ఈ–పాస్‌పోర్టు ఉన్న భారతీయులకే అవకాశం
ఏడు విమానాశ్రయాల్లో ట్రయల్స్ ప్రారంభం
2027లో మరిన్ని విమానాశ్రయాలకు విస్తరణ
కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశీయ విమానాశ్రయాల్లో విజయవంతంగా అమలవుతున్న డిజి యాత్ర సేవలను అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరించే దిశగా ప్రయోగాత్మక పరీక్షలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ట్రయల్స్ సాగుతాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రయాణికుల అభిప్రాయాలు, సూచనలు సేకరించి 2027లో మరింత విస్తృ్తతంగా సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్‌తో సహా ఏడు నగరాలు..
తొలి విడతలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, ముంబై, చెన్నై, అమృత్‌సర్ విమానాశ్రయాల్లో డిజి యాత్ర సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ–పాస్‌పోర్టులు కలిగిన అర్హులైన భారతీయ పౌరులు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు నిర్వహించే ఎంపిక చేసిన అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే సమయంలో దీనిని వినియోగించుకోవచ్చు.
ఈ–పాస్‌పోర్టుతో డిజిటల్ గుర్తింపు
ఈ సదుపాయాన్ని పొందాలంటే ప్రయాణికులు ముందుగా డిజియాత్ర మొబైల్ యాప్‌లో ఈ–పాస్‌పోర్టు ఆధారంగా వెరిఫై చేయగలిగే డిజిటల్ గుర్తింపును (వెరిఫయబుల్ క్రెడెన్షియల్) రూపొందించుకోవాలి. ఇందుకోసం పాస్‌పోర్టులోని ఎంఆర్‌జెడ్‌ను స్కాన్ చేసి, ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ఎల్రక్టానిక్ చిప్‌లోని వివరాలను చదవాలి. అనంతరం సెల్ఫీ తీసుకుని వివరాలను ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక డిజిటల్ గుర్తింపు మొబైల్‌లోని డిజియాత్ర వాలెట్‌లో చేరుతుంది. అయితే డిజియాత్ర వినియోగం వల్ల ప్రస్తుత ప్రయాణ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రయాణికులు పాస్‌పోర్టు, ఇతర ప్రయాణ పత్రాలను వెంట ఉంచుకోవడంతోపాటు విమానయాన సంస్థల తనిఖీలు, ఇమిగ్రేషన్ ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.


