హైదరాబాద్‌లో మగవాళ్లకి ఏముంది? | Hyderabad Teaser Advertising New Marketing Trend | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మగవాళ్లకి ఏముంది?

Nov 3 2026 8:42 AM | Updated on Nov 3 2026 8:42 AM

Hyderabad Teaser Advertising New Marketing Trend

ప్రశ్నే పబ్లిసిటీ!

వైరల్‌ అయ్యాక అసలు విషయం రివీల్‌

నగరంలో కొత్త ప్రచార వ్యూహానికి ఆదరణ

సాక్షి, హైదరాబాద్‌: పబ్లిసిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. నగర రహదారులపై ఏదో ఒక అంశంపై ప్రశ్నతో ఓ హోర్డింగ్‌ కనిపిస్తుంది. దానికి సమాధానం ఉండదు! ‘హైదరాబాద్‌లో మగవాళ్లకి ఏముంది?’ అంటూ ఇటీవల సిటీలో సందడి చేస్తున్న ప్రకటన ఇందుకు తాజా ఉదాహరణ.

ఏ బ్రాండ్‌? ఏ ఉత్పత్తి? ఎందుకీ ప్రచారం? అనే ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరకదు. అసలు విషయం వెల్లడయ్యే వరకు ఉత్కంఠను కొనసాగించడమే ఈ ప్రకటనల వ్యూహం. మార్కెటింగ్‌ పరిభాషలో దీనిని టీజర్‌ అడ్వర్‌టైజింగ్‌ అంటారు. అసలు విషయాన్ని దాచిపెట్టి.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాక ప్రచారాన్ని రివీల్‌ చేస్తారు.  

ఆసక్తే పెట్టుబడి..
కొత్త ఉత్పత్తిని పరిచయం చేయడానికి ముందే ప్రజల్లో చర్చ మొదలయ్యేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. పూర్తి వివరాలు వెల్లడించకుండా ప్రశ్నలు, సంకేతాలు, ఆకర్షణీయమైన పదాలతో ప్రచారం చేస్తారు. ఆ తర్వాత అసలు బ్రాండ్, ఉత్పత్తిని పరిచయం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అవుట్‌డోర్‌ ప్రకటనల్లో కనిపించే ఈ వ్యూహానికి భారత్‌లోనూ ఉదాహరణలున్నాయి. 2001లో ఓ ప్రముఖ పానీయాల బ్రాండ్‌ చేపట్టిన ‘డిజెన్‌ వర్మ’ ప్రచారం అప్పట్లో విస్తృత ఆసక్తిని రేకెత్తించింది. ఆ వ్యక్తి ఎవరనే ప్రశ్నతో మొదలైన ప్రచారం తర్వాత ఒక పానీయాల బ్రాండ్‌తో ముడిపడింది.

అనుమతులు తప్పనిసరి..
ఆసక్తి రేపే ప్రకటనలైనా నిబంధనలకు అతీతం కాదు. ప్రభుత్వం ప్రకటించిన సమగ్ర బహిరంగ ప్రకటనల విధానం ప్రకారం హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో అనుమతులు, ప్రాంతాల వారీ నియంత్రణ, పర్యవేక్షణకు ప్రాధాన్యమిచ్చారు. అనుమతించిన ప్రకటనలకు క్యూఆర్‌ కోడ్, భౌగోళిక గుర్తింపు వంటి నిబంధనలు వర్తిస్తాయి.

వారసత్వ కట్టడాలు, మతపరమైన ప్రదేశాలు, పార్కులు, జలవనరులు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లో ప్రకటనలపై ఆంక్షలున్నాయి. ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారే, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే హోర్డింగులకు అనుమతి లేదు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే తప్పుడు, ఆధారాలు లేని వాదనలు చేయకూడదు. ప్రకటనలో మొదట వివరాలు వెల్లడించకపోవడం తప్పు కాదు, అది తప్పుడు సమాచారం లేదా మోసపూరిత ప్రచారంగా మారిందా అన్నదే కీలకం.

ఇదీ చదవండి: క్లీన్‌.. ట్రాఫిక్‌ ఫ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement