కూకట్‌పల్లిలో 48.35 మీటర్ల లోతుకు నీరు
హైదరాబాద్‌లో ఏడాదిలోనే మరో 7.17 మీటర్ల లోతుకు వెళ్లిన జలాలు
రాష్ట్రవ్యాప్తంగానూ తగ్గిన నీటిమట్టాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో భూగర్భ జల రోదనలు వినిపిస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో లోతుకు వెళ్లాయి. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు విస్తరిస్తున్న నిర్మాణ రంగం, భారీగా పెరుగుతున్న భూగర్భ నీటి వినియోగం.. ఇంకోవైపు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కూకట్‌పల్లి మండలంలోని కూకట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద భూగర్భ జలాలు ఏకంగా 48.35 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కేపీహెచ్‌బీలో ఇది 34.94 మీటర్లుగా ఉంది. గ్రేటర్ పరిధిలో సగటున 12.59 మీటర్ల లోతులో జలాలున్నాయి. గత ఏడాది అక్టోబర్ (5.42 మీటర్ల)తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరు (12.59)లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలమట్టం సగటున 7.17 మీటర్ల మేర పడిపోయింది. సెపె్టంబరుతో పోల్చినా ఒక్క నెలలోనే 1.01 మీటర్లమేర పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తెలంగాణ భూగర్భ జలశాఖ అక్టోబరు మాసానికి విడుదల చేసిన గణాంకాల్లో ఈమేరకు వెల్లడైంది. జీహెచ్‌ఎంసీ, పరిసర మున్సిపల్ ప్రాంతాల పరిధిలోని 46 మండలాల్లో 107 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జల శాఖ నీటిమట్టాలను పరిశీలించింది. 2026–27 నీటి సంవత్సరంలో అక్టోబరు 31 వరకు ఈ ప్రాంతంలో సాధారణంగా 729 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 484 మి.మీ. మాత్రమే కురిసింది. అంటే 34 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 46 మండలాల్లో కేవలం ఆరు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది.
రాష్ట్రమంతటా తీవ్ర ఒత్తిడి..
రాష్ట్రంలో సగటున భూగర్భ జలాలు 8.28 మీటర్ల లోతులో ఉన్నాయి. 2025 అక్టోబరుతో పోలిస్తే ఏకంగా 3.86 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 2026 జూన్ 1 నుంచి అక్టోబరు 31 వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 831 మి.మీ. కాగా, వాస్తవంగా 628 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే 203 మి.మీ. లోటుతో 24 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం 33 జిల్లాల్లో కేవలం 11 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 22 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 7.37 మీటర్లు, సంగారెడ్డి 6.67, మెదక్ 6.66, రంగారెడ్డి 6.61, మహబూబ్‌నగర్‌లో 6.57 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయింది. మేడిపల్లిలో 28.41, హయత్‌నగర్‌లో 19.32, శంకర్‌పల్లిలో 21.81 మీటర్ల లోతులో నీటిమట్టాలు నమోదయ్యాయి.
వికారాబాద్‌లో అత్యంత లోతుకు..
జిల్లాల సగటు నీటిమట్టాలను పరిశీలిస్తే వికారాబాద్‌లో అత్యధికంగా 13.54 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. సంగారెడ్డిలో 12.93 మీటర్లు, రంగారెడ్డి 12.75, మేడ్చల్ 12.67, మహబూబ్‌నగర్ 11.96, మెదక్ 11.48, హైదరాబాద్‌లో 11.10 మీటర్ల లోతులో నీరు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు జగిత్యాల జిల్లాలో అత్యల్పంగా 4.21 మీటర్లు, ఖమ్మం 4.34, మహబూబాబాద్‌లో 4.48 మీటర్ల లోతులో నీటిమట్టాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. వర్షపు నీటి సంరక్షణ, చెరువులు, కుంటల పునరుద్ధరణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, భూగర్భ జలాల కృత్రిమ రీచార్జి, బోరుబావుల వినియోగంపై నియంత్రణ వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.


