కల్లూరు సమీపాన రహదారి పక్కన ధాన్యం కాంటా వేస్తున్న హమాలీలు
వర్షాభావంతో తగ్గిన పంటల దిగుబడి
ఫలితంగా పెరిగిన డిమాండ్.. పత్తి, వరికి మద్దతుకు మించి ధర
కొనుగోలుకు స్థానిక, ఇతర రాష్ట్రాల వ్యాపారుల పోటాపోటీ
కల్లాల్లో పచ్చి వడ్లు.. తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేస్తున్న వైనం
ఒకప్పుడు..
ధాన్యం, పత్తి పంటలకు ప్రభుత్వాలు ప్రకటించిన కనీస మద్దతు ధర రావాలంటే నిర్దేశిత తేమ ఉండాలి. ఆ తర్వాత కూడా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, కాంటా, ఆపై మిల్లులకు చేరే వరకు రైతులకు అష్టకష్టాలే..
ఇప్పుడు..
రైతుల వద్దకే వ్యాపారులు క్యూ కడుతున్నారు. పంట పచ్చిగా ఉన్నా, తేమ ఉన్నా కళ్లకు అద్దుకొని మరీ మద్దతు ధరకు మించి చెల్లించి కల్లాల వద్దే కొనేస్తున్నారు. ఎందుకని ఆరా తీస్తే.. వర్షాల్లేక పంట దిగుబడులు తగ్గడంతో ఉన్న పంటకు డిమాండ్ పెరిగింది. వచ్చే ఏడాదీ ఈ ప్రభావం ఉంటుందనే అంచనాతో వ్యాపారులు ఇలా కొని నిల్వ చేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఈ వానాకాలం రాష్ట్రవ్యాప్తంగా 56.80 లక్షల ఎకరాల్లో వరి, 48.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గత ఏడాదితో పోలిస్తే తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగు చేశారు. అయితే, వర్షాభావంతోపాటు ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడం, భూగర్భ జలాలు తగ్గడం, విద్యుత్ కోతలతో పంటలపై ప్రభావం పడింది. పత్తి ఎకరానికి 4–5 క్వింటాళ్లు మించి దిగుబడి రావడం లేదు. ఇప్పుడిప్పుడే కోతలు వరి కూడా 25–28 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా.
అంతకు మించి..
ఈ ఏడాది సన్న రకం వరి ధాన్యం క్వింటాకు రూ.2,441కు మద్దతు ధర ప్రకటించారు. గత ఏడాది కన్నా రూ.72 ఎక్కువ. పత్తి ధర గత ఏడాది కన్నా రూ.557 పెంచి రూ.8,667గా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అయితే, కల్లాల వద్దే పచ్చి ధాన్యం క్వింటాకు వ్యాపారులు రూ.3 వేల నుంచి రూ.3,400 చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ధర రూ.2,441, బోనస్ రూ.500 కలిపినా అంతకు మించి అదనంగా పలుకుతోంది. ఇక పత్తికి గరిష్టంగా రూ.9,200 ధర ఖరారవుతోంది.
కనీస మద్దతు కన్నా బహిరంగ మార్కెట్‌లో అధికంగా ఉండటంతో ఈసారి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సీసీఐ కేంద్రాలకు పంటలు వచ్చేది తక్కువేన్న భావన వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోలు, సీసీఐ కేంద్రాలు సిద్ధమయ్యే లోపు పంటను దక్కించుకునేలా వ్యాపారులు గ్రామాల బాట పట్టారు. తెలంగాణ వ్యాపారులే కాక మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని వ్యాపారులు సైతం ఇక్కడి ఏజెంట్ల ద్వారా సన్న ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు పత్తిని కూడా ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
క్వింటా పత్తి రూ.9వేలకు విక్రయించా..
మూడెకరాల్లో పత్తి వేస్తే ఎకరాకు ఐదు క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. వాతావరణ పరిస్థితులతో దిగుబడి తగ్గింది. ఈ పంటను ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొస్తే క్వింటా రూ.9వేలు పలికింది. పంట దిగుబడి బాగుంటే మరిన్ని లాభాలు వచ్చేవి.
– బుద్దాల నరేష్, గోవిందాపురం, ఖమ్మం జిల్లా
ధర పెరిగింది.. దిగుబడి తగ్గింది..
రెండెకరాల్లో పత్తి సాగు చేస్తే వర్షాలు లేక దిగుబడి పడిపోయింది. ఎకరానికి 2–3 క్వింటాళ్లకు మించి రావడం లేదు. పంట విక్రయానికి తీసుకొచ్చా. క్వింటా రూ.9,100 పలికింది
– గుగులోత్ కిషన్, చిలుకోడు, మహబూబాబాద్ జిల్లా


