నిరంతరం ‘మహా’ సంప్రదింపులు | Revanth Reddy asks officials to continue dialogue with Maharashtra on Tummidihatti barrage | Sakshi
Sakshi News home page

నిరంతరం ‘మహా’ సంప్రదింపులు

Nov 4 2026 5:43 AM | Updated on Nov 4 2026 5:43 AM

Revanth Reddy asks officials to continue dialogue with Maharashtra on Tummidihatti barrage

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఉత్తమ్‌

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో చర్చలకు సీఎం ఆదేశాలు 

ముంపుపై మహారాష్ట్ర ఎలాంటి సర్వే జరిపినా 

అభ్యంతరం లేదని స్పష్టీకరణ 

మంత్రి ఉత్తమ్‌తో కలిసి సీఎం రేవంత్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులో ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణానికి మహారాష్ట్ర నుంచి సమ్మతి పొందడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బరాజ్‌ నిర్మాణంతో మహారాష్ట్రలో ఏర్పడే ముంపు ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు.

 ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్రకు అందజేయాలని కోరారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మాణంపై సమీక్ష జరిపారు. మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, ఇతర అంశాలపైన  అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. 

మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన నిధులను జాయింట్‌ అకౌంట్‌లో ఉంచుతామన్నారు. ముంపు ప్రభావంపై మహారాష్ట్ర ఎలాంటి సర్వే చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని సీఎం వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్, కార్యదర్శి ఇ.శ్రీధర్, ఈఎన్‌సీ (జనరల్‌) రమే‹Ù, జాయింట్‌ సెక్రటరీ కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement