కూకటివేళ్లతో పెకిలిస్తాం | Union Home Minister Amit Shah fires on Congress govt: Telangana | Sakshi
Sakshi News home page

కూకటివేళ్లతో పెకిలిస్తాం

Nov 3 2026 4:43 AM | Updated on Nov 3 2026 4:43 AM

Union Home Minister Amit Shah fires on Congress govt: Telangana

మహా పాదయాత్రలో అభివాదం చేస్తున్న అమిత్‌ షా. చిత్రంలో జి.నగేశ్, పాయల్‌ శంకర్, కిషన్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్‌రావు తదితరులు

కాంగ్రెస్‌ సర్కార్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఫైర్‌

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం 

వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్‌ను సాగనంపుతాం 

ఇందుకు పార్టీ కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి.. 

తెలంగాణను అమ్మేయాలని కాంగ్రెస్‌ చూస్తోంది.

అనర్హులైన వారి ఓట్లు తొలగిస్తే రాహుల్‌కు ఎందుకు కడుపు మంట? 

ఈవీఎంల ద్వారానే బీజేపీ గెలుస్తూ ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎలా గెలిచింది? 

రేవంత్‌రెడ్డి సీఎం ఎలా అయ్యారు?

బీజేపీ మహా పాదయాత్ర ముగింపు సభలో కేంద్ర హోంమంత్రి 

బషీర్‌బాగ్‌ నుంచి ఎంజే మార్కెట్‌ వరకు పాదయాత్ర

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌ను కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తప్పకుండా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను ఏటీఎంగా మార్చి ‘ఆర్‌ఆర్‌ (రాహుల్‌–రేవంత్‌) ట్యాక్స్‌’ వసూలు చేస్తున్నారని, ఢిల్లీకి ముడుపులు చేరుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని అమ్మేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని బీఆర్‌ఎస్, ఎంఐఎం అడ్డుకోలేవని, కేవలం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే అడ్డుకోగలదని పేర్కొన్నారు. సర్‌ ప్రక్రియతో పాటు ఈవీఎంలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఎస్‌ఐఆర్‌ వల్లే బీజేపీ గెలుస్తోందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఈవీఎంల ద్వారానే బీజేపీ గెలుస్తూ ఉంటే... తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎలా గెలిచింది? రేవంత్‌రెడ్డి సీఎం ఎలా అయ్యారని నిలదీశారు. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, కేరళం, తమిళనాడులో బీజేపీయేతర ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్‌ను శాశ్వతంగా సాగనంపడంతో పాటు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ కార్యకర్తలు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. 

సోమవారం బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి మొజాంజాహి మార్కెట్‌ వరకు, ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం...అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ నినాదంతో బీజేపీ నిర్వహించిన మహా పాదయాత్రలో పాల్గొన్న అమిత్‌ షా.. దాదాపు ఒకటిన్నర కి.మీ మేర నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భాగ్యలక్ష్మీ అమ్మవారికి, హైదరాబాద్‌ను భారత్‌లో అంతర్భాగం చేసిన ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు, విప్లవ వీరులు కొమురం భీమ్, రాంజీ గోండ్‌లకు శిరస్సు వంచి ప్రణామం చేశారు.  

అరాచకత్వాన్ని అంతం చేయాలి 
    ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడి అరాచకత్వాన్ని అంతం చేసేందుకు తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌‎ను గద్దెదించాల్సి ఉంది. ఇందుకు కార్యకర్తలు పిడికిలి బిగించి సంకల్పం తీసుకోవాలి. రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే కటాకట్‌గా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న రాహుల్‌గాంధీ మాటలు ‘సఫా కట్‌’ అయ్యాయి. సుపరిపాలన ఎలా ఉంటుందో మమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన మేరకు రామమందిర నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు జరిగాయి.

అవినీతి, నక్సలిజం అంతం అయ్యాయి. 2029 డిసెంబర్‌ చివర్లోగా దేశాన్ని డ్రగ్స్‌ సమస్య నుంచి విముక్తి కలిగించేలా చర్యలుంటాయి. ఇందుకోసం బీజేపీ కార్యకర్తలు పిడికిలి బిగించి ముందుకు సాగాలి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు ఇచ్చిన గ్యారెంటీలు అమలుకాక కుప్పకూలిపోయాయి. పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్‌ది. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో ఆయనపై కనీసం పావలా (చార్‌ అణా) అవినీతి ఆరోపణ కూడా చేయలేకపోయారు. కాంగ్రెస్‌ అవినీతిపై పోరాడి ప్రజలకు న్యాయం చేసే ఏకైక శక్తి బీజేపీ మాత్రమే..’ అని అమిత్‌ షా చెప్పారు.  

