సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ‘ఓట్ బచావో... దేశ్ బచావో’ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ర్యాలీ కారణంగా తమకు రూ. 11వేల కోట్ల మేర భారీగా వ్యాపార నష్టం వాటిల్లినట్లు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఆరోపణలు చేసింది. ఈ నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారని, నష్ట పరిహారం ఎవరు చెల్లిస్తారని సీటీఐ ప్రశ్నించింది.
ధన్‌తేరాస్, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఢిల్లీలోని మార్కెట్లు అన్నీ కొనుగోలుదారులతో కళకళలాడాల్సిన కీలక సమయం ఇది. సరిగ్గా ఇదే తరుణంలో కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల జాబితాలు, ఈసీఐ విధానాలకు వ్యతిరేకంగా రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభ కారణంగా చాందినీ చౌక్, కరోల్ బాగ్ వంటి ప్రముఖ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లతో కలిపి సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడ్డాయని సిటిఐ వెల్లడించింది.తద్వారా ఈ భారీ నష్టం వాటిల్లింది.
ఈ భారీ నష్టంపై సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయెల్ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సీజన్ వ్యాపారాలపై భారీ ప్రభావం పడుతుందని ముందే ఊహించి.. ఈ ర్యాలీని దీపావళి తర్వాత నిర్వహించాలని మేము ప్రతిపక్ష నాయకులను కోరాము. కానీ మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ భారీ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ లోటును ఎవరు పూడుస్తారు? ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులు నష్టపరిహారం చెల్లిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు.
మేము బీజేపీకి తొత్తులం కామని, కేవలం వ్యాపారుల సంక్షేమం కోసమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీకి రావాల్సిన సుమారు 3 నుండి 4 లక్షల మంది కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారులు రాలేకపోవడం వల్ల వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ కౌంటర్
మరోవైపు, వ్యాపారుల ఆందోళనలు,ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ ర్యాలీకి వచ్చే ప్రజలు స్థానికంగా కొనుగోళ్లు చేసుకోవాలని తాము ముందే చెప్పామని, అయితే కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో బీజేపీ శ్రేణులే కావాల బలవంతంగా దుకాణాలను మూయించేశాయని ఆయన ఆరోపించారు. మొత్తానికి, ఎన్నికల వేడిలో తలపెట్టిన ఈ భారీ రాజకీయ సభ.. పండుగ వేళ వ్యాపారులకు తీరని ఆర్థిక నష్టాన్ని మిగల్చడంతో పాటు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.


