సాక్షి, వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాలమూరు ప్రాంతంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం, జూరాల నుంచి అందుబాటులో ఉన్న కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎనిమిదేళ్ల పాటు రెండు పంటలు పండిన ప్రాంతంలో ఈసారి తొలి పంట కూడా ఎండిపోయిందని అన్నారు.
"కృష్ణా నీటిని ఎత్తకుండా పాలమూరుకు కరువు తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎప్పుడూ పంటలు ఎండిపోలేదు. ప్రజలకు భరోసా ఇవ్వడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారు. కాంగ్రెస్ నిర్లక్ష‍్యంతోనే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ చేసిన పాపం ప్రజలకు శాపంగా మారింది. ప్రజల సంక్షేమం సీఎం రేవంత్‌కు పట్టదని, కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు" అని హరీష్ రావు మండిపడ్డారు.
అంతేకాదు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 18 టీఎంసీలకే పరిమితమైందని విమర్శించారు. శ్రీశైలం, జూరాల నుంచి వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరువుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం, యాసంగి రైతుబంధు అందించాలని ఆయన కోరారు.
కరువు మండలాల ప్రకటనకే ప్రభుత్వం పరిమితమైందని, కరువు పరిస్థితులను పరిశీలించేందుకు తక్షణమే కేంద్ర బృందాన్ని పంపించాలని డిమాండ్ చేశారు. రైతులకు ధైర్యం చెప్పేందుకే తాము పర్యటిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: ‘కౌంటింగ్‌లో పూర్తి అప్రమత్తంగా ఉండండి’