పార్లమెంటులో చర్చకు ఎందుకు రారు?     
    ‘సర్, ఈవీఎంలపై పార్లమెంటులో చర్చకు కాంగ్రెస్‌ ఎందుకు ముందుకు రావడం లేదు?  2014, 2019లలో ఎస్‌ఐఆర్‌ లేకుండానే దేశ ప్రజలు నరేంద్ర మోదీని సంపూర్ణ మెజారిటీ గెలిపించారు. 2024 తర్వాత హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ విజయం సాధిస్తే ప్రజలు గెలిపించినట్టు చెబుతూ, ఓడిపోతే ఈవీఎంలను నిందించడం చూస్తుంటే ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న సామెత అక్షరాలా సరిపోతుంది. మాక్‌ పార్లమెంట్‌లో తప్ప రాహుల్‌ గాంధీ ఎప్పటికీ దేశానికి ప్రధాని కాలేరు.

కానీ సోనియాగాంధీ హృదయానికి శాంతి కలిగి ఉంటుంది. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్, మిత్రపక్షాలు నిర్వహించింది ’ఓట్‌ బచావో’ కాదు...’ఘుస్‌బైటియా (చొరబాటుదారుల) బచావో’ ర్యాలీ. రాహుల్‌ బాబా, సీఎం రేవంత్‌రెడ్డి ఎంత గింజుకున్నా ఒక్క అక్రమ చొరబాటుదారుడిని కూడా ఓటర్ల జాబితాలో, అసలు దేశంలోనే ఉండబోనివ్వబోం. దేశవ్యాప్తంగా సర్‌ ప్రక్రియతో పాటు..గతంలో  కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకున్న ఎన్‌ఆర్‌సీని కూడా కచ్చితంగా చేపట్టి తీరుతాం. 

రాహుల్‌కు కడుపు మంట ఎందుకు ? 
సర్‌ ప్రక్రియతో బోగస్‌ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్‌ గాంధీకి కడుపుమంట ఎందుకు? దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ రాహుల్‌ గాంధీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం 13 కోట్ల ఓట్లలో దాదాపు 6.5 కోట్ల ఓట్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారివి. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు వేసే హక్కు ఉంటుందా? దాదాపు 3 కోట్లు చనిపోయిన వారివి. చనిపోయిన వారి పేరిట కాంగ్రెస్‌ బోగస్‌ ఓటింగ్‌ చేయాలని చూస్తోంది.

మరో కోటి ఓట్లు డూప్లికేట్‌ ఎంట్రీలు. మిగిలిన 3 కోట్ల ఓట్లు దేశంలో ఉనికిలోనే లేని బంగ్లాదేశ్‌ చొరబాటుదారులవి. ఈ రకమైన ఓట్లను జాబితాలో నుంచి తొలగించాలా వద్దా? (సభికులు తొలగించాలంటూ అరిచారు). ఈ నకిలీ, చొరబాటుదారుల ఓట్లను కాపాడేందుకే రాహుత్‌గాంధీ గగ్గోలు పెడుతున్నారు. సర్‌కు సంబంధించిన వాస్తవాలతో తెలుగులో ముద్రించిన బుక్‌లెట్లను బీజేపీ కార్యకర్తలు తెలంగాణలోని ఇంటింటికీ తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌గాంధీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ఎండగట్టాలి..’ అని అమిత్‌ షా పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, అర్వింద్‌ ధర్మపురి, గోడెం నగేష్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఇతర నేతలు పాల్గొన్నారు.  

భాగ్యలక్ష్మీ ఆలయంలో హారతి ఇచ్చిన అమిత్‌షా 
చారి్మనార్‌: అమిత్‌ షా సోమవారం చారి్మనార్‌  భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి స్వీకరించిన తర్వాత ఆయన స్వయంగా హారతి పళ్లెం పట్టుకుని భక్తులకు చూపిస్తూ హారతి ఇచ్చారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు, గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు టి.ఉమామహేందర్‌లతో కలిసి ఆలయానికి చేరుకున్న అమిత్‌ షాకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం లభించింది. అఫ్జల్‌గంజ్‌ నుంచి నయాపూల్, మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్‌ మీదుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు, ట్రస్టీ శశికళ బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించింది. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసింది. 

అరాచకత్వాన్ని అంతం చేయాలి..
పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్‌ది. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో ఆయనపై కనీసం పావలా (చార్‌ అణా) అవినీతి ఆరోపణ కూడా చేయలేకపోయారు. కాంగ్రెస్‌ అవినీతిపై పోరాడి ప్రజలకు న్యాయం చేసే ఏకైక శక్తి బీజేపీ మాత్రమే. 

పార్లమెంటులో చర్చకు ఎందుకు రారు? 
రాహుల్‌ బాబా, సీఎం రేవంత్‌రెడ్డి ఎంత గింజుకున్నా ఒక్క అక్రమ చొరబాటుదారుడిని కూడా ఓటర్ల జాబితాలో, అసలు దేశంలోనే ఉండబోనివ్వం. దేశవ్యాప్తంగా సర్‌ ప్రక్రియతో పాటు..గతంలో  కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకున్న ఎన్‌ఆర్‌సీని కూడా కచ్చితంగా చేపట్టి తీరుతాం. 

రాహుల్‌కు కడుపుమంట ఎందుకు?
సర్‌కు సంబంధించిన వాస్తవాలతో తెలుగులో ముద్రించిన బుక్‌లెట్లను బీజేపీ కార్యకర్తలు తెలంగాణలోని ఇంటింటికీ తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌గాంధీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ఎండగట్టాలి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement