ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు! | RTI Reveal Cabinet Secretariat declined complaints against senior EC officer | Sakshi
Sakshi News home page

ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు!

Oct 23 2026 9:02 AM | Updated on Oct 23 2026 9:06 AM

RTI Reveal Cabinet Secretariat declined complaints against senior EC officer

కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారుల మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు స్వయంగా కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కీలక పత్రాలు దేశవ్యాప్తంగా అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇద్దరు కమిషనర్ల ఫిర్యాదులపై కేంద్రం నేరుగా చర్యలు తీసుకోకపోవడం, వాటిని భవిష్యత్తు పరిశీలన కోసం రికార్డుల్లో ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా, కేంద్ర ఎన్నికల సంఘంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి మనీష్ గార్గ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ వివాదానికి మూలకారణంగా మారాయి. మనీష్‌ గార్గ్‌ విధుల కేటాయింపుపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు లేఖలు రాశారు. అయితే, ఈ ఫిర్యాదులపై నేరుగా చర్యలు తీసుకునేందుకు కేబినెట్‌ సెక్రటేరియట్‌ నిరాకరించింది. ఎన్నికల సంఘం తరఫున అధికారికంగా ఫిర్యాదు అందలేదని, ఇద్దరు కమిషనర్లు వ్యక్తిగత హోదాలో లేఖలు పంపారని స్పష్టం చేసింది. ఆర్టీఐ ద్వారా వెల్లడైన పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, డైరెక్టర్‌ జనరల్స్‌ తదితర అధికారుల మధ్య విధులను మనీష్‌ గార్గ్‌ మార్చారని ఇద్దరు కమిషనర్లు ఆరోపించారు. ఈ మార్పులకు ముందు కమిషన్‌తో చర్చించలేదని, ఆమోదం తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత ఫైల్‌ను కోరినా పరిపాలనా విభాగం అందించలేదని వివేక్‌ జోషి పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపుల అధికారాలు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం తెలిపింది.

ఫిర్యాదులపై కేంద్రం వైఖరి
ఈ ఏడాది జూలై 29న పంపిన లేఖలను కేబినెట్‌ సెక్రటేరియట్‌ ఆగస్టు 5న స్వీకరించింది. వాటిని సంబంధిత కేంద్ర విభాగాలకు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి పంపింది. అయితే, ఎన్నికల సంఘం నుంచి అధికారిక సమాచారం లేకుండా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగబద్ధ సంస్థ స్వతంత్రతకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల ఫిర్యాదులపై నేరుగా చర్యలు తీసుకోకుండా, భవిష్యత్తులో మనీష్‌ గార్గ్‌కు సంబంధించిన నిర్ణయాల సమయంలో పరిగణనలోకి తీసుకునేలా వాటిని రికార్డుల్లో ఉంచింది.

ఉత్తర్వులు అమలు కాలేదన్న ఈసీ
మనీష్‌ గార్గ్‌ను 2024 సెప్టెంబర్‌ 2న కేంద్ర కేబినెట్‌ నియామకాల కమిటీ ఎన్నికల సంఘానికి నియమించింది. మరోవైపు, విధుల పునఃకేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు ఇద్దరు కమిషనర్ల ఆదేశాల మేరకు అమలు కాలేదని ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 26న తెలిపింది. ఈ వివాదంపై మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా ఎన్నికల సంఘం సమావేశంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారా అని ప్రశ్నించారు. ఇద్దరు కమిషనర్ల ఫిర్యాదులపై కేంద్రం నేరుగా చర్యలు తీసుకోకపోవడం, వాటిని భవిష్యత్తు పరిశీలన కోసం రికార్డుల్లో ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన నోటీసు ఇస్తే నిబంధనల ప్రకారమే నడుచుకుంటా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement