూరు డిపో సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రవళిక కుటుంబానికి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌.. జిల్లాకో పంచాయితీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement