మీడియాతో మాట్లాడుతున్న పరకాల ప్రభాకర్. చిత్రంలో ప్రొఫెసర్ హరగోపాల్
తొలగించిన 13 కోట్ల మంది ఓటర్లు ఏఎస్‌డీడీ, విదేశీ ఓటర్లేనని అమిత్ షా అన్నారు
అయితే 2024, 2019, 2014 ఎన్నికలు, ప్రభుత్వాలు చట్టబద్ధమేనా?
రాజీనామా చేసి ‘సర్’తో శుద్ధి చేసిన జాబితాతో మళ్లీ ప్రజల ముందుకు వెళ్లాలి
అమిత్ షా వ్యాఖ్యలపై ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చి తన పదవిని దిగజార్చుకునేలా వ్యాఖ్యానించారని ప్రముఖ ఆర్థిక వేత్త, రాజకీయ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ విమర్శించారు. ‘సర్’పేరుతో దేశంలో తొల గించిన 13 కోట్ల మంది ఓటర్లు చనిపోయిన, వలస పోయిన, డూప్లికేట్ (ఏఎస్‌డీడీ), విదేశీ ఓటర్లేనని అమిత్ షా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) 2025లో ప్రారంభమైంది.
అంతకు ముందు నాటి ఓటర్ల జాబితాలో విదేశీయులతోపాటు చనిపోయిన, వలసవెళ్లిన, డూప్లికేట్, మరణించిన ఓటర్లు ఉండి ఉంటే వరుసగా 2024, 2019, 2014లో జరిగిన ఎన్నికల ప్రాతిపదికన ఏర్పడిన చట్టసభలు, ప్రభుత్వాలు చట్టవిరుద్ధమా..కాదా’అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్రశ్నించారు. ‘లోపభూయిష్టమైన ఓటర్ల జాబితాతో 2024లో ఏర్పడిన ప్రభుత్వంలో ఉన్నందుకు సిగ్గుపడుతూ తక్షణమే రాజీనామా చేయండి. ‘సర్’తో శుద్ధికరీంచిన ఓటర్ల జాబితాతో మళ్లీ మీ ముందుకు వస్తామని ప్రజలకు ప్రకటించండి’అని అమిత్‌షాకు సూచించారు.
‘సర్’పై నిజనిర్ధారణలో భాగంగా తెలంగాణ ఓటర్స్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో ముషీరాబాద్, తిరుమలగిరిలో నిర్వహించిన బహిరంగ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను వెల్లడించడానికి మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి బహిరంగ విచారణకు అమిత్‌షా, ఆయనకు మద్దుతు ఇచ్చేవారు హాజరై ఓటు హక్కు కోల్పోయిన సామాన్య ప్రజల ఆగ్రహం, ఆక్రోశం తెలుసుకోవాలని హితవు పలికారు.
తాము చనిపోలేదు, ఎక్కడకీ వెళ్లలేదు, తాము డూప్లికేట్ కాదు, మరెక్కడా ఓటు లేదు, విదేశీయుడిని కాదని, అయినా నా ఓటును తీసేశారని..తిరుమలగిరిలోని 150, 151వ పోలింగ్ బూత్‌ల పరిధిలో బహిరంగ విచారణలో హాజరైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ కార్యక్రమంలో తాను జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించానని పరకాల వెల్లడించారు. వలస వెళ్లారనే కారణంతో అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గాల్లో భారీగా ఓటర్లను తొలగించారని, మరీ వీరంతా వలస వెళ్లిన రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాల్లో ఆ మేరకు ఓటర్ల సంఖ్య పెరగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరి దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, నియోజకవర్గల్లో ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఎక్కడైనా ఒక్క ఓటూ పెరిగిన దాఖలాలున్నాయా అని నిలదీశారు.
గతంలో ‘సర్’జరగనే జరగలేదు
ఈసీ చెబుతున్నట్టు 2002లో చేసింది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కాదని, అప్పుడు కేవలం ఇంటెన్సివ్ (విస్తృత) పద్ధతిని మాత్రమే అనుసరించారని పరకాల ప్రభాకర్ ఆరోపించారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ‘సర్’జరగలేదని, ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు. నిజంగానే 2006లో చివరిసారిగా ‘సర్’నిర్వహించి ఉంటే మరి ఇప్పుడు 2002 జాబితాతో ఓటర్లను ఎందుకు మ్యాపింగ్ చేస్తున్నారని ఈసీని ప్రశ్నించారు. ప్రొఫెసర్ పద్మజషా, నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ ప్రతినిధి సిస్టర్ మంజుల, విద్యావేత్త మారియా తబస్సుమ్, విస్సా కిరణ్, సునీత తదితరులు మాట్లాడారు.
కేవలం మరణాలేనా? జననాలు లేవా : ప్రొఫెసర్ హరగోపాల్
పగలు పనికోసం వెళ్లి రాత్రి ఇళ్లకు చేరుకునే వారిని ఆచూకీ లేనివారిగా పరిగణించి ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు నిజనిర్ధారణలో గుర్తించామని ప్రొఫెసర్ హరగోపాల్ వెల్లడించారు. అమిత్‌షా హైదరాబాద్‌లో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బతికి ఉన్న తన భర్తను పేపర్ మీద చనిపోయినట్టు రాసి ఓటరు జాబితా నుంచి తొలగించారని బహిరంగ విచారణలో ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. కేవలం చావులే ఉండడం లేదని, అంతకు మించి జననాలు ఉంటున్నాయని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన వారితో ఓటర్ల సంఖ్య పెరగాల్సి ఉంటుందని, ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఎన్నికలు విశ్వసనీయత కోల్పోయితే ప్రజాస్వామ్యానికి చేటని, సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


