కేంద్ర సాయంపై స్పష్టత ‘కరువు’ | Telangana seeks Centre relief amid drought | Sakshi
Sakshi News home page

కేంద్ర సాయంపై స్పష్టత ‘కరువు’

Oct 26 2026 4:37 AM | Updated on Oct 26 2026 4:37 AM

Telangana seeks Centre relief amid drought

తీవ్ర కరువు మండలాలకే  ప్రాధాన్యం.. మధ్యస్థ కరువుపై నిధుల సందిగ్ధం

కరువు కోరల్లో 358 మండలాలు.. కేంద్ర సాయం చిక్కులమయం.. వర్షపాత ప్రమాణాలు చేరని మండలాల ప్రతిపాదనపై ఉత్కంఠ

ఈ నెల 31లోగా కేంద్రానికి నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు పరిస్థి­తులు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా­యి. పత్తి దిగుబడులు పడిపోతుండగా, చివరి తడికి నీరు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయి. మరోవైపు కరువు బాధిత రైతులకు అందే ఆర్థిక సాయంపై అనిశ్చితి నెలకొంది. రాష్ట్రంలో 358 మండలాలను ప్రాథమికంగా కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ప్రభుత్వం వీటికి సంబంధించి సమగ్ర నివేదికను ఈనెల 31లోగా కేంద్రానికి పంపేందుకు సిద్ధమ­వుతోంది. 

అయితే, కేంద్ర మార్గదర్శకాలు, కరువు తీవ్రత నిర్ధారణ, పంట నష్టం వివరాల ఆధారంగా ఎంతమేరకు ఆర్థిక సాయం అందుతుందన్నది కీలకంగా మా­రింది. ఇటీవల కరువు పరిస్థితులపై జరిగిన సమీక్షలో 358 మండలాలను ప్రాథమికంగా గుర్తించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాలు లోటు వర్షపాతం నమోదుకాగా, మరోవైపు 324 మండలాల్లో భూగర్భ జలమట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి.

తీవ్రత నిర్ధారణే కీలకం
కేంద్రానికి సమర్పించే నివేదికలో కరువు తీవ్ర­తను నిర్ధారించేందుకు వర్షపాతం, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, నేలలో తేమ, భూగర్భ జలాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రం ప్రాథమికంగా గుర్తించిన మండలాలన్నింటికీ ఒకే స్థాయిలో ఆర్థిక సాయం అందుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. తీవ్ర కరువు నిర్ధారణతోపాటు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలు సమర్పించడం కీలకం. కేంద్రం నుంచి జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్‌డీ­ఆర్‌ఎఫ్‌) కింద అదనపు సాయం కోరేందు­కు రాష్ట్రం నిర్దేశిత విధానాన్ని అనుసరించాలి.

 సాధారణంగా తీవ్ర కరువు పరిస్థి­తుల్లో ఈ నిధి నుంచి సాయం కోరుతారు. అయితే, రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎస్‌డీ­ఆర్‌ఎఫ్‌) సరిపోని పరిస్థితుల్లో మధ్యస్థ కరువుకూ కేంద్ర సాయం కోరే అవకాశం ఉంది. అందువల్ల మధ్యస్థ కరు­వు మండలాలకు కేంద్ర సాయం అందదని ముందుగానే నిర్ధారించలేం. రాష్ట్రం సమ­ర్పించే నివేదిక, అందులోని ఆధారాలు, కేంద్ర పరిశీలనపై సాయం ఆధారపడి ఉంటుంది.

వర్షపాతమే అడ్డంకిగా మారుతుందా?
కరువు అంచనాల్లో వర్షపాతంతోపాటు పంట నష్టం, సాగు విస్తీర్ణం, నేలలో తేమ వంటి ఇతర ప్రమాణాలకూ ప్రాధాన్యం ఉంది. వర్షపాత ప్రమాణాలను చేరుకోని మండలాల్లోనూ పంటలకు నష్టం జరిగి ఉండొచ్చు. అలాంటి ప్రాంతాలను అదనంగా ప్రతిపాదిస్తే, వాటికి సంబంధించిన క్షేత్ర­స్థాయి పరిశీలన, పంట నష్టం గణాంకాలు, ఇతర ఆధారాలను నివేదికలో స్పష్టంగా పొందుపరచాల్సి ఉంటుంది. రాష్ట్రం అద­నంగా ప్రతిపాదించినట్లు చెబుతున్న 43 మండలాలకు సంబంధించి వర్షపాత ప్రమా­ణా­లు, పంట నష్టం వివరాలు, జిల్లా వారీ సంఖ్యలపై అధికారిక నివేదిక అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ మండలాలను కేంద్రం ఆమోదిస్తుందా? లేదా? అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేని అంశం. కేంద్రం ఆమోదించని పక్షంలో అక్కడి రైతులకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది కీలకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement