రేపట్నుంచి మూడ్రోజులు వర్షాలు | Red Alert Issued To Heavy Rains In Telangana | Sakshi
Sakshi News home page

రేపట్నుంచి మూడ్రోజులు వర్షాలు

Oct 26 2026 4:17 AM | Updated on Oct 26 2026 4:17 AM

Red Alert Issued To Heavy Rains In Telangana

ఈనెల 28న భారీ నుంచి అతిభారీ వర్షాలకు చాన్స్‌ 

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ  

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: తూర్పు–మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నేటికి (సోమవారం) తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి ఈనెల 27న తీవ్ర తుపాను, 28వ తేదీ నాటికి అతి తీవ్ర తుపానుగా మారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నప్పటికీ తుపాను దిశను బట్టి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

ఈనెల 27–29వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం తర్వాత వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 28న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆ మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అదేవిధంగా జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 

మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 27–29 తేదీల మధ్య మేఘావృత వాతావరణంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29న కూడా రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కొనసాగవచ్చు. ఈనెల 30 నుంచి వర్షాల తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను దిశ, వేగంలో మార్పులను బట్టి జిల్లాల వారీగా వర్షాల అంచనాలు మారవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement