న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీల మైదాన్‌లో ఆదివారం జరిగిన ఇండియా కూటమి భారీ ర్యాలీ వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తే చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కార్యకర్తలు, మద్దతుదారులను సమీకరించింది. ఇందుకోసం రాష్ట్రాల వారీగా జనసమీకరణ లక్ష్యాలను నిర్దేశించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలకు వసతి కల్పించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందుగానే ఏర్పాట్లు చేసింది.
ఒక్కో నేతకు 100 మంది బాధ్యత
తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ప్రదేశ్ స్థాయి నాయకుడికి తమ నియోజకవర్గం నుంచి సుమారు 100 మందిని ఢిల్లీకి తీసుకురావాలని బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలకు వసంత్ కుంజ్‌లోని హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు. కొందరు రైళ్లలో, మరికొందరు విమానాల్లో ఢిల్లీకి చేరుకున్నారు. ర్యాలీకి ముందుగానే వివిధ బృందాలు అక్కడ బస చేశాయి. జనసమీకరణ కోసం పార్టీ నాయకులు ముందస్తు ప్రణాళికతో పనిచేశారు.
వారం రోజుల పాటు సాంస్కృతిక ప్రదర్శనల రిహార్సల్స్
ర్యాలీకి కార్యకర్తలను తరలించడమే కాకుండా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను కూడా రూపొందించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన కళాకారులను పార్టీ నేతలు ఎంపిక చేశారు. వీరంతా ఢిల్లీకి వెళ్లడానికి ముందే దాదాపు వారం రోజుల పాటు ప్రదర్శనల కోసం సాధన చేశారు. సంప్రదాయ దుస్తులను కూడా వెంట తీసుకొచ్చారు. ప్రాంతీయ, గిరిజన సంస్కృతులను ప్రదర్శించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్ నారాయణ్ సింగ్ రాథియా వెల్లడించారు.
500 మంది మహిళా కార్యకర్తలు హాజరు
మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొనేలా పార్టీ ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చందా వెరగ్డే తెలిపిన వివరాల ప్రకారం.. తమ ప్రాంతం నుంచి సుమారు 500 మంది మహిళలు రైలులో ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 30న అక్కడికి చేరుకున్న వీరు రెండు రోజుల పాటు ర్యాలీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత రెండు వారాలుగా మహిళలను సమీకరించేందుకు ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు. తొలిసారిగా ఢిల్లీకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
19 పార్టీల నేతలతో భారీ ప్రదర్శన
ఇండియా కూటమి నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం ప్రతిపక్షాల ఐక్యతను చాటే ప్రయత్నంగా నిలిచింది. ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో కనాట్ ప్లేస్ సమీపం నుంచి రామలీలా మైదాన్ వరకు 1.3 కిలోమీటర్ల మేర ప్రదర్శన ప్రారంభమైంది. 19కు పైగా పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా తదితరులు రాజస్థాన్ నుంచి తెప్పించిన ఓపెన్ టాప్ బస్సుల్లో ప్రయాణించారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ ప్రదర్శన మధ్యాహ్నం 2.30 గంటలకు రామలీలా మైదాన్‌కు చేరుకుంది.
ఖాళీ కుర్చీలపై బీజేపీ విమర్శలు
ర్యాలీకి హాజరైన జనసమూహంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగాయి. రామలీల మైదాన్‌లో 40 శాతం స్థలం ఖాళీగా ఉందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఆరోపించారు. 10 లక్షల మంది వస్తారని కాంగ్రెస్ చెప్పిందని, అయితే 28 వేల కుర్చీల్లో సుమారు 5 వేల నుంచి 7 వేల వరకు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు, రామలీల మైదాన్ నిండిపోయినట్లు చూపించేందుకు కాంగ్రెస్ ఏఐతో రూపొందించిన నకిలీ ఫొటోను ప్రచారం చేసిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ఈ ఆరోపణలతో ర్యాలీకి హాజరైన వారి సంఖ్యపై రాజకీయ చర్చ మొదలైంది.
ఇదీ చదవండి: షాకిస్తున్న 19 ఏళ్ల ‘పూకీ బాబా’.. ‘అందగాడే..వాడూ’..!


