ఈ-కామర్స్.. ఇదో కొత్త రకం తెగులు! | IPPCs Latest Report: Key Findings Revealed | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్.. ఇదో కొత్త రకం తెగులు!

Nov 3 2026 5:50 AM | Updated on Nov 3 2026 5:50 AM

IPPCs Latest Report: Key Findings Revealed

‘ఇంటర్నేషనల్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ కన్వెన్షన్‌’ తాజా నివేదిక వెల్లడి

ఆన్‌లైన్‌లో వచ్చే విత్తనాలు, మొక్కల ఉత్పత్తుల పార్శిళ్లతో ముప్పు

చీడపీడలు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి సులభంగా వ్యాపించే ప్రమాదం

బలహీనమైన సరిహద్దు నియంత్రణ వ్యవస్థల పర్యవేక్షణ లోపం

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: అంతర్జాతీయ వాణిజ్యంలో ఈ–కా­మర్స్, కొరియర్, పోస్టల్‌ సేవల విస్తరణ ప్రపంచ వ్యవసాయ రంగానికి కొత్త రకమైన చీడపీడలు, తెగుళ్ల (ఫైటోశానిటరీ) సవాళ్లను తెచ్చిపెడుతోంది. ఆన్‌లైన్‌ ద్వారా చిన్న చిన్న పార్శిల్స్‌లో వచ్చే విత్తనాలు, మొక్కల ఉత్ప­త్తుల ద్వారా ప్రమాదకరమైన చీడపీడలు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్నేషనల్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ కన్వెన్షన్‌’ (ఐపీపీసీ) తాజా పరిశీలనా నివేదిక వెల్లడించింది.

బలహీనంగా నియంత్రణ వ్యవస్థలు
ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లోని నేషనల్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎన్‌పీపీఓల) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. దీని ప్రకా­రం సరిహద్దు తనిఖీలు ఎక్కడా పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా జరగటం లేదు. ఏ ప్రాంతంలో కూడా నిర్దేశిత సూచీలో 62 శాతానికి మించి పనితీరు కనబరచలేకపోయింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16,100 కోట్ల పార్శిళ్ల రవాణా జరగ్గా, 2027 నాటికి ఈ సంఖ్య 25,600 కోట్లకు పెరిగి ఉంటుందని అంచనా. చిన్న పార్శిళ్ల ప్రవాహం పోటెత్తుతున్నప్పటికీ, సరిహద్దు నియంత్రణ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.  

కనీస మార్గదర్శకాలూ మృగ్యం 
ఈ–కామర్స్‌ ద్వారా జరిగే మొక్కల వ్యాపారానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు లేదా నిబంధనలు అనేక దేశాల్లో లేవు. చాలా దేశాలు సాధారణ వృక్ష సంరక్షణ చట్టాల పైనే ఆధారపడుతున్నాయి. ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో దాదాపు 73 శాతం దేశాల్లో కనీస మార్గదర్శకాలు కూడా లేవని సర్వే స్పష్టం చేసింది.
అదేవిధంగా కేవలం 43 శాతం నియంత్రణ సంస్థలకే కస్టమ్స్‌ లేదా కొరియర్‌ డేటాను పరిశీలించే వెసులుబాటు ఉంది. ప్రజలు అనుమానిత వృక్ష సంబంధిత ఉత్పత్తులపై ఫిర్యాదు చేసేందుకు 29 శాతం దేశాల్లో మాత్రమే ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులో ఉన్నాయి. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ఐపీపీసీ నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, ఈ–కామర్స్‌ వ్యాపారులు, వినియోగదారుల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

సమన్వయ లోపమే పెద్ద శాపం
ప్రధానంగా కస్టమ్స్, తపాలా, ఎక్స్‌ప్రెస్‌ కొరియర్‌ సేవల మధ్య సమన్వయం లోపించటం పెద్ద సమస్యగా మారింది. మొక్కల ఉత్పత్తులు సరిహద్దులు దాటి రవాణా అవుతున్నప్పుడు కస్టమ్స్‌ అధికారులు ఎన్‌పీపీఓలకు సమాచారం ఇచ్చే ప్రక్రియ 88 శాతమే అమలవుతోంది. ఇది పోస్టల్‌ విభాగంలో 66 శాతం, ప్రైవేట్‌ కొరియర్‌ సర్వీసుల్లో కేవలం 58 శాతమే ఉంది. అనుమానిత పార్శిళ్లను తనిఖీ కోసం నిలిపివేతలోనూ కొరియర్‌ సంస్థల నుంచి సరైన సహకారం అందటం లేదని నివేదిక పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement