రిటైల్ మార్కెట్‌లో రూ.70కి తగ్గని ఉల్లి
వెల్లుల్లి కిలో రూ.280..
నెల రోజుల్లోనే పెరిగిన పప్పు ధాన్యాల ధరలు
కందిపప్పు రూ.143.. ఇతర పప్పుల ధరలు పైపైకి
రైతుబజార్‌లోనే మిర్చి రూ.60.. బయట అంతకుమించి..
సాక్షి, హైదరాబాద్: కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. ఉల్లి కోయకముందే కన్నీళ్లు పెట్టిస్తోంది. వెల్లుల్లి ఘాటు జేబుకు చిల్లు పెడుతోంది. పప్పు, బియ్యం, కూరగాయలు అన్నీ ఒకేసారి చుక్కలనంటడంతో మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. కేంద్ర గణాంకాల ప్రకారమే సెపె్టంబర్‌లో ఉల్లి ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే 108.09 శాతం పెరిగాయి. గత అక్టోబర్ నెలలోనూ అదే తీరు కొనసాగింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లిధర రూ.70 పలుకుతోంది. అంటే ఏడాదిలో ఉల్లి ధర రెట్టింపు దాటింది. వెల్లుల్లిలో ఈ పెరుగుదల 54.62 శాతం, అల్లంలో 62.9 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతానికి ఎగబాకిన నేపథ్యంలో ధరలు సామాన్యుడికి కంట నీరు తెప్పిస్తున్నాయి.
కర్నూలు ఖాళీ.. నగరానికి ఉల్లి కొరత
హైదరాబాద్‌లో అక్టోబర్ మొదటివారానికే ఉల్లి కిలో రూ.65–70కి చేరింది. ఆగస్టు నెలాఖరు వరకు ఇది రూ.30 మాత్రమే. నగరానికి రోజూ కనీసం 50 లారీల ఉల్లి రావాలి. ఒక్కో లారీలో 25 టన్నులు ఉంటాయి. కానీ కర్నూలులో పంట దెబ్బతినడం, కర్ణాటకలో వర్షాభావంతో పంటనష్టం వల్ల సరఫరా తగ్గింది.
⇒ గతేడాది సెపె్టంబర్ 15–అక్టోబర్ 15 మధ్య కర్నూలు మార్కెట్‌కు 1.46 లక్షల క్వింటాళ్ల ఉల్లి రాగా, ఈసారి 40 వేల క్వింటాళ్లు కూడా రాలేదు. దీంతో హైదరాబాద్‌పై ప్రభావం పడి ధరలు భారీగా పెరిగాయి.
⇒ పొరుగున కర్ణాటకలో 124 తాలూకాల్లో దాదాపు 60 వేల హెక్టార్లలో ఉల్లి పంట దెబ్బతింది. హైదరాబాద్ మండీల్లో హోల్‌సేల్ ధర క్వింటాల్ రూ.4,000 దగ్గర ఉండగా, రిటైల్‌కు వచ్చేసరికి రెట్టింపవుతోంది. మహారాష్ట్ర నుంచి రావాల్సిన ఉల్లి సరఫరా కూడా తగ్గడంతో ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెపుతున్నారు.
వెల్లుల్లి ఘాటు
బెంగళూరు యశ్వంత్‌పూర్ మార్కెట్‌కు వెల్లుల్లి రాక సగానికి పడిపోవడంతో రాష్ట్రానికి వచ్చే వెల్లుల్లి రిటైల్ ధర కిలో రూ.250–280కి చేరినట్లు వ్యాపారులు చెబుతున్నారు, సాధారణంగా మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్‌ల నుంచి
వెల్లుల్లి వస్తుంది. ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడి తగ్గింది. దీంతో కూకట్‌పల్లి రైతుబజార్‌లోనే వెల్లుల్లి కిలో రూ.260 పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో పావుకిలో వెల్లుల్లి రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు.
⇒ రైతులకు అవసరమైన వెల్లుల్లి విత్తనాల ధరలు కూడా భారీగా పెరిగాయి. గతేడాది క్వింటాల్ రూ.3,000–6,000 ఉన్న విత్తన వెల్లుల్లి ఇప్పుడు ఏకంగా రూ.10,000–15,000కి చేరడంతో రైతులు యాసంగి సాగుకు అల్లాడుతున్నారు. డిసెంబర్–జనవరిలో కొత్త సరుకు వచ్చే వరకు వెల్లు్లల్లి ధరలు తగ్గవని వ్యాపారులు చెబుతున్నారు.
పప్పు దినుసులు పిరం
పేదవాడి ప్రొటీన్‌గా పేరున్న పప్పు ఇప్పుడు సామాన్యుడికి అందనంత దూరం వెళ్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే నగర రిటైల్ మార్కెట్‌లో పప్పుల ధరలు భారీగా పెరిగాయి. సెపె్టంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో కందిపప్పు కిలో రూ.126 నుంచి రూ.143కి, మినప పప్పు రూ.120 నుంచి రూ.128కి, పెసరపప్పు రూ.106 నుంచి రూ.112కి, శనగపప్పు రూ.80 నుంచి రూ.90కి పెరిగాయి. పోపు సామాన్లూ పిరమయ్యాయి. గుండుమిర్చి కిలో రూ.330 నుంచి రూ.420కి, ధనియాలు రూ.190 నుంచి రూ.210కి, చక్కెర రూ.43 నుంచి రూ.50 నుంచి రూ.60కి చేరాయి.
⇒ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల పర్యవేక్షణ విభాగ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కందిపప్పు సగటు రిటైల్ ధర కిలో రూ.132.75కి చేరింది. ఇది గతేడాదితో పోలిస్తే 15 శాతం ఎక్కువ.
⇒ మినప పప్పు రూ.125.46 (10% పెరుగుదల), శనగపప్పు రూ.93.48 (7.5% పెరుగుదల)కి చేరాయి. అక్టోబర్ 20 నాటికి కందిపప్పు రిటైల్ ధర ఏడాదిలో 17.2 శాతం పెరిగినట్టు నమోదైంది. అయితే కేంద్రం లెక్కలతో పోలిస్తే రాష్ట్రానికి దిగుమతి అయ్యే పప్పు ధాన్యాలను బట్టి ధరల్లో భారీ తేడా ఉండడం గమనార్హం.
కూరగాయలకు రెక్కలు
ప్రభుత్వ రైతుబజార్‌లోనే పచ్చిమిర్చి కిలో రూ.60, బజ్జిమిర్చి, చిక్కుడు, బీన్స్ రూ.55–రూ60, క్యారెట్, క్యాప్సికం రూ.50 పలుకుతున్నాయి. పాత అల్లం రూ.180, కొత్త అల్లం రూ.120 పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో ఈ ధరలకన్నా 20 శాతం అధికంగా వినియోగదారులకు కూరగాయలు దొరుకుతున్నాయి. రిటైల్ మార్కెట్లలో టమాటా ధర 150 శాతం పెరిగి కిలో రూ.50కి చేరింది. బెండకాయ, వంకాయ, బీరకాయ, కాకరకాయ వంటి అన్నింటి ధరలు కిలో రూ.60నుంచి రూ.80 వరకు రిటైల్ మార్కెట్‌లో లభిస్తున్నాయి.


