పర్యావరణానికి రక్షణతోపాటు.. ఎరువుల ఖర్చు తగ్గుతుందా? | Green Fertilizer Reduces Urea Use By 25 Percent | Sakshi
Sakshi News home page

పర్యావరణానికి రక్షణతోపాటు.. ఎరువుల ఖర్చు తగ్గుతుందా?

Nov 3 2026 12:15 PM | Updated on Nov 3 2026 1:01 PM

Green Fertilizer Reduces Urea Use By 25 Percent

సాగుకు ఉపకరించే సరికొత్త హరిత ఎరువు అభివృద్ధి

మొక్కజొన్న పిండి, మామిడి జీడి వంటి సహజ పదార్థాలు, సూక్ష్మజీవుల మేళవింపు

యూరియా వాడకం తగ్గించినా తగ్గని దిగుబడి

ఐఏఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాస్త్రవేత్తల తాజా పరిశోధన

పర్యావరణానికి హాని కలిగించకుండా, దిగుబడులు తగ్గకుండా వ్యవసాయానికి ఉపకరించే హరిత ఎరువు అభివృద్ధిలో భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీ), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ, హైదరాబాద్‌) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. సాధారణంగా వాడే రసాయన ఎరువుల స్థానంలో పర్యావరణహితంగా పనిచేసే సరికొత్త బయో పాలిమర్‌ మిశ్రమ ఎరువును వీరు అభివృద్ధి చేశారు.

ఈ ఎరువు వాడకంతో 25 శాతం తక్కువ నత్రజని (యూరియా) వినియోగించినప్పటికీ, పంటలకు పోషకాల కొరత రాకపోవటమే కాకుండా వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదకర వాయు ఉద్గారాలు గణనీయంగా తగ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. మొక్కజొన్న పిండి, మామిడి జీడి ఆధారిత బయోపాలిమర్లతో పాటు నానోక్లే (సూక్ష్మ స్థాయి మట్టి)ను కలిపి ఈ హరిత ఎరువును రూపొందించారు.

ఇందులో యూరియాతో పాటు పంటలకు మేలు చేసే ల్యాక్టోకోకస్‌ లాక్టిస్, సూడోమోనాస్‌ ఎరుగినోసా అనే బ్యాక్టీరియాలను చేర్చారు. ఈ బ్యాక్టీరియాలు నేలలోని భాస్వరం, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలను మొక్కలు సులభంగా గ్రహించేలా చేస్తాయి. శాస్త్రవేత్తల ప్రయోగాల ప్రకారం ఈ సూక్ష్మజీవులు మట్టిలో దాదాపు 180 రోజుల పాటు జీవించి ఉండగలవు.

ఉద్గారాల తగ్గుదల
మొక్కజొన్న–గోధుమ పంట మార్పిడి విధానంలో ఈ పరిశోధనలు జరిగాయి. సాధారణ యూరియా వాడకంతో పోల్చితే, మొక్కజొన్న పిండి ఆధారిత ఎరువును వాడినప్పుడు గోధుమ పంటలో నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు 28.7 శాతం, మొక్కజొన్న పంటలో 24.2 శాతం తగ్గాయి. అలాగే మామిడి జీడి ఆధారిత మిశ్రమంతో గోధుమలో 17.2 శాతం, మొక్కజొన్నలో 21.4 శాతం ఉద్గారాలు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మిశ్రమం నుంచి నత్రజని నెమ్మదిగా విడుదల కావటం వల్ల నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్గారాలు అదుపులో ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. 

తేమను పట్టి ఉంచే సామర్థ్యం
నేలలో నీటిని పట్టి ఉంచే అధిక సామర్థ్యం ఈ బయో పాలిమర్‌ మిశ్రమాలకు ఉంది. 24 గంటల తర్వాత పరిశీలిస్తే ఒక్కో గ్రాము మొక్కజొన్న పిండి మిశ్రమం 68 గ్రాముల నీటిని, మామిడి జీడి మిశ్రమం 62 గ్రాముల నీటిని గ్రహించి తేమను నిలుపుకోగలిగాయి. ఇది వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.

ఈ ఎరువుల ద్వారా నైట్రస్‌ ఆక్సైడ్‌ తగ్గినప్పటికీ, కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్‌ ఉద్గారాల ప్రభావాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. అలాగే విభిన్న నేలలు, వాతావరణ పరిస్థితుల్లో వీటి సామర్థ్యాన్ని నిర్ధాý రించటానికి విస్తృత స్థాయి క్షేత్ర ప్రయోగాలు జరగాల్సి ఉందని వారు సూచించారు.
- సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఇదీ చదవండి: ఒత్తిడి ఏదైనా దిగుబడి నష్టమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement